72- వ.
కని
తదీయ రూప వయో లావణ్య వైభవ గాంభీర్య చాతుర్య తేజో విశేషంబులకు సంతసించి
మనోభవశరాక్రాంతయై రథారోహణంబు గోరుచున్న యవ్వరారోహంజూచి, పరిపంథి రాజలోకంబు చూచు చుండ మందగమనంబున గంధసింధురంబు లీలం జనుదెంచి ఫేరవంబుల
నడిమిభాగంబుఁ గొని చను కంఠీరవంబు కైవడి నిఖిల భూపాలగణంబుల గణింపక దృణీకరించి
రాజకన్యకం దెచ్చి హరి తన రథంబుమీఁద నిడికొని భూనభోంతరాళంబు నిండ శంఖంబు పూరించుచు బలభద్రుండు
తోడ నడవ, యాదవ వాహినీ పరివృతుండై ద్వారకానగర మార్గంబు పట్టి
చనియె; నంత జరాసంధ వశులైన రాజు లందఱు హరి పరాక్రమంబు విని
సహింప నోపక.
అలా గౌరీపూజ చేసుకొని బయటకు
వచ్చిన రుక్మిణి, కృష్ణుని చూసింది. అతని సౌందర్యం, యౌవనం, లావణ్యం, వైభవం,
గాంభీర్యం, నేర్పరితనం, తేజస్సుల అతిశయానికి సంతోషించింది. మన్మథ బాణాలకు గురై రథం
ఎక్కాలని ఆశ పడుతున్న ఆమెను చూసాడు కృష్ణమూర్తి. సింహం తిన్నగా వచ్చి నక్కల మధ్యన
ఉన్న ఆహారాన్ని పట్టుకు పోయినట్లు శత్రుపక్షం రాజులందరు చూస్తుండగా వాళ్ళని
లెక్కచేయకుండా రాకుమారిని రథం ఎక్కించుకొని భూమ్యాకాశాలు నిండేలా శంఖం పూరిస్తూ
ద్వారక కెళ్ళే దారి పట్టాడు. బలరాముడు యాదవ సైన్యాలు అనుసరిస్తున్నారు. అప్పుడు
కృష్ణుని పరాక్రమం చూసి జరాసంధుని పక్షం రాజులు సహించలేకపోయారు.
కని = చూసి; తదీయ = అతని; రూప = రూపసౌందర్యము; వయః = యౌవనపు; లావణ్య = దేహకాంతి; వైభవ = వైభవములు; గాంభీర్య = గంభీరత; చాతుర్య = నేర్పులు; తేజః = తేజస్సుల; విశేషంబుల్ = విశిష్టతల; కున్ = కు; సంతసించి = సంతోషించి; మనోభవ = మన్మథుని; శరా = బాణములచేత; ఆక్రాంత = ఆక్రమింపబడినామె; ఐ = అయ్యి; రథా = రథమును; ఆరోహణంబున్ = ఎక్కుటను; కోరుచున్న = కోరుకుంటున్న; ఆ = ఆ యొక్క; వరారోహన్ = సుందరిని {వరారోహ - శ్రేష్ఠమైన పిరుదులు కలామె, స్త్రీ}; చూచి = చూసి; పరిపంథి = శత్రు; రాజ = రాజుల; లోకంబున్ = సమూహము; చూచుచుండన్ = చూస్తుండగా; మంద = మెల్లని; గమనంబునన్ = నడకలతో; గంధ = మద; సింధురంబు = ఏనుగు; లీలన్ = వలె; చనుదెంచి = వచ్చి; ఫేరవంబుల = నక్కల; నడిమి = మధ్యనగల; భాగంబున్ = అమిషఖండమును; కొని = తీసికొని; చను = పోవు; కంఠీరవంబు = సింహము; కైవడిన్ = వలె; నిఖిల = ఎల్ల; భూపాల = రాజుల; గణంబులన్ = సమూహములను; గణింపక = లెక్కజేయక; తృణీకరించి = తృణప్రాయముగా ఎంచి; రాజకన్యకన్ = రాకుమారిని; తెచ్చి = తీసుకొచ్చి; హరి = కృష్ణుడు; తన = అతని యొక్క; రథంబు = రథము; మీదన్ = పై; ఇడుకొని = పెట్టుకొని; భూనభోంతరాళంబు = భూమ్యాకాశమధ్యనంతా; నిండన్ = నిండునట్లు; శంఖంబున్ = శంఖమును;
పూరించుచున్ = ఊదుతూ; బలభద్రుండు = బలరాముడు; తోడన్ = వెంట; నడవ = రాగా; యాదవ = యాదవుల; వాహినీ = సేనలచే;
పరివృతుండు =
చుట్టునున్నవాడు; ఐ = అయ్యి; ద్వారకా = ద్వారకా; నగర = పట్టణము; మార్గంబున్ = దారి;
పట్టి = వెంబడి; చనియెన్ = వెళ్ళను;
అంత = అప్పుడు; జరాసంధ = జరాసంధునికి; వశులు = లోబడియున్నవారు; ఐన = అయిన; రాజులు = రాజులు; అందఱున్ = ఎల్లరు; హరి = కృష్ణుని;
పరాక్రమంబున్ = పరాక్రమ వృత్తాంతము; విని = విని; సహింపన్ = ఓర్వ;
ఓపక = చాలక.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం:
:
No comments:
Post a Comment