10.2-1203-వ.
అని చెప్పిన బాదరాయణికి నభిమన్యునందనుం డిట్లనియె “మునీంద్రా! ఘటపటాదివస్తు జాతంబు భంగి నిర్దేశింప నర్హంబు గాక, సత్త్వాదిగుణశూన్యం బైన బ్రహ్మంబునందు సత్త్వాది గుణగోచరంబులైన వేదంబులే క్రమంబునం బ్రవర్తించు, నట్టి చందంబు నాకెఱిఁగింపు” మనిన భూవరునకు మునివరుం డిట్లనియె; “సకల చేతనాచేతనాంతర్యామియైన సర్వేశ్వరుండు సర్వశబ్దవాచ్యుండు గావున సకల జంతు నివహంబులందు బుద్ధీంద్రియమనః ప్రాణశరీరంబు లను సృజియించి; చేతనవర్గంబునకు జ్ఞానప్రదుండగుం గావున సకల నిగమసమూహంబులును దత్స్వరూప గుణవైభవప్రతిపాదకంబులు గావున, ముఖ్యంబై ప్రవర్తించు; శ్రుతిస్తోత్రం బుపనిషత్తుల్యంబు; ననేక పూర్వఋషి పరంపరాయాతంబును నైన దీనిని శ్రద్ధాయుక్తుండై యెవ్వం డనుసంధించు, నతనికి మోక్షంబు సులభంబు; దీనికి నారాయణాఖ్యాతంబగునొక్క యుపాఖ్యానంబు గలదు; వినిపింతు వినుము; భగవత్ప్రియుండైన నారదుం డొక్కనాఁడు నారాయణాశ్రమంబునకుం జని ఋషిగణసమేతుం డైన నారాయణఋషిం గనుంగొని నీవు నన్నడిగినట్ల యమ్మహాత్ముని నడిగిన నతండు మున్నీయర్థంబు శ్వేతద్వీపవాసులైన సనక సనందనాది దివ్యయోగీంద్రులు ప్రశ్న సలిపిన, వారలకు సనందనుండు చెప్పిన ప్రకారంబు నీ కెఱింగించెద” నని చెప్పందొడంగె; “శయానుం డైన రాజశ్రేష్ఠునిఁ దత్పరాక్రమ దక్షతాది చిహ్నంబు లను నుతియించు వందిజనంబుల చందంబున జగదవసాన సమయంబున ననేక శక్తియుతుండై యోగనిద్రావశుండైన సర్వేశ్వరుని వేదంబులు స్తోత్రంబుసేయు విధంబు నారాయణుండు నారదునకుం జెప్పిన తెఱుంగు విను"మని యిట్లనియె.
భావము:
ఇలా శుకమహర్షి చెప్పగా పరీక్షిత్తు ఆయనతో ఇలా అన్నాడు. “శుకమహర్షి! ఘటపటాదులలాగా నిర్దేశించటానికి వీలుగాకుండా సత్త్వాది గుణశూన్యమైన బ్రహ్మముతో సత్త్వాదిగుణాలకు లోబడిన వేదాలు ప్రవర్తించే విధానాన్ని చెప్పవలసింది” అని కోరాడు అందుకు శుకయోగీంద్రుడు పరీక్షన్నరేంద్రునకు ఇలా చెప్పసాగాడు. “సకల చరాచరములందు సర్వాంతర్యామియై ఉండు భగవంతుడు సమస్త చేతన వర్గానికీ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. కనుక వేదాదులు సర్వం ఆ పరమేశ్వరుని స్వరూప గుణ వైభవాలను స్తుతిస్తూ ఉంటాయి. అలాంటి శ్రుతిస్తోత్రం ఉపనిషత్తులతో సమానమైనది. ఎందరో మహర్షులు పూర్వం ప్రసాదించిన ఇది పరంపరాగతంగా అందుతోంది. దీనిని శ్రద్ధాపూర్వకంగా అనుసంధించే వారికి మోక్షం సులభ సాధ్యం అవుతుంది. దీనికి దృష్టాంతంగా నారాయణోపాఖ్యానము అనే ఒక పురాణకథ ఉంది. చెప్తాను, విను. పానుపుమీద పడుకుని ఉన్న రాజేంద్రుని పరాక్రమ సామర్ధ్యాలను వందిమాగధులు కొనియాడేవిధంగా కల్పాంతసమయంలో అనేక శక్తులతో కూడుకొని యోగనిద్రలో ఉన్న సర్వేశ్వరుడిని వేదాలు స్తోత్రం చేసే పద్ధతి (శ్రుతిగీతలు) ఎలాంటిదో పూర్వం సనందుడనే ముని, శ్వేతద్వీపవాసులైన సనకాది మునులు పరస్పరం చర్చించుకునే సందర్భంలో విశదీకరించాడు. దానిని నారాయణముని తన దగ్గరకు విచ్చేసిన నారదుడికి చెప్పాడు. ఆ వృత్తాతం వివరిస్తాను” అని శుకుడు పరీక్షత్తునకు ఇలా చెప్పసాగాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1203
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment