Thursday, May 5, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౩౫(535)

( వసుదేవుని గ్రతువు ) 

10.2-1130-ఉ.
ఆ తఱి నుగ్రసేన వసుధాధిప, పంకజనాభ, ముష్టికా
రాతులు దమ్ము నర్థి మధురప్రియభాషల నిల్వ వేఁడినం
గౌతుక మాత్మ నివ్వటిలఁగా వసియించిరి గోపగోపికా
వ్రాతముతోడ నచ్చట ధరావర! నందయశోద లిమ్ములన్.
10.2-1131-క.
హరినయముల హరి ప్రియముల
హరిమధురాలాపములను హరికథల మనో
హరలీలఁ దగిలి నందుఁడు
నిరుపమగతి నచట మూఁడు నెల లుండె నృపా!

భావము:
ఆ తరుణంలో, ఉగ్రసేన మహారాజు బలరామ కృష్ణులూ తియ్యని మాటలతో ఉండమని మరీ మరీ వేడారు. వారి మాట మన్నించి నందుడు యశోదా గోపగోపికలతోసహా కొన్నాళ్ళుపాటు తృప్తిగా అక్కడే ఉన్నారు. ఓ పరీక్షిన్మహారాజా! ఆ విధంగా శ్రీకృష్ణుని మంచితనాన్నీ, మర్యాదనూ, మాటల మాధుర్యాన్నీ, హరి మనోహరమైన లీలావిలాసాలు వింటూ నందుడు మూడునెలలు అక్కడనే ఉన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=79&Padyam=1131

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: