: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :
56- వ.
ఇట్లు
హరిరాక కెదురుచూచుచు సకల ప్రయోజ నంబులందును విరక్త యయి మనోజానలంబునం బొగులు మగువకు
శుభంబు చెప్పు చందంబున వామోరులోచనభుజంబులదరె; నంతఁ గృష్ణు నియోగంబున
బ్రాహ్మణుండు చనుదెంచిన నతని ముఖలక్షణం బుపలక్షించి యా కలకంఠకంఠి మహోత్కంఠతోడ
నకుంఠిత యయి మొగంబునం జిఱునగవు నిగుడ నెదురు జని నిలువంబడిన బ్రాహ్మణుం డిట్లనియె.
ఇలా కృష్ణుని రాకకి ఎదురు
చూస్తూ సర్వం మరచి మన్మథతాపంతో వేగిపోతున్న సుందరి రుక్మిణికి శుభ సూచకంగా
ఎడంకన్ను, ఎడంభుజం, ఎడంకాలు అదిరాయి. అంతలోనే అగ్నిద్యోతనుడు కృష్ణుడు పంపగా
వచ్చేడు. అతని ముఖకవళికలు చూసి మిక్కలి ఉత్సుకతతో రుక్మిణి చిరునవ్వుతో ఎదు రెళ్ళింది.
అప్పుడా బ్రహ్మణుడు ఇలా అన్నాడు.
ఇట్లు = ఈ విధముగ; హరి = కృష్ణుడు; రాక = వచ్చుట; కిన్ = కై; ఎదురుచూచుచు = ప్రతీక్షించుచు; సకల = సమస్తమైన; ప్రయోజనంబులున్ = పనులు; అందును = ఎడల; విరక్త = ఇచ్ఛలేనిది; అయి = ఐ; మనోజ = మన్మథ {మనోజుడు - మనసున పుట్టువాడు, మన్మథుడు}; అనలంబున్ = తాపముచేత; పొగులు = తపించుచున్న; మగువ = వనిత; కున్ = కు; శుభంబున్ = రాబోవు మేలు; చెప్పు = సూచించు; చందంబునన్ = విధముగ; వామ = ఎడమపక్క; ఊరు = తొడ; లోచన = కన్ను; భుజంబుల్ = భుజములు; అదరెన్ = అదరినవి; అంతన్ = అంతట; కృష్ణు = కృష్ణుని చేత; నియోగంబునన్ = ఆజ్ఞ ప్రకారము; బ్రాహ్మణుండు = విప్రుడు; చనుదెంచినన్ = రాగా; అతని = అతని; ముఖ = ముఖము; లక్షణంబు = ఉండినరీతిని; ఉపలక్షించి = పరిశీలనగాచూసి; ఆ = ఆ యొక్క; కలకంఠి = కోకిల కంఠము వంటి; కంఠి = కంఠము కలామె; మహా = మిక్కలి; ఉత్కంఠ = తహతహ; తోడన్ = తోటి; అకుంఠిత = వికాసముకలది {అకుంఠిత - కుంఠిత (మూఢురాలు) కానియామె, వికాసము కలామె}; అయి = అయ్యి; మొగంబునన్ = ముఖమునందు; చిఱునగవు = దరహాసము;
నిగుడన్ = వ్యాపించగా; ఎదురుజని = ఎదురువెళ్ళి;
నిలువం బడినన్ = నిలుచుండగా; బ్రాహ్మణుండు =
విప్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె =
పలికెను.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :
No comments:
Post a Comment