Tuesday, September 20, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౩౩(633)

( మృత విప్రసుతులఁదెచ్చుట ) 

10.2-1313-వ.
మఱియు సునందాది పరిజన సంతత సేవితు, నానందకందళిత హృదయారవిందు, నరవిందవాసినీ వసుంధరాసుందరీ సమేతు, నారదయోగీంద్రసంకీర్తనానందితు, నవ్యయు, ననఘు, ననంతు, నప్రమేయు, నజితు, నవికారు, నాదిమాధ్యాంతరహితు, భవలయాతీతుఁ, గరుణాసుధాసముద్రు, నచ్యుతు, మహానుభావుఁ, బరమపురుషుఁ, బురుషోత్తము, నిఖిలజగదుత్పత్తి స్థితిలయ కారణుఁ, జిదచిదీశ్వరు, నష్టభుజుఁ, గౌస్తుభశ్రీవత్సవక్షు, శంఖచక్ర గదా పద్మ శార్ఙ్గాది దివ్యసాధను, సర్వ శక్తి సేవితుఁ, బరమేష్ఠి జనకు, నారాయణుం గనుంగొని దండప్రణామంబులు సేసి కరకమలంబులు మొగిచి భక్తి పూర్వకంబుగా నభినందించిన, నయ్యాది దేవుండును వారలం గరుణావలోకనంబులు నిగుడ నవలోకించి, దరహాసపూరంబు దోరంబుగా సాదరంబుగ నిట్లనియె.

భావము:
అంతేకాదు, సదా సునందాది పరిజనులచే సేవించబడువాడు, నిత్యానంద కందళిత హృదయుడు, శ్రీదేవి భూదేవి సమేతుడు, నారదయోగీంద్ర గానలోలుడు, కరుణాసముద్రుడు, అవ్యయుడు, అనఘుడు, అనంతుడు, అప్రమేయుడు, అజితుడు, అవికారుడు, పరమ పురుషుడు, పురుషోత్తముడు, సకల లోకాల సృష్టి స్థితి లయ కారకుడు, చిత్తు అచిత్తులకు ఈశ్వరుడు, అష్టభుజుడు, వక్షమున కౌస్తుభమణి అలంకృతుడు, శంఖచక్రగదాశార్ఙ్గాది దివ్యాయుధ సంపన్నుడు, సర్వశక్తి సేవితుడు, బ్రహ్మదేవుని జనకుడు అయిన ఆ శ్రీమన్నారాయణునికి శ్రీకృష్ణార్జునులు భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి, చేతులు జోడించి స్తుతించారు. ఆ ఆదినారాయణుడు వారిని దయాదృష్టితో చూసి, మందహాసం చేసి, సాదరంగా ఇలా అన్నాడు..

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1313

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: