Wednesday, November 16, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౮౨(682)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-63-క.
ధర్ముండు దక్షపుత్త్రిక
నిర్మలమతిఁ బెండ్లియాడి నెఱిఁ బుత్త్రుని స
త్కర్ముని నారాయణ ఋషి
నర్మిలిఁ గనె నతఁడు బదరికాశ్రమ మందున్‌.
11-64-తే.
అట్టి నారాయణాహ్వయుం డైన మౌని
బదరికాశ్రమమందు నపార నిష్ఠఁ
దపముఁ గావింప బలభేది దలఁకి మదిని
మీనకేతను దివిజకామినులఁ బనిచె.

భావము:
బదరీకాశ్రమంలో ధర్ముడు దక్షపుత్రికను పెండ్లాడాడు. ఆ దంపతులకు సత్కర్ముడు పరిశుద్ధుడు ఐన నారాయణఋషి జన్మించాడు. ఆ నారాయణముని బదరికాశ్రమంలో అపారమైన నిష్ఠతో తపస్సు చేయసాగాడు ఆయన తపస్సుకు ఇంద్రుడు భయపడి తపోభంగం నిమిత్తం మన్మథుడిని అప్సరసలను పంపించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=64

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, November 15, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౮౧(681)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-61-క.
"తారల నెన్నఁగ వచ్చును;
భూరేణుల లెక్కవెట్టఁ బోలును ధాత్రిన్‌;
నారాయణగుణకథనము
లారయ వర్ణింపలేరు హర బ్రహ్మాదుల్‌.
11-62-వ.
అట్లు గావున నాత్మసృష్టంబైన పంచభూతనికరంబును పురం బొనరించి, యందు నిజాంశంబునం బ్రవేశించి, సగుణనిష్ఠుండై నారాయణాభిధానంబు గల ఋషీశ్వరుం డగు పరమేశ్వరుండు వెలుఁగొందె; నతని దశేంద్రియంబులచేఁ బాలితంబులైన దేహంబులు ధరించి, జగద్రక్షకత్వ సంహారకత్వాది గుణంబులు గలుగుటం జేసి గుణనిష్ఠుండయి రజస్సత్త్వతమో గుణంబుల బ్రహ్మ విష్ణు రుద్ర మూర్తులనం బరఁగి, త్రిగుణాత్మకుం డనంబడు నారాయణాఖ్యుని చరిత్రం బెఱింగించెద; నాకర్ణింపుము.

భావము:
"రాజా! ఆకాశంలోని చుక్కలను లెక్కపెట్టవచ్చు. భూమిపై గల ఇసుక రేణువులను కూడ లెక్కపెట్టవచ్చును. కానీ నారాయణుని గుణములు చరిత్రలను మాత్రం శివుడు బ్రహ్మ మొదలైనవారు కూడ వర్ణించ లేరు. భగవంతుడు తాను సృష్టించిన పంచభూతాలతో సంభూతమైన పురమును చేసి, దానిలో తన అంశతో ప్రవేశించి పిమ్మట సగుణనిష్ఠుడై నారాయణుడు అను పేరు కల ఋషీశ్వరుడుగా విరాజిల్లాడు. ఆయన పది ఇంద్రియాలతో నిర్మితాలైన శరీరాలను దాల్చి జగత్తును సృష్టించటం రక్షించటం సంహరించటం మొదలైన కార్యాలు చేయటం వలన రజస్సత్త్వతమోగుణాలతో బ్రహ్మ, విష్ణు, రుద్రుడు అనే పేర్లతో ఒప్పుతుంటాడు. త్రిగుణాత్మకుడు అనబడే ఆ నారాయణుని చరిత్ర చెబుతాను విను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=12&Padyam=62

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

శ్రీకృష్ణ విజయము - ౬౮౦(680)

( ఆవిర్హోత్రుని భాషణ ) 

11-59-క.,
"పురుషుం డే యే కర్మము
పరువడిఁ గావించి పుణ్యపరుఁడై మనుఁ? దా
దురితములుఁ దొరఁగి మురరిపు
చరణయుగం బెట్లు సేరు? సన్మునివర్యా! "
11-60-వ.
అనిన విని యందావిర్హోత్రుం డిట్లనియెఁ; “గర్మాకర్మ వికర్మ ప్రతిపాదకంబు లగు శ్రుతివాదంబులలౌకికవర్ణితంబు; లట్టి యామ్నాయంబులు సర్వేశ్వరస్వరూపంబులు గాన విద్వాంసులు నెఱుంగ లే; రవి కర్మాచారంబు లనంబడు; మోక్షంబుకొఱకు నారాయణ భజనంబు పరమపావనంబు; వేదోక్తంబుల నాచరింపక ఫలంబులకు వాంఛ సేయువార లనేక జన్మాంతరంబులం బడయుదురు; మోక్షంబు నపేక్షించు వాఁడు విధిచోదిత మార్గంబున హరిం బూజింపవలయు; నట్టి పూజాప్రకారం బెట్లనినఁ, బవిత్రగాత్రుం డయి జనార్దను సన్నిధిం బూతచిత్తుండై, షోడశోపచారంబులఁ జక్రధరు నారాధించి, గంధ పుష్ప ధూప దీప నైవేద్యంబులు సమర్పించి, సాష్టాంగదండ ప్రణామంబు లాచరించి, భక్తిభావనా విశేషుండగు నతండు హరింజేరు” నని చెప్పిన విని విదేహుం డిట్లనియె; “నీశ్వరుం డేయే కర్మంబుల నాచరించె, నంతయు నెఱిగింపు” మనినఁ ద్రమిళుం డిట్లనియె.

భావము:
“మహర్షిపుంగవ! పురుషుడు ఏయే కర్మలను ఆచరిస్తే పుణ్యుడై పాపాలను పోగొట్టుకుని మురవైరి పాదాలను చేరుకోగలుగుతాడో చెప్పండి.” అలా అడుగగా ఆవిర్హోత్రుడనే మహాముని విదేహప్రభువుతో ఈ విధంగా చెప్పసాగాడు. “కర్మ అకర్మ వికర్మ వీటిని ప్రతిపాదించే శ్రుతివాదులు లౌకికులు చెప్పినవి కాదు. అటువంటి వేదాలు సర్వేశుని స్వరూపాలు వాటిని పండితులు కూడ తెలుసుకోలేరు. వాటిని కర్మాచారాలు అంటారు. మోక్షంకోసం నారాయణ భజనం అన్నిటి కంటే పవిత్రమైనది. వేదం చెప్పినట్లు చేయక ఫలాలు కోరేవారు ఎన్నో జన్మలు ఎత్తుతారు. మోక్షాన్ని కోరేవారు శాస్త్రం చెప్పినవిధంగా హరిని పూజించాలి. ఆ పూజావిధానం ఎటువంటిదంటే పరిశుద్ధమైన దేహంతో భగవంతుని సన్నిధిలో పవిత్రచిత్తుడై ప్రవర్తించాలి. షోడశోపచారాలతో చక్రధరుని ఆరాధించాలి. గంథం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అర్పించి సాష్టాంగదండప్రణామాలు చేయాలి. విశేషమైన భక్తిభావం మనసున నింపుకోవాలి. అట్టివాడు పరమాత్మను జేరుతాడు.” అని వివరించగా విని విదేహమహారాజు ఇలా అన్నాడు. “ఈశ్వరుడు ఏ లీలలు ఆచరించాడు. ఆ వివరం అంతా తెలుపవలసింది.” అనగా ద్రమిళుడనే మునివర్యుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=12&Padyam=60

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, November 14, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౯(679)

( పిప్పలాయన భాషణ ) 

11-58-వ.
దీనికిం బెక్కైనది పరమాత్మగా నెఱింగి కమలసంభవాదులు నుతియింతు; రిట్టి పరమాత్మ స్థావరజంగమంబుల నధిష్ఠించి వృద్ధి క్షయంబులం బొందక నిమిత్తమాత్రంబునం దరులతాదు లందు జీవంబు లేక తదంతరస్థుండై వర్తించు; నంత సర్వేంద్రియావృతం బైన యాకారంబు నష్టంబైన మనంబునుం బాసి శ్రుతివిరహితుం డై తిరుగుచుండు; నిర్మల జ్ఞానదృష్టి గలవానికి భానుప్రభాజాలంబు దోఁచిన క్రియను, సుజ్ఞానవంతుడు హరిభక్తిచేత గుణకర్మార్థంబులైన చిత్తదోషంబులు భంజించి భగవత్సదనంబు సేరు” ననిన విని రాజిట్లనియె.

భావము:
ఇందుకు అతీతమైన దాన్ని పరమాత్మగా తెలుసుకుని బ్రహ్మ మొదలైనవారు స్తుతిస్తారు. ఇటువంటి పరమాత్మ స్థావరజంగమాలను అధిష్టించి వృద్ధిక్షయాలు పొందక నిమిత్రమాత్రంగా చెట్లు తీగలు మొదలైనవాని లోపల వర్తిస్తుంటాడు. సర్వేంద్రియాలచే ఆవరించబడిన ఆకారము పోగా మనస్సును వదలి శ్రుతి విరహితుడై తిరుగుతుంటాడు. నిర్మలమైన జ్ఞానదృష్టి కలవాడు సూర్యుని కాంతి పుంజం దర్శించినట్లు. సుజ్ఞాని అయినవాడు హరిభక్తిచేత గుణకర్మార్థములైన చిత్త దోషాలను నశింపజేసి ఈశ్వరుని చేరుకోగలుగుతాడు.” అంటే విని విదేహుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=11&Padyam=58

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౬౭౮(678)

( పిప్పలాయన భాషణ ) 

11-57-సీ.
"నరవర! విను జగన్నాథుని చారిత్ర-
  మెఱిఁగింతు నీమది కింపు మిగుల
లసదుద్భవస్థితిలయ కారణంబయి-
  దేహేంద్రియాదులఁ దిరము గాఁగఁ
జొనుపు నెప్పుడు పరంజ్యోతిస్స్వరూపంబు-
  జ్వాలల ననలుండుఁ జనని పగిది
నింద్రియంబులు నాత్మ నెనయవు శబ్దంబు-
  పొరయక సుషిరంబుఁ బొందు, సత్య
11-57.1-తే.
మనఁగ సత్త్వరజస్తమోమయగుణంబు,
మహదహంకారరూపమై మహిమ వెలయు
చేతనత్వంబు గలదేని జీవ మందు,
రిదియ సదసత్స్వరూపమై యెన్నఁబడును.

భావము:
“రాజా! విను నీకింపు కలిగే విధంగా లోకేశ్వరుని చరిత్ర చెబుతాను. సృష్టి స్థితి లయాలకు కారణమైన పరంజ్యోతి స్వరూపం దేహేంద్రియాలలో స్థిరంగా ప్రవేశిస్తుంది మంటలు అగ్నిలోపల ప్రవేశింపలేనట్లు, ఇంద్రియాలు ఆత్మను ఆక్రమించలేవు. నాదం పిల్లనగ్రోవిని లోగొన లేదు కదా. సత్త్వము రజస్సు తమస్సు అనే గుణత్రయం మహదహంకార రూపమై చైతన్యంతో కలిస్తే జీవమంటారు. ఇదే సత్తు అసత్తు స్వరూపంగా ఎన్నబడుతుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=11&Padyam=57

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, November 11, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౭(677)

( ప్రబుద్ధుని సంభాషణ ) 

11-55-క.
"హరిదాసుల మిత్రత్వము
మురరిపుకథ లెన్నికొనుచు మోదముతోడన్‌
భరితాశ్రుపులకితుండై
పురుషుఁడు హరిమాయ గెల్చు భూపవరేణ్యా!"
11-56-వ.
అనిన రాజేంద్రుండు వారల కిట్లనియె; “భాగవతులారా! సకలలోకనాయకుం డగు నారాయణుం డనంబరఁగిన పరమాత్ముని ప్రభావంబు వినవలతు; నానతిం” డనినఁ బిప్పలాయనుం డిట్లనియె.

భావము:
మహారాజ! హరిభక్తులతో స్నేహంచేస్తూ హరిలీలలను తలచుకుంటూ కన్నులలో ఆనందబాష్పాలు నిండగా ఒళ్ళు పులకరిస్తుండగా మానవుడు హరిమాయను గెలుస్తాడు.” అనగా ఆ విదేహచక్రవర్తి వాళ్ళతోఇలాఅన్నాడు. “భాగవతులారా! సమస్త లోకాలకూ ప్రభువై నారాయణుడనే నామంతో అలరారే పరమాత్ముని ప్రభావాన్ని వినాలనుకుంటున్నాను ఆనతీయండి.” అంటే పిప్పలాయను డనే మునీంద్రుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=10&Padyam=56

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Thursday, November 10, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౭(677)

( అంతరిక్షు సంభాషణ ) 

11-54-వ.
“సూర్యోదయాస్తమయంబులం బ్రతిదినంబు నాయువు క్షీణంబు నొంద, దేహ కళత్ర మిత్ర భ్రాతృమమత్వ పాశబద్ధులై విడివడు నుపాయంబు గానక, సంసారాంధకారమగ్నులయి గతాగతకాలంబుల నెఱుంగక, దివాంధంబులగు జంతుజాలంబుల భంగి జన్మ జరా రోగ విపత్తి మరణంబు లందియు, శరీరంబ మేలనుచుఁ బ్రమోద మోహమదిరాపానమత్తులై, విషయాసక్తతం జిక్కి, తమ్ముఁ దారెఱుంగక యుండి, విరక్తిమార్గంబు దెలియక వర్తించు మూఢు లగు జనంబుల పొంతలఁ బోవక; కేవల నారాయణ భక్తి భావంబు గల సద్గురుం బ్రతిదినంబును భజియించి; సాత్త్వికంబును, భూతదయయును, హరికథామృతపానంబును, బ్రహ్మచర్యవ్రతంబును, విషయంబుల మనంబు సేరకుండుటయు, సాధు సంగంబును, సజ్జన మైత్రియు, వినయసంపత్తియు, శుచిత్వంబును, తపంబును, క్షమము, మౌనవ్రతంబును, వేదశాస్త్రాధ్యయన తదర్థానుష్ఠానంబులును, నహింసయు, సుఖదుఃఖాది ద్వంద్వసహిష్ణుతయు, నీశ్వరుని సర్వగతునింగా భావించుటయు, ముముక్షుత్వంబును, జనసంగ వర్జనంబును, వల్కలాది ధారణంబును, యదృచ్ఛాలాభ సంతుష్టియు, వేదాంతశాస్త్రార్థ జిజ్ఞాసయును, దేవతాంతరనిందా వర్జనంబును, గరణత్రయ శిక్షణంబును, సత్యవాక్యతయు, శమదమాదిగుణ విశిష్టత్వంబును, గృహారామ క్షేత్ర కళత్ర పుత్త్ర విత్తాదుల హరికర్పణంబు సేయుటయు, నితర దర్శన వర్జనంబు సేయుటయును భాగవతోత్తమధర్మంబు” లని చెప్పి యిట్లనియె.

భావము:
“ప్రతిదినము మానవుల ఆయువు, సూర్యుడు ఉదయించడం అస్తమించటంతో, క్షీణిస్తుంటుంది. దేహంపైనా, భార్యపైనా, స్నేహితులపైనా, సోదరులపైనా నాది, నావారు అనే మమకారంతో కట్టుబడిపోతారు. ఆ బంధం నుంచి విడివడే ఉపాయం కనపడక సంసార మనే చీకటిలో మునిగి భూత భవిష్యత్తులు తెలియక గుడ్లగూబల లాగా మానవులు పుట్టుక ముసలితనం రోగాలు ఆపదలు చావు పొందుతు కూడ శరీరమే మేలనుకుంటూ ఉంటారు. మోహాన్ని కలిగించే మద్యపానంతో మత్తులై ఇంద్రియవిషయ ఆసక్తులై తమ్ము తాము తెలుసుకోలేక విరక్తిమార్గం తెలియక నడయాడుతుంటారు అటువంటి మూఢులైన మానవుల సమీపానికి పోవలదు. కేవలం నారాయణుని పైన భక్తిభావం గల సద్గురువును నిత్యము భజించి ఉత్తమమైన భాగవతధర్మాలను అనుష్టించాలి. ఆ ధర్మాలు ఏవంటే:
1. మూఢుల పొంతల పోకపోవుట; 2, సద్గురు ప్రతిదిన భజనము; 3. సత్త్వగుణము కలిగి ఉండటం; 4. భూతదయ; 5. హరికథామృత పానం; 6. బ్రహ్మచర్య వ్రతం; 7. ఇంద్రియ సుఖాలందు మనస్సును చేరనీయ కుండటం; 8. సాధుసంగమం; 9. సజ్జనులతో స్నేహం; 10 వినయ సంపద; 11. శుచిగా ఉండటం; 12. తపస్సు; 13 క్షమ; 14. మౌనవ్రతం; 15. వేదశాస్త్రాలను చదవటం వాటి అర్ధాన్ని అనుష్ఠించటం; 16. అహింస; 17. సుఖాన్నిగాని దుఃఖాన్నిగానీ సహించటం; 18. ఈశ్వరుడు అంతటా ఉన్నట్లు భావించటం; 19. మోక్షం పొందాలనే కోరిక; 20. కుజనుల సంగతి వదలటం; 21. వల్కలాలు మొదలైనవి కట్టడం; 22. దానంతట అది లభించిన దానితో సంతుష్టి చెందటం; 23. వేదాంతశాస్త్రాల అర్ధాలను తెలుసుకోవా లనే కుతూహలం; 24. ఇతర దేవతలను నిందించకుండా ఉండటం; 25. త్రికరణసుద్ధి; 26. సత్యమే పలకటం; 27. శమం దమం మొదలైన గుణవిశేషాలు; 28. ఇల్లు తోటలు పొలాలు భార్య సంతానం ధనం మొదలైనవాటిని పరమేశ్వరార్పణం గాభావించటం; 29. భక్తులు కాని వారిని ఆశ్రయించకుండా ఉండటం.” అని చెప్పి పిమ్మట...

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=10&Padyam=54

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :