Monday, September 19, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౩౨(632)

( మృత విప్రసుతులఁదెచ్చుట ) 

10.2-1312-సీ.
సజల నీలాంబుద శ్యామాయమానాంగు,-
  నాశ్రితావన ముదితాంతరంగు,
సనకాది యోగిహృద్వనజ మదాళీంద్రు,-
  ముఖపద్మ రుచిజిత పూర్ణచంద్రుఁ,
గమనీయ నిఖిలజగద్ధితచారిత్రుఁ,-
  బ్రత్యూషసంఫుల్లపద్మనేత్రు,
నిందిరాహృదయారవిందారుణోల్లాసు,-
  శ్రీకర పీత కౌశేయవాసు,
10.2-1312.1-తే.
హార కుండల కటక కేయూర మకుట
కంక ణాంగద మణిముద్రికా వినూత్న
రత్ననూపుర కాంచీ విరాజమాను,
భవమహార్ణవశోషు, సద్భక్తపోషు.

భావము:
నీలమేఘశ్యాముడు, ఆశ్రితజనరక్షకుడు, పద్మాలలో తుమ్మెదలాగ సనకాది మునీంద్రుల హృదయపద్మాలలో నివసించేవాడు, పూర్ణ చంద్రుని మించిన ముఖకాంతి కలవాడు, విశ్వవిఖ్యాత చారిత్రుడు, ప్రాతఃకాలంలో వికసించిన పద్మపత్రాల వంటి నేత్రాలు కలవాడు, లక్ష్మీమనోహరుడు, శ్రీకరుడు, పీతాంబరధరుడు, హారాలు కేయూరాలు కటక కంకణాలు కిరీటాలతో భూషణుడు, భవసాగర శోషణుడు, భక్తజన సంపోషణుడు అయిన మహావిష్ణువును వారు చూసారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1312

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: