Saturday, September 17, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౨౮(628)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1304-ఉ.
సుందరదివ్యరత్నరుచి శోభితమై తనరారు కాంచన
స్యందన మంబుజాప్తుఁ డుదయాచల మెక్కు విధంబు దోఁపఁ బౌ
రందరి దాను నెక్కి తను రశ్ములు దిగ్వితతిన్ వెలుంగ గో
విందుఁ డుదారలీలఁ జనె విప్రతనూజ గవేషణార్థియై.
10.2-1305-చ.
చని పుర గోష్ఠ దుర్గ వన జానపదాచల పక్కణప్రభూ
త నద నదీ సరోవర యుతక్షితి నంతయు దాఁటి సప్త వా
రినిధుల దీవులం గులగిరిప్రకరంబుల నుత్తరించి మే
రునగము నాక్రమించుచు మరుద్గతితో రథ మేగ నత్తఱిన్.

భావము:
సూర్యుడు ఉదయపర్వతాన్నిఎక్కినట్లు, అందమైన దివ్యరత్నకాంతులతో ప్రకాశిస్తున్న బంగారు రథాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడితో కలిసి అధిరోహించాడు. తన దేహకాంతులు దిక్కుల ప్రకాశిస్తుండగా శ్రీకృష్ణుడు విప్రబాలురను వెదకటానికి బయలుదేరాడు. పట్టణాలతో పల్లెలతో దుర్గాలతో అరణ్యాలతో పర్వతాలతో నదీనదాలతో సరోవరాలతో నిండిన భూమండలం, సప్తసముద్రాలు, మహాదీవులు, కులపర్వతాలు, మేరుపర్వతం దాటి శ్రీకృష్ణుడి రథం మహావేగంతో ముందుకు సాగిపోయింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1304

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: