Monday, September 26, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౩౯(639)

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 

10.2-1324-మ.
అరవిందాక్ష పదాంబుజాత యుగళధ్యానానురాగక్రియా
సరసాలాప విలోకనానుగత చంచత్సౌఖ్య కేళీరతిం
దరుణుల్ నూఱుపదాఱువేలు మహితోత్సాహంబునం జొక్కి త
త్పరలై యొండు దలంప కుండిరి సవిభ్రాంతాత్మ లై భూవరా!
10.2-1325-వ.
అదియునుం గాక.
10.2-1326-మ.
హరినామాంకితమైన గీత మొకమా టాలించి మూఢాత్ములున్
విరతిం బొందఁగఁజాలి యుందురట; యా విశ్వాత్ము నీక్షించుచుం
బరిరంభించుచు, నంటుచున్నగుచుసంభాషించుచున్నుండు సుం
దరు లానంద నిమగ్ను లౌట కిలఁ జోద్యం బేమి? భూవల్లభా! "

భావము:
ఓ రాజా! ఆ పదహారువేలవంద మంది శ్రీకృష్ణసతులు పద్మాక్షుని పాదారవిందాలపై అనురాగాలతో, సరససల్లాపాలుతో, మధుర వీక్షణలతో, మహా సౌఖ్యాలతో, కేళీరతులతో గొప్ప ఉత్సాహాలతో సొక్కి సోలుతూ ఉన్నారు. సంపూర్ణంగా శ్రీకృష్ణ తత్పరులై ఇతర ధ్యాసలు లేకుండా ఉన్నారు. అంతేకాకుండా మహారాజ! ఎంతటి మూఢాత్ములైనా హరినామ సంకీర్తనం ఒక్కసారి వింటేనే ముక్తిని పొందుతారుట. అలాంటిది ఆ మహానీయుడినే చూస్తూ; అతడిని కౌగలిస్తూ, తాకుతూ; అతనితో నవ్వుతూ, సంభాషిస్తూ; ఆ అంగనలు ఆనందపారవశ్యులు కావడంలో ఆశ్చర్యం ఏముంది?”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=87&Padyam=1326

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: