Tuesday, May 3, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౩౩(533)

( వసుదేవుని గ్రతువు ) 

10.2-1127-క.
వరతనయాధ్యయనంబులఁ
దరియించితి ఋణయుగంబుఁ; దడయక ధరణీ
వర! దేవ ఋణము సవనా
చరణుఁడవై యీఁగు టొప్పు సమ్మతితోడన్"
10.2-1128-క.
అనవుడు న వ్వసుదేవుఁడు
మునివరులకు ననియె వినయమున "మీరలు సె
ప్పిన యట్లు మఖము సేసెద
దినకరనిభులార! మీరు దీర్పఁగవలయున్!"

భావము:
ఓ వసుదేవ మహారాజా! నీవు ఉత్తములు అయిన పుత్రుని మూలంగా పితృఋణం తీర్చుకున్నావు. వేదము చదువుట వలన ఋషిఋణము తీర్చుకున్నావు. ఇలా రెండు ఋణాలు తీర్చావు. ఇంక ఉచితమైన పని, యజ్ఞం చేసి దేవఋణాన్ని తీర్చుకోవడం.” ఈ విధంగా వివరించిన మహర్షులు మాటలు విని, వసుదేవుడు వారితో ఇలా అన్నాడు. “ తేజోనిధులైన ఓ మహర్షులారా! మీరు ఉపదేశించిన ప్రకారం యాగం చేస్తాను. దానిని మీరే ఋత్విజులై జరిపించాలి. అని వినయంగా వారికి మనవి చేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=79&Padyam=1128

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: