10.2-1310-సీ.
సాంద్రశరచ్చంద్ర చంద్రికా కర్పూర-
నీహార హారాభ దేహ మమర
నిందింది రేందీవ రేంద్ర నీలద్యుతిఁ-
గర మొప్పు మేచక కంఠసమితి
యరుణాంశుబింబ భాసుర పద్మరాగ వి-
స్యస్త సహస్రోరు మస్తకములు
వివృతాననోద్గత విషధూమరేఖల-
లీలఁ జూపట్టిన నాలుకలును
10.2-1310.1-తే.
గలిత సాయంతనజ్వలజ్జ్వలన కుండ
ముల విడంబించు వేఁడి చూపులును గలిగి
భూరి కలధౌత గిరినిభాకార మమరఁ
బరఁగు భోగీంద్రభోగతల్పంబు నందు.
10.2-1311-వ.
సుఖాసీనుండై యున్నవాని డాయంజని యప్పుడు.
భావము:
అటువంటి ఆ దివ్యభవనంలో దట్టమైన శరత్కాలపు పండువెన్నెల, కర్పూరం, మంచులకు సాటివచ్చే తెల్లనిదేహము; తుమ్మెదల్లాగా నల్లకలువల్లాగా ఇంద్రనీలమణులలాంటి నల్లని కంఠాలు; ఉదయకాలం సూర్యుడిలాగా ప్రకాశించే పద్మరాగమణులతో కూడిన పడగలు; తెరచుకున్న నోళ్ళ నుంచి వెలువడే విషపు పొగలలా ఉన్న నాలుకలు; యాగగుండాలలోని జ్వాలలాగ ప్రకాశించే వేడిచూపులు; వెండికొండలాగా ఉన్న భారీ ఆకారము కలిగిన ఆదిశేషుడు. ఆ ఆదిశేషుని పాన్పుగా కొని సుఖంగా ఆసీనుడై ఉన్న తేజోమూర్తి దగ్గరకు శ్రీకృష్ణార్జునులు వెళ్ళి దర్శించారు
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1310
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment