Wednesday, May 14, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 287

కొమ్మకు

10.1-1028-సీ.
కొమ్మకుఁ బువ్వులు కోసినాఁ డిక్కడ;
 మొనసి పాదాగ్రంబు మోపినాఁడు
సతి నెత్తుకొని వేడ్క జరిగినాఁ డిక్కడఁ;
 దృణములోఁ దోపఁదు తెఱవ జాడ
ప్రియకు ధమ్మిల్లంబు పెట్టినాఁ డిక్కడఁ;
 గూర్చున్న చొప్పిదె కొమరు మిగులు
నింతికిఁ గెమ్మోవి యిచ్చినాఁ డిక్కడ;
 వెలఁది నిక్కిన గతి విశదమయ్యె
ఆ.
సుదతితోడ నీరు చొచ్చినాఁ డిక్కడఁ
జొచ్చి తో వెడలిన చోటు లమరెఁ
దరుణిఁ గాముకేళిఁ దనిపినాఁ డిక్కడఁ
ననఁగి పెనఁగియున్న యంద మొప్పె.
       మురళీలోలుడు ఇక్కడ మునివేళ్ళు మాత్రమే నేలపై మోపాడు, ముదితకు పూలుకోసినాడేమో; నెలత నెత్తుకొని ముదుకెళ్లాడేమో ఇక్కడ ఆమె అడుగుల జాడలు కనబడటం లేదు; ఇద్దరు కూర్చున్న ఈ చోటు సొగసుగా ఉంది, ఇక్కడ కొమరాలి కొప్పు సవరించి ఉంటాడు; ఇక్కడ నీలవేణి నిక్కినతీరు తేటపడుతోంది, అతివకు అరుణాధర మిచ్చాడేమో; ఇక్కడ కొలనులోకి దిగిన ఆనమాళ్ళు స్పష్టంగా కనబడుతున్నాయి, కాంతతో కొలను నీటిలోకి ప్రవేశించాడేమో; ఇక్కడ గడ్డిగాదము అణగి, పెనగిన ఆనవాలు కానవస్తోంది, మగువను మదనకేళిలో తనిపినాడేమో.
బృందావనంలో గోపికలు కృష్ణునితో రమిస్తుండగా, ఆయన చటుక్కున అదృశ్యమైనాడు. ఇలా విరహంతో వెదుకులాడుతున్న గోపికలు ఆయన మెలగిన జాడలు పట్టి పట్టి చూస్తున్నారు.
10.1-1028-see.
kommaku@M buvvulu kOsinaa@M DikkaDa;
monasi paadaagraMbu mOpinaa@MDu
sati nettukoni vaeDka jariginaa@M DikkaDa@M;
dRNamulO@M dOpa@Mdu teRava jaaDa
priyaku dhammillaMbu peTTinaa@M DikkaDa@M;
goorchunna choppide komaru migulu
niMtiki@M gemmOvi yichchinaa@M DikkaDa;
vela@Mdi nikkina gati viSadamayye
aa.
sudatitODa neeru chochchinaa@M DikkaDa@M
jochchi tO veDalina chOTu lamare@M
daruNi@M gaamukaeLi@M danipinaa@M DikkaDa@M
nana@Mgi pena@Mgiyunna yaMda moppe.
కొమ్మ = స్త్రీ; కున్ = కోసము; పువ్వులు = పువ్వులను; కోసినాడు = కోసెను; ఇక్కడ = ఇక్కడ; మొనసి = పూని; పాద = పాదము యొక్క; అగ్రంబున్ = ముందు భాగము; మోపినాడు = ఆన్చెను; సతిన్ = స్త్రీని; ఎత్తుకొని = ఎత్తుకొని; వేడ్కన్ = వినోదముగ; జరిగినాడు = నడచినాడు; ఇక్కడ = ఇక్కడ; తృణము = గడ్డినేల; లోన్ = అందు; తోపదు = కనబడదు; తెఱవ = స్త్రీ; జాడ = గుర్తులు; ప్రియ = ప్రియురాలి; కున్ = కి; ధమిల్లంబున్ = కొప్పు; పెట్టినాడు = చుట్టెను; ఇక్కడ = ఇక్కడ; కూర్చున్న = కూర్చుండిన; చొప్పు = జాడ; ఇదె = ఇదిగో; కొమరు = అందము; మిగులు = అతిశయించున్నది; ఇంతి = స్త్రీ; కిన్ = కి; కెంపు = ఎర్రని; మోవి = పెదవి; ఇచ్చినాడు = అందిచ్చెను; ఇక్కడ = ఇక్కడ; వెలది = స్త్రీ; నిక్కిన = పైకి నిగిడిన; గతి = జాడ; విశదమయ్యెన్ = స్పష్టమై ఉన్నది; సుదతి = స్త్రీ; తోడన్ = తోటి; నీరున్ = నీటి యందు; చొచ్చినాడు = ప్రవేశించెను, దిగెను; ఇక్కడ = ఇక్కడ; చొచ్చి = దిగి; తోన్ = వెంటనే; వెడలిన = బయటికొచ్చిన; చోటులు = గుర్తులు; అమరెన్ = ఏర్పడినవి; తరుణిన్ = స్త్రీని; కాముకేళి = మన్మథక్రీడ యందు; తనిపినాడు = తృప్తిపరచెను; ఇక్కడ = ఇక్కడ; అణగి = అణిగిపోయి; పెనగి = కలిసిమెలిసి; ఉన్న = ఉన్నట్టి; అందము = విధము; ఒప్పెన్ = చక్కగానున్నది.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Monday, May 12, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 286

శంభుకంట

10.1-805-ఆ.
శంభుకంట నొకటి జలరాశి నొక్కటి
మఱియు నొకటి మనుజ మందిరముల
నొదిగెఁ గాక మెఱసి యున్న మూడగ్నులు
చలికి యులికి భక్తి సలుప కున్నె?
          చలిదెబ్బకు తట్టకోలేక త్రేతాగ్నులు మూడు అగ్నులలోను ఆహవనీయం అనే అగ్ని ఒకటి శివుని మూడోవ నేత్రంలో అణగి ఉంది. దక్షిణాగ్ని అనే మరొకటి సాగర గర్భంలో చొచ్చింది. గార్హపత్యం అనే అగ్ని ఇంకొకటి గృహస్తుల ఇండ్లలో ఒదిగి ఉంది. అలాకాక బట్టబయల ఉంటే హేమంతఋతు చలికి త్రేతాగ్నులు కొకంర్లు తిరిగి పోయేవి.
చక్కటి ఈ హేమతఋతువర్ణన ఆటవెలదిలోని కవిచమత్కారం ఎంతో అందంగా ఉంది.
10.1-805-aa.
SaMbhukaMTa nokaTi jalaraaSi nokkaTi
maRiyu nokaTi manuja maMdiramula
nodige@M gaaka meRasi yunna mooDagnulu
chaliki yuliki bhakti salupa kunne?
          శంభు = శివుని; కంటన్ = కంటి యందు; ఒకటి = ఒకటి; జలరాశిన్ = సముద్రము నందు; ఒక్కటి = ఒకటి; మఱియున్ = ఇంకను; ఒకటి = ఒకటి; మనుజ = మానవుల; మందిరములన్ = నివాసము లందు; ఒదిగెన్ = దాగెను; కాకన్ = లేకపోయినచో; మెఱసి = బహిరంగముగా మెలగుచు; ఉన్నన్ = ఉండినచో; మూడగ్నులు = త్రేతాగ్నులు మూడు {త్రేతాగ్నులు - 1గార్హపత్యము 2ఆహవనీయము 3దక్షిణాగ్నులు అనెడి మూడు అగ్నులు}; చలి = చలి; కిన్ = కి; ఉలికి = అదిరి బెదిరి; భక్తి = సేవ; సలుపకన్ = చేయకుండగా; ఉన్నె = ఉండునా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

తెలుగు భాగవత తేనె సోనలు – 285

అంధుండైనపతిన్

vidura_dhrutarashtra

1-318-శా.
అంధుండైన పతిన్ వరించి, పతిభావాసక్తి నేత్రద్వయీ
బంధాచ్ఛాదనమున్ ధరించి, నియమప్రఖ్యాతయై యున్న త
ద్గాంధారక్షితినాథుకూఁతురును యోగప్రీతి చిత్తంబులో
సంధిల్లం బతివెంట నేఁగె, నుదయత్సాధ్వీగుణారూఢయై.
గాంధారి ఉత్తమ ఇల్లాలు, పుణ్య పురంధ్రి, గాంధార మహారాజు గారాబు పుత్రిక. పుట్టంధు డైన భూ భర్తను భర్తగా వరించి, పతి చూడ లేని ప్రపంచాన్ని తను మాత్రం ఎందుకు చూడాలనే పట్టుదలతో కళ్లకు గంతలు కట్టుకొని, లోకావలోకనం పరిహరించిన ఆ సాధ్వీమణి అతిశయించిన వైరాగ్యభావంతో పతి వెంట బయలుదేరి వెళ్ళింది హిమాలయలకి.
విదురుడు విరక్తిమార్గం ఉపదేశించగా అతని వెనుక దృతరాష్ట్రుడు, అతని సతి గాంధారి హిమాలయాలకు బయలుదేరిన సందర్భలోని పద్య మిది
1-318-Saa.
aMdhuMDaina patin variMchi, patibhaavaasakti naetradvayee
baMdhaachChaadanamun dhariMchi, niyamaprakhyaatayai yunna ta
dgaaMdhaarakshitinaathukoo@Mturunu yOgapreeti chittaMbulO
saMdhillaM bativeMTa nae@Mge, nudayatsaadhveeguNaarooDhayai.
          అంధుండు = గ్రుడ్డివాడు; ఐన = అయినట్టి; పతిన్ = భర్తను; వరించి = ప్రేమించి; పతి = పతి యొక్క; భావా = స్థితిని అనుసరించు; ఆసక్తి = ఇష్టపూర్వక నిర్ణయముతో; నేత్ర = కన్నులు; ద్వయీ = రెంటికిని; బంధ = కట్టుటవలన; ఆచ్ఛాదనమున్ = కప్పియుంచునది; ధరించి = కట్టుకొనిన; నియమ = నియమము కలిగి ఉండుట లో; ప్రఖ్యాత = కీర్తి పొందినది; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నటువంటి; తత్ = ఆ; గాంధార క్షితి నాథు కూఁతురును = గాంధారి కూడ {గాంధార = గాంధార; క్షితి = దేశ; నాథు = రాజు; కూఁతురు = పుత్రిక, గాంధారి}; యోగప్రీతి = యోగమును అనుసరించు ఇష్టము; చిత్తంబు = మనసు; లోన్ = లో; సంధిల్లన్ = కూడిరాగా; పతి = భర్త; వెంటన్ = వెనుకనే; ఏఁగెన్ = వెళ్ళెను; ఉదయత్ = ఉద్భవించిన; సాధ్వీ = సాధు స్త్రీ; గుణ = గుణములు; ఆరూఢ = స్థిర పరచుకొన్నది; ఐ = అయ్యి.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~