10.2-1141-మ.
కనియెన్ దానవుఁ, డింద్రసేనుఁడు దళత్కంజాక్షులన్, దక్షులన్,
ఘనసారాంబుదవర్ణులన్, నిఖిలలోకైకప్రభాపూర్ణులం,
దనరారన్ హలచక్రపాణులను, భక్తత్రాణులన్, నిత్యశో
భనవర్ధిష్ణుల, రామకృష్ణుల, జయభ్రాజిష్ణులన్, జిష్ణులన్.
10.2-1142-చ.
కని హితకోటితో నెదురుగాఁ జనుదెంచి మనోనురాగ సం
జనిత కుతూహలుం డగుచుఁ జాఁగిలి మ్రొక్కి సమగ్ర కాంచనా
సనముల నుంచి తచ్చరణసారససేచన సర్వలోక పా
వన సలిలంబు లౌదల ధ్రువంబుగఁ దాల్చి సుభక్తి యుక్తుఁ డై.
భావము:
సుతలలోక నివాసి ఐన దానవ చక్రవర్తి బలిచక్రవర్తి వికసించిన పద్మాలవంటి కన్నుల కలవారు, భక్తులను రక్షించేవారు, శాశ్వతమైన మేళ్ళు ఒనగూర్చు వారు, జయశీలురు, ప్రభాశీలురు అయిన బలకృష్ణులను; హలధరుడు, పచ్చకర్పూరం వంటి ఛాయ కల వాడు అయిన బలరాముడిని; చక్రధారి, నీలమేఘశ్యాముడు అయిన కృష్ణుడిని వస్తుండగా చూసాడు. బలిచక్రవర్తి తన ఆప్తులతో బలరామ కృష్ణుల కెదురు వచ్చి అత్యంతానురాగంతో వారికి స్వాగతం పలికి, పాదాభివందనాలు చేసాడు. వారిని సువర్ణపీఠాలపై ఆసీనులను చేసి వారి పాదాలు కడిగి పాదజలాన్ని భక్తితో తల మీద చల్లుకున్నాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1142
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment