Monday, May 16, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౪౪(544)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1146-వ.
అని యభినందించి యిట్లనియె.
10.2-1147-ఉ.
"రాజస తామసాత్ములకు రాదుగదా నినుఁగాన నవ్యపం
కేజదళాయతాక్ష! మునిగేయ! పవిత్రచరిత్ర! విస్ఫుర
ద్రాజకళాధరాజ సురరాజ ముఖామర మౌళిరత్న వి
భ్రాజితపాదపీఠ! భవబంధవిమోచన! పద్మలోచనా!
10.2-1148-మ.
మది నూహింపఁగ యోగివర్యులు భవన్మాయా లతాబద్ధులై
యిదమిత్థమ్మనలేరు తామసులమై యేపారు మాబోఁటి దు
ర్మదు లేరీతి నెఱుంగఁ జాలుదురు సమ్యగ్ధ్యానధీయుక్తి? నీ
పదముల్‌ సేరెడి త్రోవఁ జూపి భవకూపంబుం దరింపింపవే!

భావము:
ఇలా ప్రార్థించి శ్రీకృష్ణుడితో బలి ఈలాగున అన్నాడు. “అంబుజాక్షా! రాజస తామస గుణాలతో మెలిగేవారు నీ దర్శనం పొందలేరు. మహర్షులచే కీర్తింపబడువాడా! అతి పవిత్ర చరిత్ర కలవాడ! పరమశివ బ్రహ్మేంద్రాది దేవతలు కిరీటాలలోని రత్నాలకాంతులు నీ పాదపీఠంపై ప్రతిఫలించేలా భక్తితో నమస్కరిస్తారు కదా. భవబంధాల్ని త్రెంచువాడవు నీవే కదా. ఎంతటి మహాయోగులు అయినా నీ మాయలకు వశులై నీవు ఎలాంటివాడవో? నీ రూపం ఎలాంటిదో? తెలుసుకోలేరు. అలాంటప్పుడు, మావంటి తామసులూ దుర్మదులూ నిన్నెలా తెలుసుకోగలరు. పరిపూర్ణ ప్రజ్ఞామతితో నీ పాదాలు చేరు మార్గం చూపించి మమ్మల్ని సంసారకూపం నుంచి ఉద్ధరించు

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1148

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments: