Tuesday, May 10, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౩౮(538)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1137-సీ.
అవనీశ! యొక్కనాఁ డానకదుందుఖి-
  భార్య పద్మాక్షుండు బలుఁడుఁ దొల్లి
శరధిలోఁ జొచ్చిన గురుతనూభవునిని-
  మరలంగఁ దెచ్చిన మహిమ లెల్ల
జనములు దమలోన సన్నుతుల్‌ సేయంగ-
  విని తన సుతులు దుర్వృత్తుఁడైన
కంసుచే నిహతులై కాలునిపురి నున్న-
  వారి నందఱఁ జూడఁ గోరి కృష్ణ
10.2-1137.1-తే.
బలులకడ కేగి కన్నుల బాష్పకణము
లొలుక "నో రామ! రామ! నిత్యోన్నతాత్మ!
పరమపావనమూర్తి! యో మురవిభేది!
యిందిరానాథ! యోగీశ్వరేశ! కృష్ణ!

భావము:
ఇంతక్రితం బలరామకృష్ణులు సముద్రంలో పడిపోయిన తమ గురుపుత్రుడిని మళ్ళీ తెచ్చి ఇచ్చిన విషయం ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండగా, వసుదేవుడి భార్య దేవకీదేవి విన్నది. కంసునిచేత వధింపబడి యముని సదనంలో ఉన్న తన బిడ్డలను చూడాలని అమె మనసులో కోరిక బలపడింది. అమె బలరామ కృష్ణుల దగ్గరకు వెళ్ళి కన్నీరు కారుస్తూ “ఓ రామా! ఓ కృష్ణా! పరమోన్నతాత్ములారా! పరమ పావన మూర్తులారా! మురాసుర సంహారీ! శ్రీపతి! యోగీశ్వరేశ్వర!” అంటూ వారిని పలువిధాలుగా ప్రస్తుతించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1137

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments: