10.2-1330-వ.
అని మఱియు నిట్లను; “వారలు ప్రద్యు మ్నానిరుద్ధ, దీప్తిమ ద్భాను, సాంబ, మిత్ర, బృహద్భాను, మిత్రవింద, వృ కారుణ, పుష్కర, దేవబాహు, శ్రుతదేవ, సునందన, చిత్రబాహు, వరూధ, కవి, న్యగ్రోధ, నామంబులం బ్రసిద్ధు లైరి; వెండియుఁ ద్రివక్ర యందు సంభవించిన యుపశ్లోకుం డనువాఁడు దన జనకుండైన కృష్ణు పాదారవింద సేవారతుండగుచు నారదయోగీంద్రునకు శిష్యుండై యఖండిత దివ్యజ్ఞాన బోధాత్మకుం డగుచు, స్త్రీ శూద్ర దాసజన సంస్కారకంబై స్మరణమాత్రంబున ముక్తిసంభవించునట్టి సాత్త్వత తంత్రం బను వైష్ణవస్మృతిం గల్పించె; నిట్లు మధుసూదననందనులు బహుప్రజలును, నధికాయురున్నతులును, ననల్పవీర్యవంతులును, బ్రహ్మణ్యులునై విఖ్యాతింబొందిరి; వారిని లెక్క వెట్టఁ బదివేల వత్సరంబులకైనం దీఱదు, మున్ను నీకెఱింగించి నట్లు తత్కుమారులకు విద్యావిశేషంబుల నియమించు గురు జనంబులు మూఁడుకోట్లునెనుబదెనిమిదివేలనూర్గు రనం గల్గి యుందు; రక్కుమారుల లెక్కింప నెవ్వరికి శక్యం? బదియునుం గాక యొక్క విశేషంబు సెప్పెద విను"మని యిట్లనియె.
భావము:
అని శుకుడు పరీక్షుత్తుతో మళ్ళీ ఇలా అన్నాడు. “రుక్మిణి మున్నగు ఆ అష్టపట్టమహిషలకు కలిగిన పుత్రులలో ప్రసిద్ధులైనవారు పద్దెనిమిది మంది, వారు 1.ప్రద్యుమ్నుడు, 2.అనిరుద్ధుడు, 3.దీప్తిమంతుడు, 4.భానుడు, 5.సాంబుడు, 6,బృహద్భానుడు, 7.మధుడు, 8.మిత్రవిందుడు, 9.వృకుడు, 10.అరుణుడు, 11.పుష్కరుడు, 12.దేవబాహుడు, 13.శ్రుతదేవుడు, 14.సునందుడు, 15.చిత్రబాహువు, 16.వరూధుడు, 17.కవి, 18.న్యగ్రోధుడు అనేవారు. త్రివక్ర అనే ఆమెకి కృష్ణుని వలన పుట్టిన ఉపశ్లోకు డనేవాడు శ్రీకృష్ణభక్తుడై నారదునికి శిష్యుడై సాత్వతతంత్రం అనే వైష్ణవ స్మృతిగ్రంథాన్ని రచించాడు. స్త్రీలకూ శూద్రులకూ దాసజనానికి ఈ గ్రంథం పఠన మాత్రం చేతనే ముక్తిమార్గాన్ని అందిస్తుంది. ఈ విధంగా కృష్ణుడి పుత్రులు అసంఖ్యాకులై ఆయురార్యోగ్యాలతో, మహాబలంతో, బ్రహ్మణ్యులై, మహోన్నతులై ప్రకాశించారు. వారందరినీ లెక్కపెట్టడానికి పదివేలసంవత్సరాలైనా చాలవు. వారి కోసం నియమించబడిన గురువులే మూడుకోట్లఎనభైఎనిమిదివేలనూరుమంది ఉన్నారు ఇక శ్రీకృష్ణుని సంతతి లెక్కించడం ఎవరికి మాత్రం సాధ్యము అవుతుంది. అంతే కాదు మరొక మరొక విశేషం ఉంది చెప్తాను.” అని శుకుడు మళ్ళీ ఇలా చెప్పసాగాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=87&Padyam=1330
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment