Tuesday, May 17, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౪౫(545)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1149-ఉ.
వైరముచేతఁ జేదినృపవర్గముఁ, గామముచేత గోపికల్‌,
మీఱినభక్తి నాశ్రితులు మిమ్ము నహర్నిశమున్ మనంబులం
దారఁగనీక రూపగుణతత్పరులై మిముఁ బొందు కైవడిన్
భూరివివేక సత్త్వగుణముల్‌ గల దేవత లంద నేర్తురే!
10.2-1150-క.
కాన భవత్పదపద్మ
ధ్యానంబునఁ గాని శాస్త్రతత్త్వంబులచేఁ
గానరు శ్రుతిసంవేద్యం
బైన భవత్పదముఁ జిన్మయాకార! హరీ!

భావము:
వైరంతో శిశుపాలుడు మున్నగువారు; కామం చేత గోపికలూ; మిక్కిలి భక్తితో ఆశ్రితులూ; నిన్ను నిరంతరం విడువక చింతిస్తుంటారు. వారు నీ రూపగుణాలను స్మరించుకుంటూ నిన్ను చేరుకొన్నట్లుగా; సత్త్వగుణ సంపన్నులు, మహాజ్ఞానులు అయిన దేవతలు సైతం నిన్ను అందుకోలేరు. ఓ కృష్ణ! చిద్రూప! అందుచేత, నీ పాదపద్మాలను నిరంతరం ధ్యానించడం వలననే వేదవేద్యుడైనా నిన్ను చేరుకోగలరు కానీ శాస్త్రాలు వల్లెవేయడం వలన కాదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1150

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments: