Sunday, December 28, 2014

రుక్మిణీకల్యాణం - కనియెన్ రుక్మిణి

71- మ.
నియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం, గంఠీరవేంద్రావల
గ్ను, నవాంభోజదళాక్షుఁ, జారుతరవక్షున్, మేఘ సంకాశదే
హు, నగారాతిగజేంద్రహస్తనిభబాహుం, జక్రిఁ, బీతాం బరున్,
నభూషాన్వితుఁ గంబుకంఠు, విజయోత్కంఠున్ జగన్మోహనున్.
          రుక్మిణీదేవి కృష్ణుణ్ణి కనుగొంది. అప్పుడు కృష్ణుడు చంద్రమండలం లాంటి మోము, సింహం లాంటి నడుము, నవనవలాడే పద్మదళాల్లాంటి కన్నులు, విశాలమైన వక్షస్థలము, మేఘం లాంటి శరీరవర్ణం, దేవేంద్రుని ఐరావతం యొక్క తొండం లాంటి చేతులు, శంఖం లాంటి మెడ కలిగి ఉన్నాడు. పీతాంబరాలు, గొప్ప భూషణాలు ధరించి ఉన్నాడు. విజయం సాధించాలనే ఉత్సాహంతో సర్వ లోక మనోహరంగా ఉన్నాడు.
71- ma.
kaniyen rukmiNi chaMdramaMDalamukhuM, gaMTheeravEMdraavala
gnu, navaaMbhOjadaLaakShuM~, jaarutaravakShun, mEgha saMkaashadE
hu, nagaaraatigajEMdrahastanibhabaahuM, jakriM~, beetaaM barun,
ghanabhooShaanvituM~ gaMbukaMThu, vijayOtkaMThun jaganmOhanun.
          కనియెన్ = చూసెను; రుక్మిణి = రుక్మిణీదేవి; చంద్రమండల = చంద్రబింబము వంటి; ముఖున్ = ముఖము కలవానిని; కంఠీరవ = సింహ; ఇంద్ర = శ్రేష్ఠము వంటి; అవలగ్నున్ = నడుము కలవానిని; నవ = సరికొత్త; అంభోజ = తామర; దళ = రేకులవంటి; అక్షున్ = కన్నులు కలవానిని; చారుతర = మిక్కిలి అందమైన {చారు - చారుతరము - చారుతమము}; వక్షున్ = వక్షస్థలము కలవానిని; మేఘ = మేఘములను; సంకాశ = పోలిన; దేహున్ = దేహము కలవానిని; నగారాతిగజేంద్ర = ఐరావతము యొక్క {నగారాతిగజేంద్రము - నగ (పర్వతములకు) ఆరాతి (శత్రువు) ఐన ఇంద్రుని గజశ్రేష్ఠము, ఐరావతము}; హస్త = తొండము; నిభ = వంటి; బాహున్ = చేతులు కలవానిని; చక్రిన్ = చక్రాయుధుని, కృష్ణుని; పీతాంబరున్ = పసుపు వన్నె వస్త్రము వాని; ఘన = గొప్ప; భూష = ఆభరణములు; ఆన్వితున్ = కూడినవానిని; కంబు = శంఖము వంటి; కంఠున్ = మెడ కలవానిని; విజయ = జయించుట యందు; ఉత్కంఠున్ = ఉత్కంఠము కలవానిని; జగత్ = లోకములను; మోహనున్ = మోహింపజేయువానిని.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

2 comments:

Unknown said...
This comment has been removed by the author.
Anonymous said...

బంగరు భవితకు బాట భాగవత గాథ.