Wednesday, May 4, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౩౪(534)

( వసుదేవుని గ్రతువు ) 

10.2-1129-వ.
అని యభ్యర్థించి య మ్మునీంద్రుల యాజకులంగా వరించి, య ప్పుణ్యతీర్థోపాంతంబున మహేంద్రామితవైభవంబున, నష్టాదశ భార్యాసమేతుండై దీక్షఁ గైకొని, యమ్మహాధ్వరంబు వేదోపదిష్ట విధిం బరిసమాప్తించి, ఋత్విఙ్నికాయంబుల బహుదక్షిణలం దనిపి, భార్యాసమేతుండై యవభృథస్నానం బాచరించి, వివిధ రత్నమణి మయభూషణ విచిత్రాంబర సురభి సుమానులేపనంబులు ధరించి, నిఖిల భూదేవ ముని బంధు రాజలోకంబుల నుచిత సత్కారంబులఁ బ్రీతులం గావించిన వారును గృష్ణానుమతి నాత్మనివాసంబులకుం జని; రందు.

భావము:
వసుదేవుడు ఆ మునీంద్రులను ఋత్విక్కులుగా ఎంచుకుని, శ్యమంతపంచకతీర్థం సమీపంలో దేవేంద్రుడిని మించిన వైభవంతో భార్యలు పద్దెనిమిది మందితో సమేతంగా యాగదీక్షను గైకొన్నాడు. ఆ యజ్ఞాన్ని శాస్త్రప్రకారం పూర్తిచేసాడు. ఋత్విక్కులను అనేక దక్షిణలతో సంతృప్తి పరిచాడు. భార్యలతో కలిసి అవభృథస్నానం చేసాడు. పిమ్మట, వివిధ మణిమయ భూషణాలు, నూతనవస్త్రాలు, పరిమళభరితమైన పూలదండలు, మనోహరమైన మైపూతలు ధరించాడు. బ్రాహ్మణులనూ మునులనూ బంధువులనూ రాజసమూహాన్నీ సముచిత సత్కారాలతో సంతోషింప చేసాడు. వారు కూడా శ్రీకృష్ణుడి అనుమతి తీసుకొని తమతమ నివాసాలకు తిరిగి వెళ్ళారు. అప్పుడు....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=79&Padyam=1129

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: