Saturday, December 13, 2014

రుక్మిణీకల్యాణం – తుడువదు కన్నులన్


52- చ.
తుడువదు కన్నులన్ వెడలు తోయకణంబులు; గొప్పు చక్కఁగా
ముడువదు; నెచ్చలింగదిసి ముచ్చటకుంజన దన్న మేమియుం
గుడువదు; నీరముం గొనదు; కూరిమి కీరముఁ జేరి పద్యముం
నొడువదు; వల్లకీగుణవినోదము చేయదు; డాయ దన్యులన్.
          తనను తీసుకెళ్ళటానికి శ్రీకృష్ణుడు వస్తున్నాడో లేదో అని మధనపడుతున్న రుక్మిణీదేవి, కన్నీరు తుడుచుకోటం లేదు. జుట్టు సరిగా ముడవటం లేదు. నెచ్చలులతో ముచ్చటలు చెప్పటం లేదు. అన్నపానీయాలు తీసుకోవటం లేదు. ఇష్టమైన చిలుకకి పద్యాలు చెప్పటం లేదు. వీణ వాయించటం లేదు. ఎవ్వరి దగ్గరకు పోటం లేదు.
రుక్మిణి ఇంత గాఢంగా కృష్ణుని ప్రేమిస్తోంది కనుకనే తనను తీసుకెళ్ళి రాక్షస వివాహం చేసుకో మని సందేశం పంపించింది. అష్టవిధ వివాహాలలో రాక్షసం ఒకటి. దీనిలో ఉన్న రాక్షసం కన్య పెద్దల అంగీకారంతో  సంబంధంలేకుండా, అంగీకరించిన కన్యను ఎత్తుకొచ్చి వివాహమాడుట. కన్య అంగీకారంతో కూడ సంబంధలేకుండా చేసేది పైశాచికం.
52- cha.
tuDuvadu kannulan veDalu tOyakaNaMbulu; goppu chakkaM~gaa
muDuvadu; nechchaliMgadisi muchchaTakuMjana danna mEmiyuM
guDuvadu; neeramuM gonadu; koorimi keeramuM~ jEri padyamuM
noDuvadu; vallakeeguNavinOdamu chEyadu; Daaya danyulan.
          తుడువదు = తుడుచుకొనదు; కన్నులన్ = కళ్ళమ్మట; వెడలు = కారెడి; తోయకణంబులున్ = నీటిబిందువులను; కొప్పు = జుట్టుముడిని; చక్కగా = సరిగా; ముడువదు = చుట్టుకొనదు; నెచ్చలిన్ = స్నేహితురాలిని; కదిసి = చేరి; ముచ్చట = కబుర్లు ఆడుట; కున్ = కు; చనదు = వెళ్ళదు; అన్నము = భోజనము; ఏమియున్ = ఏ కొంచము కూడ; కుడువదు = తినది; నీరమున్ = నీళ్ళైనా; కొనదు = తాగదు; కూరిమిన్ = ప్రీతితో; కీరమున్ = చిలుక; చేరి = వద్దకు వెళ్ళి; పద్యమున్ = పద్యములను; నొడువదు = చెప్పదు; వల్లకీ = వీణ యొక్క; గుణ = తీగలనుమీటెడి; వినోదమున్ = వేడుకలు; చేయదు = చేయదు; డాయదు = సమీపించదు; అన్యులన్ = ఇతరులను.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: