60- వ.
అని నమస్కరించె; నంత రామకృష్ణులు దన కూఁతు వివాహంబు నకు వచ్చుట విని, తూర్యఘోషంబులతో నెదుర్కొని, విధ్యుక్త ప్రకారంబునం బూజించి,
మధుపర్కంబు లిచ్చి, వివిధాంబ రాభరణంబులు
మొదలైన కానుక లొసంగి, భీష్మకుండు బంధు జన సేనాసమేతులైన
వారలకుం దూర్ణంబ సకలసంపత్పరి పూర్ణంబు లైన నివేశంబులు గల్పించి విడియించి; యిట్లు కూడిన రాజుల కెల్లను వయో వీర్యబలవిత్తంబు లెట్లట్ల కోరినపదార్థంబు
లెల్ల నిప్పించి పూజించె, నంత విదర్భపురంబుప్రజలు హరిరాక
విని వచ్చి చూచి నేత్రాంజలులం దదీయ వదనకమలమధు పానంబుఁ జేయుచు.
ఇలా రుక్మిణి, విప్రునికి
నమస్కరించింది. ఆలోగా భీష్మకుడు బలరామ కృష్ణులు తన పుత్రిక పెళ్ళికి వచ్చారని విని
మంగళవాద్యాలతో ఆహ్వానించాడు. తగిన మర్యాదలు చేసి మధుపర్కాలు ఇచ్చాడు. అనేక రకాల
వస్త్రాలు, ఆభరణాలు మొదలైన కానుకలు ఇచ్చాడు. వారికి వారి బంధువులకి సైన్యానికి
తగిన నిండైన విడిదులు ఏర్పాటు చేసాడు. వారివారి శౌర్య బల సంపదలకి వయస్సులకు
అర్హమైన కోరిన పదార్ధాలన్ని ఇప్పించి మర్యాదలు చేసాడు. అప్పుడు చక్రి వచ్చాడని
విదర్భలోని పౌరులు వచ్చి దర్శనం చేసుకొని, అతని మోము తిలకించారు.
అని = అని; నమస్కరించెన్ = నమస్కారము చేసెను; అంతన్ = అటుపిమ్మట; రామ = బలరాముడు; కృష్ణులు = కృష్ణుడులు; తన = అతని; కూతు = పుత్రిక; వివాహంబున్ = పెండ్లి; కున్ = కి; వచ్చుట = వచ్చుట; విని = విని; తూర్య = వాయిద్యముల; ఘోషంబు = ధ్వని; తోన్ = తోటి; ఎదుర్కొని = ఎదురువెళ్ళి; విధ్యుక్త = పద్ధతి; ప్రకారంబునన్ = ప్రకారముగా; పూజించి = గౌరవించి; మధుపర్కంబులు = పసుపు బట్టలు; ఇచ్చి = ఇచ్చి; వివిధ = అనేకరకముల; అంబర = వస్త్రములు; ఆభరణంబులున్ = భూషణములు; మొదలైన = మున్నగు; కానుకలు = బహుమతులు; ఒసంగి = ఇచ్చి; భీష్మకుండు = భీష్మకుడు; బంధు = బంధువుల; జన = సమూహములు; సేనా = సైన్యములతో; సమేతులు = కలిసి ఉన్నవారు; ఐన = అయిన; వారల = వారి; కున్ = కి; తూర్ణంబ = శీఘ్రమే; సకల = ఎల్ల; సంపత్ = వసతులతో; పరిపూర్ణంబులు = నిండినవి; ఐన = అయిన; నివేశంబులు = నివాసములు; కల్పించి = ఏర్పరచి; విడియించి = విడిదులుగా దింపి; ఇట్లు = ఈ విధముగ; కూడిన = చేరిన; రాజులు = రాజులు; కిన్ = కి; ఎల్లను = అందరికి; వయః = వయస్సు; వీర్య = శూరత్వము; బల = సైనికబలములు; విత్తంబులు = ధనములను; ఎట్లట్ల = అనుసరించి; కోరిన = అడిగిన; పదార్థంబులు = వస్తువులు; ఎల్లన్ = అన్నిటిని; ఇప్పించి = సమకూర్చి; పూజించెన్ = గౌరవించెను; అంతన్ = అటుపిమ్మట; విదర్భపురంబు = కుండిననగరము యొక్క {విదర్భపురము - విదర్భదేశపు పట్టణము, కుండిన}; ప్రజలు = పౌరులు; హరి = కృష్ణుని; రాకన్ = వచ్చుటను; విని = తెలిసి; వచ్చి = వచ్చి; చూచి = దర్శనము చేసికొని; నేత్ర = కళ్ళు అనెడి; అంజలులన్ = దోసిళ్ళతో; తదీయ = అతని; వదన = ముఖము అనెడి; కమల = పద్మము యొక్క; మధు = మకరందమును; పానంబుజేయుచు = తాగుతు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :
No comments:
Post a Comment