10.2-1140-వ.
అని యనేక విధంబుల వినుతించుచు నిట్లనియె; “మీరలు మహానుభావులరు; మీరు తొల్లి యనేకకాలంబు సనినక్రిందట మృతుండై, దండధరుమందిరంబున నున్న గురుకుమారుని మీ మహాప్రభావంబులు లోకంబులఁ బరిపూర్ణంబులై ప్రకాశింప; నక్కాలుని చెంతనుండి మగుడందెచ్చి గురుదక్షిణగా నొసంగితి; రివ్విధంబునం గంసునిచేత హతులైన మత్పుత్త్రులనందఱ మరలం దెచ్చి నా మనంబున నున్న దుఃఖంబు నివారింపవలయు” నని దేవకీదేవి ప్రార్థించినం దమతల్లి యాడిన మృదుమధురవాక్యంబు లత్యాదరంబున నాదరించి, యప్పుడు బలకృష్ణులు దమ యోగమాయా మహత్త్వంబున సుతలంబునకుం జని; రట్టి యెడ.
భావము:
అని ఇలా బలరామకృష్ణులను స్తుతిస్తూ దేవకీదేవి వారితో ఇలా అన్నది. “మహానుభావులారా! మీరు చాలా కాలం క్రితం మృతుడై యమలోకంలో ఉన్న గురువు యొక్క కుమారుని తీసుకువచ్చి గురుదక్షిణగా సమర్పించిన మహాత్ములు. మీ గొప్పదనం లోకులు వేనోళ్ళ పొగడుతున్నారు. అలాగే కంసుడు సంహరించిన నా బిడ్డలను తీసుకువచ్చి నా శోకాన్ని నివారించండి.” ఇలా తల్లి దేవకీదేవి వేడుకోగా బలరామకృష్ణులు ఆదరంతో విన్నారు. తమ యోగ మాయా ప్రభావంతో సుతలలోకానికి వెళ్ళారు. అప్పుడు....
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1140
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment