Saturday, May 14, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౪౨(542)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1143-సీ.
సురభి కాలాగరు హరిచంద నై లాది-
  ధూపంబు లా విశ్వరూపకులకుఁ,
గాంచనపాత్ర సంగతరత్న కర్పూర-
  దీపంబు లా జగద్దీపకులకుఁ,
బాయసాపూపాన్న పక్వఫలాది నై-
  వేద్యంబు లా వేదవేద్యులకునుఁ,
దనరు వినూత్నరత్నప్రభాభాసి తా-
  భరణంబు లా దైత్యహరణులకును,
10.2-1143.1-తే.
మిలమిలని మంచుతోఁ బొలుపలరు బహు వి
ధాంబరంబులు నీలపీతాంబరులకు,
సలలిత కుసుమమాలికా మలయజాను
లేపనంబులు భూరినిర్లేపులకును.

భావము:
విశ్వరూపులైన బలరామ కృష్ణులను చక్కటి సువాసనలు విరజిమ్మే నల్లఅగరు, మంచిగంధము, ఏలకులు మున్నగు సుగంధ ధూపాలు; జగత్ప్రదీపకులు అయిన వారిని రత్నాలు పొదిగిన బంగారు పాత్రలో కర్పూరదీపాలు సమర్పించాడు. వేదవేద్యులు అయినవారిని పండ్లూ పాయసమూ అప్పములు మొదలైన నైవేద్యాలు; ఆ అసురసంహారులకు వినూత్న రత్నాభరణాలు; నీలాంబర పీతాంబరులకు మిలమిల మెరిసే బహు రకములైన సన్నని మేలు వస్త్రములు; మహా నిస్సంగులకు మనోహరమైన పూలదండలు, మంచిగంధపు మైపూతలు; దానవేశ్వరుడు బలిచక్రవర్తి అర్చించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1143

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments: