Saturday, April 30, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౩౦(530)

( వసుదేవుని గ్రతువు ) 

10.2-1122-వ.
అని యివ్విధంబునం గృష్ణుం డాడిన సాభిప్రాయంబు లగు వాక్యంబులు విని; య మ్మునీంద్రులు విభ్రాంతహృదయులై యూరకుండి, ముహూర్తమాత్రంబున క మ్మహాత్ము ననుగ్రహంబు వడసి, మందస్మితముఖులై, య ప్పుండురీకాక్షున కి ట్లనిరి “దేవా! నేమునుం దత్త్వవిదుత్తము లయిన బ్రహ్మరుద్రాదులును, భవదీయ మాయావిమోహితులమై యుందుము; నిగూఢం బయిన నీ యిచ్ఛ చేత మమ్ము ననుగ్రహించితివి; భవదీయ చరిత్రంబులు విచిత్రంబు; లి మ్మేదిని యొక్కటి యయ్యును బహురూపంబులఁ గానంబడు విధంబున నీవును మొదలఁ గారణరూపంబున నేకం బయ్యును ననేక రూపంబులు గైకొని, జగదుత్పత్తి స్థితి లయంబులకు హేతుభూతంబునా నద్భుత కర్మంబులం దగిలి, లీలావతారంబులు గైకొని, దుష్టజన నిగ్రహంబును, శిష్టజన రక్షణంబును గావించు చుందు; వదియునుంగాక వర్ణాశ్రమధర్మంబు లంగీకరించి, పురుషరూపంబున వేదమార్గంబు విదితంబు సేసిన బ్రహ్మరూపివి; తపస్స్వాధ్యాయ నియమంబులచేత నీ హృదయంబు పరిశుద్ధంబు; గావున బ్రహ్మస్వరూపంబులైన వేదంబు లందు వ్యక్తావ్యక్త స్వరూపంబు లేర్పడఁగా నుందువు; కావున బ్రాహ్మణకులంబు నెల్ల బ్రహ్మకులాగ్రణివై రక్షించిన మహానుభావుండవు; మాయా జవనికాంతరితుండవైన నిన్నును నీ భూపాలవర్గంబును, నేమును దర్శింపం గంటిమి; మా జన్మ విద్యా తపో మహిమలు సఫలంబు లయ్యె; నీకు నమస్కరించెద” మని బహువిధంబులఁ గృష్ణు నభినందించి, య మ్మురాంతకుఁ జేత నామంత్రణంబులు వడసి తమతమ నివాసంబులకుం బోవందలంచు నవసరంబున.

భావము:
ఈలాగున, శ్రీకృష్ణుడు భావగర్భితంగా పలికిన మాటలు విని ఆ మునిశ్రేష్ఠులు విస్మయ హృదయులై, క్షణకాలం మౌనం వహించారు. వెనువెంటనే శ్రీకృష్ణుడి అనుగ్రహం పొంది, చిరునవ్వు ముఖాలతో ఆయనతో ఇలా అన్నారు. “దేవా! మేము, ఉత్తమ తత్వవేత్త లైన బ్రహ్మరుద్రాదులు నీ మాయకు లోబడి ఉన్నాము. నిగూఢమైన నీ అభీష్టం మేరకు మమ్ము అనుగ్రహించావు. నీ చరిత్రము మిక్కిలి విచిత్రమైనది. ఈ భూమి ఒక్కటే అయ్యూ అనేక రూపాలతో ఎలా కనపడుతుందో అలా నీవు ఒక్కడివే అయినా అనేక రూపాలతో సృష్టిస్థితిలయాలు అనే అద్భుతకార్యాన్ని చేపట్టి, లీలావతారాలు ఎత్తి, దుష్టజనశిక్షణం శిష్టజనరక్షణం చేస్తూ ఉంటావు. అంతే కాకుండా, నీవు వర్ణాశ్రమధర్మాలను అంగీకరించి విరాట్పురుషరూపంతో వేదమార్గాన్ని స్పష్టం చేసిన బ్రహ్మస్వరూపుడవు. తపస్స్వాధ్యాయ నియమాల చేత పరిశుద్ధం అయినది నీ హృదయం. అందుకనే బ్రహ్మస్వరూపాలైన వేదాల్లో వ్యక్తావ్యక్తమైన ఆకారంతో ఉంటున్నావు. కనుకనే, బ్రాహ్మణకులాన్ని రక్షించిన బ్రహ్మణ్యమూర్తివి; మహానుభావుడవు; మాయ అనే తెరచాటున ఉన్న నిన్ను ఈ రాజలోకమూ మేమూ దర్శించ గలిగాము; మా జన్మమూ, మా విద్యా, మా తపోమహిమా సార్ధకమయ్యాయి; నీకు నమస్కరిస్తున్నాము.” అని మునీంద్రులు బహు విధాల శ్రీకృష్ణుడిని ప్రశంసించి ఆయన వద్ద వీడ్కోలు పొంది తమతమ నివాసాలకు బయలుదేరు సమయంలో.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=79&Padyam=1122

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: