Monday, February 5, 2018

నీలకంఠ వైభవం - 2

8-216-వ.
అదియునుం బ్రళయకాలాభీల ఫాలలోచన లోచనానలశతంబు చందంబున నమందంబై; విలయ దహన సహస్రంబు కైవడి వడియై; కడపటి పట్టపగలింటి వెలుంగుల లక్ష తెఱంగున దుర్లక్షితంబై; తుదిరేయి వెలింగిన మొగిలుగముల వలనం బడు బలు పిడుగుల వడువున బెడిదంబై; పంచభూతంబులుం దేజోరూపంబులైన చాడ్పున దుస్సహంబై; భుగభుగాయమానంబులైన పొగలును; జిటచిటాయమానంబులైన విస్ఫులింగంబులును; ధగధగాయమానంబు లైన నెఱమంటలును; గలిగి మహార్ణవ మధ్యంబున మందరనగం బమంథరంబుగం దిరుగునెడ జనియించి పటపటాయమానంబై నింగికిం బొంగి దిశలకుం గేలు చాఁచి బయళ్ళు ప్రబ్బికొని తరిగవ్వంపుఁ గొండ నండ గొనక; నిగిడి కడలి నలుగడలకుం బఱచి; దరుల కుఱికి; సురాసుర సముదయంబులం దరిగొని; గిరివర గుహాగహ్వరంబుల సుడిపడక కులశిఖరి శిఖరంబుల నెరగలివడి; గహనంబుల దహించి కుంజమంజరీ పుంజంబుల భస్మంబుజేసి; జనపదంబు లేర్చి; నదీ నదంబు లెరియించి; దిక్కుంభి కుంభంబులు నిక్కలుపడ నిక్కి; తరణి తారామండలంబులపై మిట్టించి; మహర్లోకంబు దరికొని; యుపరిలోకంబునకు మాఱుగొనలిడి సుడిపడి ముసురుకొని; బ్రహ్మాండ గోళంబు చిటిలి పడన్ దాఁటి; పాతాళాది లోకంబులకు వేళ్ళుబాఱి; సర్వలోకాధికంబై శక్యంబుగాక యెక్కడఁ జూచినం దానయై; కురంగంబు క్రియం గ్రేళ్ళుఱుకుచు; భుజంగంబు విధంబున నొడియుచు; సింగంబు భంగి లంఘించుచు; విహంగంబు పగిది నెగయుచు; మాతంగంబు పోలికి నిలువంబడుచు నిట్లు హాలాహల దహనంబు జగంబులం గోలాహలంబు చేయుచున్న సమయంబున; మెలకు సెగల మిడుకం జాలక నీఱైన దేవతలును; నేలంగూలిన రక్కసులును; డుల్లిన తారకలును; గీటడంగిన కిన్నర మిథునంబులును; గమరిన గంధర్వవిమానంబులును; జీకాకుపడిన సిద్ధచయంబులును; జిక్కుపడిన గ్రహంబులును జిందఱవందఱ లయిన వర్ణాశ్రమంబులును; నిగిరిపోయిన నదులును; నింకిన సముద్రంబులును; గాలిన కాననంబులును బొగిలిన పురంబులును; బొనుఁగుపడిన పురుషులును; బొక్కిపడిన పుణ్యాంగనా జనంబులును; బగిలిపడిన పర్వతంబులును భస్మంబులైన ప్రాణి సంఘంబులును; వేఁగిన లోకంబులును; వివశలైన దిశలును; నొడ్డగెడవులైన భూజచయంబులును; నఱవఱలైన భూములునునై యకాల విలయకాలంబై తోచుచున్న సమయంబున.

భావము:

మంథర పర్వతంతో చిలికిన చిలుకుడుకు పాలసముద్రంలో పుట్టిన హాలాహలం, ప్రళయకాలంలో, పరమేశ్వరుని నుదటి కన్ను నుండి వెలువడే మహా భయంకరమైన అగ్నిజ్వాలలకంటె నూరురెట్లు చురుకైనది; కల్పాంతకాలపు అగ్నికంటె వెయ్యిరెట్లు తీవ్రమైనది; మహాప్రళయకాలపు లక్ష సూర్యుల తేజస్సువలె తేరిచూడరానిది; ప్రళయకాలపు కాళరాత్రిలో మెరిసే మేఘాల నుండి కురిసే పిడుగులవలె మహా భీకరమైనది; భగ భగ మండే పంచభూతాలవలె భరింపలేనిది. భుగ భుగ మనే పొగలతో, చిటపటమనే నిప్పుకణాలతో, ధగ ధగ మని మెరిసే పెనుమంటలతో, ఫట ఫట మంటూ ఆ మాహా విషం ఆకాశం అంత ఎత్తు పొంగుతోంది; దిక్కులంతా వ్యాపిస్తోంది; బయళ్ళన్నీ నిండిపోతోంది; మంథర పర్వతాన్ని దాటి సముద్రంలో నలువైపులా వ్యాపిస్తోంది; చెలియలికట్టలు గట్లు దాటేస్తోంది;. దేవదానవుల గుంపులను దాటిపోతోంది; కొండగుహలలో తొట్రుపడకుండా ఎత్తైన పర్వతశిఖరాలలో నిప్పులు నింపేస్తోంది; అడవులను కాల్చేస్తోంది; పొదరిళ్ళలో పూలగుత్తులను మాడ్చేస్తోంది. గ్రామాలను కాల్చేస్తోంది; నదీనదాలను ఎండగట్టేస్తోంది; దిగ్గజాల కుంభస్థలాలపైకి ప్రాకేస్తోంది; సూర్యగోళాన్నీ నక్షత్రాలనూ అణగద్రొక్కేస్తోంది; మహర్లోకాన్ని మసిచేస్తోంది; ఊర్థ్వ లోకాలకు కీడు కలిగేటట్లు పెరగిపోతోంది; చుట్టు ముట్టి క్రమ్ముకొని బ్రహ్మాండం బద్ధలయిపోయేలా విస్తరిస్తోంది; పాతాళ లోకం దాకా వ్రేళ్ళూనుతోంది. ఆ హాలాహలం ఎటుచూస్తే అటుప్రక్క అసాధరణంగా అన్నిలోకాలలోనూ కూరుకుపోతోంది; జింకవలె గంతులు వేస్తోంది; సింహాంవలె దూకుతోంది; పక్షిలా ఎగురుతోంది; ఏనుగులా స్థిరంగా నిలబడిపోతోంది; లోకాలన్నిటా గగ్గోలు పెట్టిస్తోంది. ఆ పెను మంటల వేడికి తట్టుకోలేక దేవతలు కొందరు భస్మం అయ్యారు; రాక్షసులు నేలకూలారు; చుక్కలు రాలాయి; కిన్నర దంపతులు నశించారు; గంధర్వుల విమానాలు కాలిపోయాయి; సిద్ధుల గుంపులు చెదిరి పోయాయి; గ్రహాలు సంకటపడ్డాయి; నదులు ఎండిపోయాయి; సముద్రాలు ఇంకిపోయాయి; అడవులు మాడిపోయాయి; పట్టణాలు బావురుమన్నాయి; పురుషులు వెతల పాలయ్యారు; పుణ్యస్త్రీలు పొగిలిపోయారు; పర్వతాలు బ్రద్దలైపోయాయి; జీవరాసులు అడుగంటిపోయాయి; లోకాలు తపించి పోయాయి; దిక్కులు కలత చెందాయి; చెట్లు తలక్రిందులు అయ్యాయి; నేలలు బదాబదలు అయ్యాయి; అకాలంలో ప్రళయం వచ్చినట్లు అయింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=216

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

నీలకంఠ వైభవం - 1

8-215-క.
ఆలోల జలధి లోపల
నాలో నహి విడిచి సురలు నసురులుఁ బఱవం
గీలా కోలాహలమై
హాలాహల విషము పుట్టె నవనీనాథా!


భావము:
పరీక్షిన్మహారాజా! అల్లకల్లోలమైన పాలకడలిలో నుండి అగ్నిజ్వాలల కోలాహలంతో కూడిన “హాలాహలము” అనే మహావిషము పుట్టింది. అది చూసి భయంతో దేవతలూ, రాక్షసులూ పట్టుకున్న నాగరాజు వాసుకిని వదలిపెట్టి పారిపోసాగారు.
లకార ప్రాసతో హాలాహల, కోలహలాలకు జత కట్టించిన బమ్మెరవారి పద్యం మధురాతి మధురం.


http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=215


:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




Sunday, February 4, 2018

ద్వారక అస్తమయం - 28:

11-123-క.
ఈ కథ విన్నను వ్రాసిన 
బ్రాకటముగ లక్ష్మి యశము భాగ్యము గలుగుం
జేకొని యాయువు ఘనుఁడై
లోకములో నుండు నరుఁడు లోకులు వొగడన్‌.
11-124-చ.
నగుమొగమున్‌ సుమధ్యమును నల్లని మేనును లచ్చికాటప
ట్టగు నురమున్‌ మహాభుజము లంచితకుండలకర్ణముల్‌ మదే
భగతియు నీలవేణియుఁ గృపారసదృష్టియుఁ గల్గు వెన్నుఁ డి
మ్ముగఁబొడసూపుఁగాతఁ గనుమూసినయప్పుడు విచ్చినప్పుడున్‌.

భావము:
ఈ కథను విన్నవారు, వ్రాసినవారు సిరిసంపదలు కీర్తి అదృష్టము కలిగి దీర్ఘాయువుతో లోకులు మెచ్చే గొప్పవారై ప్రకాశిస్తారు. నవ్వు ముఖము; చక్కని నడుము; నల్లని దేహము; లక్ష్మీదేవికి నివాసమైన వక్షస్థలము; పెద్ద బాహువులు; అందమైన కుండలాలు కల చెవులు; గజగమనము; నల్లనిజుట్టు; దయారసం చిందే చూపు కలిగిన విష్ణుమూర్తి నేను కనులు మూసినపుడు తెరచినపుడు పొడచూపు గాక.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=18&padyam=124

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Friday, February 2, 2018

ద్వారక అస్తమయం - 27

11-122-వ.
అనుచు నా దారుకుండు నిర్వేదనపరుండై యిట్లని విన్నవించె; “యాదవసముద్రం బడంగె; బంధు గురు మిత్ర జనంబు లక్కడక్కడం బోయిరి; ద్వారకకుం బోయి సుహృజ్జనంబులతోడ నేమందు?” నని పలుకునవసరంబున దివ్యాయుధంబులును, దివ్య రథరథ్యంబులు నంతర్ధానంబు నొందె; నారాయణుండు వానితో“ నక్రూరవిదురులకు నీవృత్తాంతం బంతయుఁ జెప్పుము; సవ్యసాచిం గని స్త్రీ బాల గురు వృద్ధ జనంబులఁ గరిపురంబునకుం గొనిచను మనుము; పొ” మ్మనిన వాఁడును మరలి చని కృష్ణుని వాక్యంబులు సవిస్తరంబుగాఁ జెప్పె; నట్లు సేయు నాలోన ద్వారకానగరంబు పరిపూర్ణజలంబై మునింగె; నంత నెవ్వరికిం జనరాకయుండె నప్పరమేశ్వరుండును శతకోటి సూర్యదివ్యతేజో విభాసితుండై వెడలి నారదాది మునిగణంబులును, బ్రహ్మరుద్రాదిదేవతలును, జయజయశబ్దంబులతోడం గదలిరా నిజపదంబున కరిగె; నన్నారాయణ విగ్రహంబు జలధి ప్రాంతంబున జగన్నాథస్వరూపంబై యుండె” నని శుకుండు పరీక్షిన్నరేంద్రునకుం జెప్పె" నని చెప్పి.


భావము:
అంటూ దారుకుడు మిక్కిలి దుఃఖంతో ఇలా విన్నవించాడు. “సముద్రమంత యాదవ సమూహం నశించింది. బంధువులు, గురువులు, మిత్రులు అందరు అటు ఇటూ చెల్లాచెదురైపోయారు. ద్వారకకు పోయి మిత్రులతో ఏమని చెప్పాలి.” అని అంటూండగానే, శ్రీకృష్ణుని దివ్యమైన ఆయుధాలు, గుఱ్ఱాలూ మాయమైపోయాయి. శ్రీకృష్ణుడు దారుకుడితో, “అక్రూరునికీ విదురునికీ జరిగిందంతా చెప్పు. స్త్రీలను, పిల్లలను, పెద్దవారిని హస్తినాపురానికి తీసుకుని వెళ్ళమని అర్జునుడితో చెప్పు. వెళ్ళు.” అన్నాడు. దారుకుడు తిరిగివెళ్ళి కృష్ణుడి మాటలు వివరంగా అందరికీ చెప్పాడు. ఆయన చెప్పినట్లు చేసేటంతలో ద్వారకానగరం పూర్తిగా జలాలలో మునిగిపోయింది. ఎవరికీ ప్రవేశించటానికి వీలులేని స్థితికి వెళ్ళిపోయింది. అప్పుడు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు నూరుకోట్ల సూర్యుల దివ్యతేజస్సుతో వెడలి నారదుడు మున్నగు మునులు, బ్రహ్మదేవుడు, రుద్రుడు, మొదలయిన దేవతలు జయజయ నినాదాలతో వెంట రాగా తన స్థానానికి వెళ్ళిపోయాడు. ఆ నారాయణుని విగ్రహము సముద్ర ప్రాంతంలో జగన్నాథుడి రూపంతో ఉంది.” అని శుకబ్రహ్మ పరీక్షిన్మహారాజుకి చెప్పాడు.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




ద్వారక అస్తమయం - 26:

11-121-తే.
నిన్నుఁజూడని కన్నులు నిష్ఫలములు
నిన్ను నొడువని జిహ్వదా నీరసంబు
నిన్నుఁ గానని దినములు నింద్యము లగుఁ
గన్నులను జూచి మమ్మును గారవింపు.

భావము:
“నిన్ను చూడని కన్నులు నిష్ఫల మైనవి; నిన్ను వర్ణించని నాలుక నీరసమైనది; నిన్ను కనుగొనని దినాలు నిందింపదగినవి; స్వామీ! నీ కనులెత్తి మమ్ము దయతో చూడు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=18&padyam=121

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Thursday, February 1, 2018

ద్వారక అస్తమయం - 25

11-119-క.
దారుకుఁడు గనియె నంతటఁ
జారు నిరూఢావధాను సర్వజ్ఞు హరిన్‌
మేరునగధీరు దనుజవి
దారుని నేకాంతపరునిఁ దద్దయు నెమ్మిన్‌.
11-120-వ.
కని యత్యంతభయభక్తితాత్పర్యంబుల ముకుళిత కరకమలుండై యిట్లనియె.


భావము:
ఆ సమయంలో రథసారథి అయిన దారుకుడు వచ్చి సర్వజ్ఞుడు, మేరుపర్వతధీరుడు, దనుజ సంహారుడు అయిన శ్రీకృష్ణుడు ఒంటరిగా ఉండటం చూసాడు. అలా చూసి మిక్కిలి భయ భక్తులతో చేతులు జోడించి దారుకుడు ఇలా అన్నాడు.


http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=18&padyam=119


:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




ద్వారక అస్తమయం - 24:

11-118-వ.
అనిన రాజునకు శుకుం డిట్లనియె “నట్లు వాసుదేవుం డన్యాయ ప్రవర్తకులగు దుష్టుల సంహరించి, న్యాయప్రవర్తకులగు శిష్టులఁ బరిపాలనంబు సేసి, బలరామ సమేతంబుగా ద్వారకానగరంబు వెడలినం గని యాదవులు దమలోఁ దాము మదిరాపానమత్తులై మత్సరంబున నుత్సాహకలహంబునకుం గమకించి, కరి తురగ రథ పదాతిబలంబులతో ననర్గళంబుగా యుద్ధసన్నద్ధులై, యుద్ధంబునకుం జొచ్చి మునిశాపకారణంబున నుత్తుంగంబు లయిన తుంగ సమూహంబుల బడలుపడంగఁ బొడుచుచు, వ్రేయుచుం దాఁకు నప్పుడు నవియును వజ్రాయుధ సమానంబులై తాఁకిన భండనంబునం బడి ఖండంబులై యొఱగు కబంధంబులును, వికలంబులైన శరీరంబులును, విభ్రష్టంబులైన రథంబులును, వికటంబులైన శకటంబులును, వ్రాలెడు నశ్వంబులును, మ్రొగ్గెడి గజంబులునై, యయ్యోధనంబున నందఱుం బొలియుటకు నగి నగధరుండును రాముండునుం జనిచని; యంత నీలాంబరుం డొక్క త్రోవంబోయి యోగమార్గంబు నననంతునిం గలసె; నప్పరమేశ్వరుండు మఱియొక మార్గంబునం జని యొక్క నికుంజపుంజంబు చాటున విశ్రమించుటంజేసి చరణంబు వేఱొక చరణంబు మీఁద సంఘటించి చంచలంబుగా వినోదంబు సలుపు సమయంబున నొక్క లుబ్ధకుండు మృగయార్థంబుగా వచ్చి దిక్కులు నిక్కి నిరీక్షించుచుండ, వృక్షంబు చాటున నప్పరమపురుషుని చరణ కమలంబు హరిణకర్ణంబు గాఁబోలునని దానిం గని శరంబు శరాసనంబునందు సంధానంబు సేసి యేసిన నతండు హాహారవంబునం గదలుచుండ నప్పరమేశ్వరుని సన్నిధానంబునకు వచ్చి జగన్నాథుంగాఁ దెలిసి, భయంబున “మహాపరాధుండను; బాపచిత్తుం డను; గుటిలప్రచారుండ” నని యనేకవిధ దీనాలాపంబులం బలుకుచు బాష్పజలధారాసిక్తవదనుండైన, సరోజనేత్రుండు వానిం గరుణించి యిట్లనియె; “నీ వేల జాలింబడెదు? పూర్వజన్మ కర్మంబు లెంత వారికైన ననుభావ్యంబులగుం గాని యూరక పోవనేరవు; నీవు నిమిత్తమాత్రుండ; వింతియ కాని” యని వానికిం దెలిపిన వాఁడును “మహాపరాధులైన వారూరక పోవరు; దేవ గురు వైష్ణవ ద్రోహులకు నిలువ నెట్లగు” నని పవిత్రాంతఃకరణుండై ప్రాయోపవేశంబునం బ్రాణంబులు వర్జించి వైకుంఠపదప్రాప్తుండయ్యె నప్పుడు.

భావము:
ఇలా అడిగిన రాజుతో శుకుడు ఇలా చెప్పాడు. “అలా శ్రీకృష్ణుడు అన్యాయమార్గంలో నడిచే దుర్మార్గులను చంపి, న్యాయమార్గంలో నడిచే సజ్జనులను కాపాడి బలరాముడు తాను ద్వారకనుండి వెళ్ళిపోయారు. పిమ్మట యాదవులు తమలో తాము మద్యపానంచేసి మత్తిల్లి, ఈర్ష్యతో పరిహాసంగా పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. అది నిజమైన పోట్లాటగా మారింది. ఏనుగులు, గుఱ్ఱాలు, రథాలు, కాల్బలములు తోకూడి అడ్డు ఆపు లేకుండా వారిలో వారే యుద్ధాలు మొదలుపెట్టారు. మునిశాపం కారణంగా ఎత్తుగా పెరిగిన తుంగ బెత్తాలతో అలసిపోయేలా కొట్టుకుంటూ బాదుకుంటూ యుద్ధాలు చేయసాగారు. ఆ తుంగబెత్తాలు వజ్రాయుధంతో సమానమైన ఆయుధాలవలె తాక సాగాయి. అలా ఒకరినొకరు పొడుచుకుంటూ భయంకరంగా యుద్ధం చేశారు. రణరంగమంతా ముక్కలు ముక్కలై చెదరిన మొండెములతో, వికలమైన దేహాలతో, విరిగిన రథాలతో, కూలిన గుఱ్ఱాలతో, వాలిన ఏనుగులతో నిండిపోయింది. యాదవులు అందరూ ఆ సమరంలో చచ్చిపోయారు. ఇదంతా చూసి నవ్వుకుంటూ శ్రీకృష్ణుడు బలరాముడు ఎటో వెళ్ళిపోయారు. కొంతదూరం వెళ్ళిన తరువాత బలరాముడు ఒక్కడు వేరు మార్గాన పోయి యోగమార్గంతో అనంతునిలో కలిశాడు. పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు మరో మార్గంలో వెళ్ళి ఒక గుబురు పొద చాటున విశ్రాంతిగా పడుకుని ఒక కాలు మీద మరొక కాలు పెట్టి వినోదంగా ఆడిస్తున్నాడు. ఆ సమయంలో, ఒక బోయవాడు వేటకు వచ్చి అన్ని ప్రక్కలకు నిక్కి చూస్తూ ఉంటే, ఆ చెట్టుచాటున ఆ పరమపురుషుని కదలుతున్న కాలు లేడి చెవిలాగా కనిపించింది. అది చూసి, అంబులపొది నుంచి బాణం తీసి విల్లెక్కుపెట్టి గురిచూసి కొట్టాడు. ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు హాహాకారం చేయసాగాడు. వాడు దగ్గరకు వచ్చి చూసి జగదీశ్వరుడైన కృష్ణుడని తెలుసుకుని భయంతో, “అపరాధం చేసాను పాపాత్ముడిని వక్రబుద్ధిని.” అని రకరకాలుగా దీనంగా ఏడుస్తూ కన్నీరు కార్చసాగాడు. వానిని చూసి కృష్ణుడు దయతో ఇలా అన్నాడు. “నీవు దుఃఖిచనక్కర లేదు. పూర్వజన్మల కర్మలు అనుభవించక ఎంతటి వారికి అయినా తప్పవు. వాటి ఫలితాల ఊరకే పోవు. నీవు నిమిత్రమాత్రుడివి మాత్రమే.” ఇలా వాడికి నచ్చ చెప్పినా వాడు, “ఇంత పెద్ద తప్పు చేసాక ఊరకే పోదు. దైవానికి, గురువులకు, వైష్ణవులకు, ద్రోహం చేసినవాడు ధరణిపై నిలువరాదు.” అని పలికి, పవిత్రమైన మనస్సుతో ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదిలి వైకుంఠానికి వెళ్ళాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=18&padyam=118

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::