Saturday, September 17, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౨౯(629)

( మృత విప్రసుతులఁదెచ్చుట ) 

10.2-1306-చ.
మసలక భూరిసంతమస మండలముం దఱియంగఁ జొచ్చి సా
హసమునఁ బోవఁబోవఁగ భయంకరమై మది గోచరింపమిన్
వసమఱి మోఁకరిల్లి రథవాజులు మార్గము దప్పి నిల్చినన్
బిసరుహపత్త్రలోచనుఁ డభేద్యతమఃపటలంబు వాపఁగన్.
10.2-1307-సీ.
బాలభానుప్రభా భాసమానద్యుతిఁ-
  గరమొప్ప నిజ రథాంగంబుఁ బనుప
నమ్మహాస్త్రం బేగి చిమ్మచీఁకటి నెల్ల-
  నఱిముఱి నందంద నఱికి వైచి
యగ్రభాగంబున నతులిత గతి నేగ-
  నా మార్గమున నిజస్యందనంబు
గడువడిఁదోలి యా కడిఁదితమోభూమిఁ-
  గడవ ముందఱకడఁ గానరాక
10.2-1307.1-తే.
మిక్కుటంబుగ దృష్టి మిర్మిట్లు గొనఁగఁ
జదల వెలుఁగొందు దివ్యతేజంబుఁ జూచి
మొనసి గాండీవి కన్నులు మూసికొనుచు
నాత్మ భయమంది కొంతద వ్వరిగి యరిగి.

భావము:
శ్రీకృష్ణార్జునులు దట్టమైన చీకటిమండలాన్ని ప్రవేశించారు. వారు సాహసంగా ముందుకు వెళ్తూ ఉంటే, చీకటి మరింత భయంకరంగా తయారైంది. కళ్ళకేదీ కనిపించ లేదు. గుఱ్ఱాలు శక్తి కోల్పోయి దారితప్పి నిలబడిపోయాయి. శ్రీకృష్ణుడు భేదించరాని ఆ చీకట్లను రూపుమాపడం కోసం బాలసూర్యుడి కాంతికి సాటివచ్చే కాంతితో వెలిగే తన చక్రాయుధాన్ని శ్రీకృష్ణుడు ప్రయోగించాడు. అది విజృంభించి చిమ్మచీకటిని తొలగిస్తూ పైనుండి ముందుకు దూసుకుని పోసాగింది. కృష్ణార్జునులు చక్రాయుధం వెళ్ళే మార్గం వెంట అమితివేగంగా రథాన్ని నడిపించుకుంటూ వెళ్ళి చీకటిని దాటారు. అప్పుడు వారి ముందు కన్నులు మిరుమిట్లు కొలిపే దివ్యతేజస్సు కనిపించింది. అర్జునుడు భయంతో కళ్ళు మూసుకున్నాడు. అతని ఆ స్థితిలో కొంత దూరం వెళ్ళారు..

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1307

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: