Wednesday, June 29, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౭౮(578)

( శ్రుతి గీతలు ) 

10.2-1204-సీ.
"జయజయ హరి! దేవ! సకలజంతువులకు-
  జ్ఞానప్రదుండవుగాన వారి
వలన దోషంబులు గలిగిన సుగుణ సం-
  తానంబుగాఁ గొని జ్ఞానశక్తి
ముఖ్యషడ్గుణ పరిపూర్ణతఁ జేసి మా-
  యాత్మవిశిష్టుండ వగుచుఁ గార్య
కారణాత్మకుఁడవై కడఁగి చరించుచు-
  నున్న నీయందుఁ బయోరుహాక్ష!
10.2-1204.1-తే.
తివిరి యామ్నాయములు ప్రవర్తించుఁ గాన
ప్రకట త్రిగుణాత్మకం బైన ప్రకృతితోడి
యోగ మింతయు మాన్పవే! యోగిమాన
సాంబుజాత మధువ్రత!" యని నుతించి.
10.2-1205-వ.
"అదియునుం గాక.

భావము:
“ఓ దేవ! శ్రీహరి! పద్మాక్షా! మహర్షి మానస విహారా! నీకు జయమగు గాక, నీవు సకల ప్రాణులకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడివి. కనుక, ఆ జీవుల వలన దోషాలు ఏమి కలిగిన మంచి తనయులనుగానే స్వీకరిస్తావు. భాగవత సద్గుణైశ్వర్య సంపన్నుండవు కావున, మా అందరిలోను ఆత్మరూపంతో ఉంటావు. కార్యకారణాత్మకుడవై ప్రవర్తిస్తుంటావు. నీ లోనే సకలవేదాలు ప్రవర్తిస్తాయి. సత్త్వరజస్తమోగుణాలు అనే త్రిగుణాత్మక ప్రకృతితో మా కున్న బంధాన్ని ఛేదించు.” అని భగవంతుని కీర్తించి ఇంకా ఇలా పలుకసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1204

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

No comments: