Sunday, May 1, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౩౧(531)

( వసుదేవుని గ్రతువు ) 

10.2-1123-సీ.
అ మ్మునీశ్వరులకు నానకదుందుభి-
  యతిభక్తి వందనం బాచరించి
"తాపసోత్తములార! ధర్మతత్త్వజ్ఞులు-
  మన్నించి వినుఁడు నా విన్నపంబు
సత్కర్మ వితతిచే సంచితకర్మ చ-
  యంబు వాపెడు నుపాయంబు నాకు
ఘన దయామతిఁ జెప్పుఁ" డనిన న మ్మునివరుల్‌-
  భూవరుల్‌ విన వసుదేవుఁ జూచి
10.2-1123.1-తే.
యెలమిఁ "బలికిరి నిఖిల యజ్ఞేశుఁ డైన
కమలలోచనుఁ గూర్చి యాగములు సేయు;
కర్మమునఁ బాయు నెట్టి దుష్కర్మ మైన;
నిదియె ధర్మంబు గాఁగ నీ మదిఁ దలంపు.

భావము:
వసుదేవుడు ఆ మహర్షులకు నమస్కారం చేసి, “ఋషివరులారా! మీరు ధర్మతత్వజ్ఞులు. క్షమించి నా మనవి ఆలకించండి. సత్కర్మల ద్వారా పూర్వజన్మ కర్మలను పోగొట్టుకునే ఉపాయం నాకు దయతో తెలియ జెప్పండి.” అని ప్రార్థించాడు. అప్పుడా మునీశ్వరులు రాజులు అందరూ వింటూండగా వసుదేవునితో ఇలా అన్నారు. “ఈ శ్రీకృష్ణుడు సమస్త యజ్ఞాలకూ అధీశ్వరుడు; ఈ పుండరీకాక్షుడి గురించి చేసే యాగం వలన ఎలాంటి దుష్కర్మమైనా తొలగిపోతుంది. దీన్నే ధర్మంగా గ్రహించు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=79&Padyam=1123

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: