Sunday, September 18, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౩౦(630)

( మృత విప్రసుతులఁదెచ్చుట ) 

10.2-1308-తే.
కడఁగి దుర్వార మారుతోత్కట విధూత
చటుల సర్వంకషోర్మి భీషణ గభీర
వారిపూరంబు సొచ్చి తన్నీరమధ్య
భాగమునఁ గోటిసూర్యప్రభలు వెలుంగ.
10.2-1309-వ.
అది మఱియును జారు దివ్యమణి సహస్రస్తంభాభిరామంబును, నాలంబిత కమనీయ నూత్న రత్నమాలికాలంకృతంబును, భాను శశి మయూఖాగమ్యంబును, ననంత తేజోవిరాజితంబును, బునరావృత్తిరహిత మార్గంబును, నిత్యైశ్వర్య దాయకంబును, నవ్యయంబును, నత్యున్నతంబును, ననూనవిభవంబును, బరమయోగీంద్ర గమ్యంబును, బరమభాగవత నివాసంబునునై యొప్పు దివ్యధామంబు నందు.

భావము:
పిమ్మట, పూని మహావేగంగా వీచే గాలులతో, చెలరేగే కెరటాలతో గంభీరంగా ఉన్న జలరాశిని కృష్ణార్జునులు ప్రవేశించారు. ఆ నీటి నడిమిభాగంలో కోటిసూర్యుల కాంతులు ప్రకాశిస్తున్నాయి. అక్కడ ఆ జలరాశిమధ్యలో ఒక దివ్యభవనం కనబడింది. దానిలో తేజోమయమైన వేలకొలది మనోహరమైన మణిస్తంభాలు ఉన్నాయి రమణీయ రత్నహారాలు అలంకృతమై వ్రేలాడుతున్నాయి. అది అనంత తేజస్సుతో విరాజిల్లుతోంది. సూర్యచంద్ర కిరణాలకు ప్రవేశింపరానిది, జన్మరాహిత్యానికి మార్గము, నిత్యైశ్వర్యదాయకము, అవ్యయము, మహోన్నతము, సాటిలేని వైభవోపేతము, పరమ యోగీంద్రులకు ప్రవేశయోగ్యము, భాగవతోత్తములకు నివాసస్థానము అయి విరాజిల్లుతోంది. ఆయొక్క మహాసౌధంలో...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1309

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: