Friday, September 23, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౩౬(636)

( మృత విప్రసుతులఁదెచ్చుట ) 

10.2-1318-చ.
అనిమిషనాథనంద,నుఁ డహర్పతితేజుఁడు గృష్ణుతోడఁ దాఁ
జని యచటం గనుంగొనిన సర్వశరణ్యునిఁ, బుండరీకనే
త్రుని, నిజధామ వైభవసదున్నత తన్మహనీయ కీర్తికిన్
మనమున మోదమంది పలుమాఱును సన్నుతిఁ జేసె భూవరా!
10.2-1319-తే.
వారిజాక్షుని భక్తమందారు ననఘుఁ
గృష్ణు నఖిలేశుఁ గేశవు జిష్ణుఁ బరము
వినుతి సేయుచుఁ దత్పాదవనజములకు
వందనము లాచరించి యానంద మొందె.

భావము:
ఓ మహారాజా పరీక్షిత్తు! ఇంద్రతనయుడు సూర్యసమతేజస్వి అయిన అర్జునుడు కృష్ణుడితో వెళ్ళి తను దర్శించిన ఆ లోకశరణ్యుడు విష్ణుమూర్తి సౌధవైభవం; ఆయన మహనీయ సమున్నత యశస్సునకు మనస్సులో ఆనందించి పెక్కుమార్లు స్తుతించాడు. పద్మాక్షుడిని, భక్తమందారుని, పుణ్యాత్ముని, అఖిలేశుని, కేశవుని, జయశీలుని, పరమాత్ముని, శ్రీకృష్ణుడిని స్తుతించి; ఆయన పాదపద్మాలకు ప్రణామాలు చేసి అర్జునుడు మిక్కిలి ఆనందించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1319

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: