Tuesday, May 31, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౫౫(555)

( సుభద్రా పరిణయంబు ) 

10.2-1167-క.
రాముఁడు తత్కపటాకృతిఁ
దా మదిఁ దెలియంగలేక దగ నొకనాఁ డా
భూమీవర తాపసుఁ బో
రామింగని యాత్మమందిరమునకుఁ దెచ్చెన్.
10.2-1168-ఆ.
తెచ్చి భిక్షసేయ దేవేంద్రతనయుండు
గుడుచుచుండి యచటఁ గోరి మెలఁగు
నసమబాణు మోహనాస్త్రంబుకైవడి
వీరమోహి నన విహారలీల.
10.2-1169-వ.
అట్లు సుభద్ర విహరించుచున్న సమయంబున.

భావము:
రాజా! బలరాముడికి అర్జునుడి కపట వేషం విషయం తెలియలేదు. అతడు సన్యాసిగా మెలగుచున్న ఆ అర్జునుణ్ణి చూసి తన మందిరానికి తీసుకుని వచ్చాడు. అలా బలరాముడు భక్తితో కపటసన్యాసి ఐన అర్జునునికి భిక్ష సమర్పించడం కోసం ఆహ్వానించి అర్చించాడు. ఆ మాయాతాపసి అక్కడే ఆరగిస్తూ ఉన్నాడు. అర్జునుని సమక్షంలో మన్మథుని సమ్మోహనాస్త్రంలా ఉన్న సుభద్ర కోరి విహరిస్తున్నది. ఆలాగున సుభద్ర అతని సమీపంలో సంచరిస్తున్న సమయంలో...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=81&Padyam=1168

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Saturday, May 28, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౫౪(554)

( సుభద్రా పరిణయంబు ) 

10.2-1166-వ.
అట్లు సుభద్రా దర్శనోత్సాహంబు దన మనంబున సందడిగొనం, ద్రిదండివేషంబు ధరియించి, ద్వారకాపురంబునకుం జనుదెంచి, యప్పౌరజనంబులు భక్తిస్నేహంబుల ననిశంబుఁ బూజింపం దన మనోరథసిద్ధి యగునంతకుం గనిపెట్టుకొని, వానకాలంబు సనునంతకు నప్పట్టణంబున నుండు సమయంబున.

భావము:
ప్రేమాతిశయం వలన సుభద్రను చూడాలని మిక్కుటమైన ఉబలాటం అర్జునునికి కలిగింది. అతడు సన్యాసివేషం ధరించి ద్వారకాపురి ప్రవేశించాడు. అక్కడి పౌరులు అతనిని సేవించసాగారు. తన సంకల్పం సఫలం చేసుకోవటం కోసం వర్షాకాలం దాటిపోయే టంత వరకూ ఆ ద్వారకా పట్టణంలోనే ఉన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=81&Padyam=1166

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Friday, May 27, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౫౩(553)

( సుభద్రా పరిణయంబు ) 

10.2-1165-సీ.
“మునినాథ! పార్థుండు వనజనాభుని సహో-
  దరి సుభద్రను నే విధమునఁ బెండ్లి
యయ్యెను నా విధం బంతయు నాకును-
  దెలియంగ నెఱిఁగింపు ధీవిశాల!”
యనవుడు నా వ్యాసతనయుఁ డాతనిఁ జూచి-
  “వినవయ్య! నృప! దేవవిభుని సుతుఁడు
మును తీర్థయాత్రాసముత్సుకుండై చని-
  రమణఁ బ్రభాసతీర్థమున నుండి
10.2-1165.1-తే.
యా తలోదరితోడి నెయ్యంబు కలిమిఁ
జూడఁ గోరుచు రాముఁడు సుందరాంగిఁ
గౌరవేంద్రున కీ సమకట్టె ననుచుఁ
దనకు నెఱుఁగ రా నా పురందరసుతుండు.

భావము:
ఓ మునీశ్వరా! మహా ఙ్ఞాని! అర్జునుడు శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్రను పరిణయమాడిన సన్నివేశం నాకు వివరంగా చెప్పండి.” ఇలా అడిగిన పరీక్షిత్తునకు శుకమహర్షి సుభద్రాపరిణయం ఇలా చెప్పసాగాడు. “ఓ మహారాజా! వినుము. అర్జునుడు పూర్వం తీర్ధయాత్రకు బయలుదేరి ఉత్సాహంగా ప్రభాసతీర్ధం చేరుకున్నాడు. సుభద్రమీద తనకున్న ప్రేమాతిశయం వలన ఆమెను చూడాలని అనుకున్నాడు. బలరాముడు సుభద్రను దుర్యోధనుడికిచ్చి వివాహం చేయలనుకుంటున్న విషయం అర్జునుడు విన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=81&Padyam=1165

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

శ్రీకృష్ణ విజయము - ౫౫౨(552)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1163-క.
చచ్చిన బాలురఁ గ్రమ్మఱఁ
దెచ్చుట గడుఁ జిత్ర మనుచు దేవకి మదిలో
నచ్చెరువడి యిది యంతయు
నచ్చపు హరిమాయ గాక! యని తలఁచె నృపా!
10.2-1164-క.
పరమాత్ముఁ డఖిల జగదీ
శ్వరుఁడగు కృష్ణుండు సేయు సత్కృత్యంబుల్‌
పరికింప నెన్నఁ బెక్కులు
ధరణీవర!" యనిన రాజు తా ముని కనియెన్.

భావము:
ఓ రాజా! అలా మరణించిన పుత్రులను మళ్ళీ తీసుకురావడం బాగా చిత్రమని ఆశ్చర్యపడిన దేవకీదేవి, ఇదంతా శ్రీకృష్ణుని మాయా మహత్వమే తప్ప ఇతరం కాదు అని అనుకుంది. ఓ మహారాజా! పరమాత్ముడు, లోకాధినాథుడు అయిన శ్రీకృష్ణుడు చేసిన సత్కార్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.” అని శుకమహర్షి తెలుపగా, ఆయనతో పరీక్షిత్తు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1164

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Wednesday, May 25, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౫౧(551)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1162-వ.
అట్లు కౌఁగిటం జేర్చి నిజాంకపీఠంబున నునిచి, శిరంబులు మూర్కొని, చిబుకంబులు పుణుకుచుం బ్రేమాతిశయమున మేనం బులకలొలయం జన్నిచ్చిన, వారును వైష్ణవమాయామోహితులై స్తన్యపానంబు సేయుచు భగవంతు డయిన రథాంగపాణి యంగ సంగంబున విగతకల్మషులై విధిశాపసాగరంబు హరిదయాకటాక్షంబను నావచేతం దరించి నిజస్వరూపంబులు ధరించి, కృష్ణునకుఁ దలిదండ్రులకు వందనం బాచరించి గగనపథంబున నిజస్థానంబున కరిగి; రంత దేవకీదేవి తన మనంబున.

భావము:
అలా లాలించి, తన చిన్నారి తనయులను దేవకీదేవి ఆలింగనం చేసుకుని, ఒడిలో కూర్చోబెట్టుకుంది. వారి నడినెత్తిన ముద్దిడింది, గడ్డం పుణికింది. పెల్లుబికిన ప్రేమతో ఆమె దేహం పులకలెత్తంది. వారికి చన్నిచ్చింది. వారు వైష్ణవ మాయా ప్రభావానికి వశులై తల్లిపాలు త్రాగారు. శ్రీకృష్ణుని స్పర్శవలన నిర్మలులు అయ్యారు. శ్రీహరి దయ అనే పడవ సహాయంతో బ్రహ్మశాపం అనే సాగరాన్ని దాటి స్వస్వరూపాలు ధరించి తమ తమ స్థానాలు చేరుకున్నారు. అంతట దేవకీదేవి తన మనసులో అచ్చెరువొందింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1162

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, May 24, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౫౦(550)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1159-వ.
అట్లు వారలం దోడితెచ్చి తల్లి కిట్లనియె.
10.2-1160-క.
"కనుఁగొనుము వీరె నీ నం
దను" లని జనయిత్రికడ ముదంబున వారి
న్నునిచిన నద్దేవకియును
ఘనపుత్త్రస్నేహ మోహకలితాత్మకయై.
10.2-1161-క.
చన్నులు దిగ్గనఁ జేపఁగఁ
గన్నులనానందబాష్పకణములుదొరఁగం
గ్రన్నన కౌఁగిట నిడి "ననుఁ
గన్నన్నలు వచ్చి" రనుచుఁ గౌతుక మొప్పన్.

భావము:
అలా ఆరుగురు శిశువులను తీసుకుని వచ్చి తల్లి దేవకీదేవితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “అమ్మా! ఇరిగో వీరే నీ బిడ్డలు చూడు” అంటూ ఆ బాలకులను తల్లి దేవకీదేవి ముందుకు తెచ్చాడు. ఆమెలో పుత్రవాత్సల్యం పొంగిపొరలింది. ఆ మాతృమూర్తి చన్నులు చేపాయి. కన్నుల్లో ఆనందాశ్రువులు జాలువారాయి. వారిని కౌగలించుకుని “నా కన్నబిడ్డలు వచ్చారు,” అని లాలించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1161

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Monday, May 23, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౪౯(549)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1157-క.
వీరలఁ దోకొని యిపుడే
ధారుణికిన్నేగి జనని తాపము వాపన్
వీరలు నంతట శాపముఁ
దీఱి మదీయప్రసాదధీయుతు లగుచున్.
10.2-1158-క.
పొలుపుగ సుగతిం బొందఁగఁ
గల" రని హరి యానతిచ్చి కరుణాన్వితుఁడై
బలిచే ననుమతిఁ గొని వా
రలఁ దోకొని వచ్చె నిద్ధరామండలికిన్.

భావము:
వీరిని తీసుకు వెళ్ళి భూలోకంలోఉన్న మా తల్లి శోకాన్నిపోగొడతాము. అంతటితో వీరు శాపవిముక్తులు కాగలరు; మా అనుగ్రహం వలన దివ్యజ్ఞానం కలవారు కాగలరు. తదుపరి, నా అనుగ్రహం వలన వీరికి సుగతి ప్రాప్తిస్తుంది.” ఈవిధంగా పలికి కరుణామయుడైన కృష్ణుడు బలిచక్రవర్తి అనుమతి పొంది భూలోకానికి దేవకీతనయులను తమ కూడా తీసుకుని వచ్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1158

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Sunday, May 22, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౪౮(548)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1155-క.
దొరఁకొని కంసుఁడు దోడ్తోఁ
బొరిగొనెఁ దత్పుత్త్రశోకమునఁ దన చిత్తం
బెరియఁగ దేవకి వారల
దరిశింపఁగఁ గోరి పనుపఁ దగ నసురేంద్రా!
10.2-1156-క.
వచ్చితిమి వారిఁ గ్రమ్మఱఁ
దెచ్చెద మని తల్లి కోర్కిఁ దీర్పఁగ నిపు డే
మిచ్చటికిని, నీకడఁ బొర
పొచ్చెము లేకున్నవారె పో వీ రనఘా!

భావము:
దేవకీదేవి గర్భాన వారు ప్రసవించారు. పట్టుబట్టి కంసుడు ఆ శిశువులను చంపివేశాడు. ఇప్పుడు దేవకీదేవి పుత్రశోకంతో కుమిలి వారిని చూడాలని కోరి పంపగా మేము ఇచ్చటకి వచ్చాము. ఓ పుణ్యాత్మా! ఆమెకు వారిని మరల తీసుకువస్తా మని మాట ఇచ్చి ఇక్కడకు వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నీ దగ్గర సుఖంగా ఉన్న వీరే ఆమె పుత్రులు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1156

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Thursday, May 19, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౪౭(547)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1153-వ.
దేవా! యేను భవద్దాసుండ! నేది పంచినం జేయుదు; నిచ్చటికి మీరలు విజయంబు చేసిన కార్యం బానతీయవలయు” నని కరంబులు మొగిచి, విన్నవించినం బుండరీకాక్షుం డతని వాక్యంబులకు సంతసిల్లి యిట్లనియె
10.2-1154-సీ.
"బలిదైత్య! విను మున్ను ప్రథమయుగంబున-
  నా మరీచికి భార్యయైన వర్ష
యను నింతివలన నందను లార్వు రుద్భవ-
  మైరి వా రొక్కనాఁ డబ్జభవుఁడు
తనపుత్త్రిపై మోహమునఁ గూడి రతికేళి-
  యొనరింప వీరు నవ్వుటయుఁ గ్రోధ
మంది యాసురయోని యందుఁ బుట్టుం డని-
  ఘనశాప మిచ్చె న వ్వనజజుండు.
10.2-1154.1-తే.
తన్నిమిత్తమునను వారు దగిలి హేమ
కశిపునకుఁ బుట్టి రంత నా కౌకసులకు
నొదవ వీరలఁ దెచ్చి య య్యోగమాయ
యడరి దేవకిగర్భము నందుఁ జొనుప.

భావము:
భగవాన్! నేను నీ దాసుడిని; నీ అజ్ఞకు బద్ధుడిని; మీరిక్కడికి వచ్చిన పని ఏమిటో చెప్పండి.” అని బలిచక్రవర్తి చేతులు జోడించి భక్తితో విన్నవించాడు. కృష్ణుడు సంతోషించి అతనితో ఇలా అన్నాడు. “దైత్యేంద్ర! బలి! పూర్వం ఆదియుగంలో మరీచి అనువానికి భార్య వర్ష యందు ఆరుగురు పుత్రులు పుట్టారు. ఒకనాడు బ్రహ్మదేవుడు తన పుత్రికనే కామించి శృంగారక్రీడకు ఉపక్రమించటం చూసి వారు అపహాసం చేసారు. ఆగ్రహించిన బ్రహ్మదేవుడు రాక్షసులుగా పుట్టండని శపించాడు. ఆ శాప కారణంగా వారు హిరణ్యకశిపుడికి కొడుకులుగా పుట్టారు. తరువాత దేవతల హితంకోరి యోగమాయ వారిని దేవకిగర్భం లోనికి ప్రవేశింప జేసింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1154

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Wednesday, May 18, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౪౬(546)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1151-వ.
దేవా! యే నరుండైన నేమి శ్రద్ధాగరిష్ఠచిత్తుండై మిమ్ము సేవించు నట్టి మహాత్ముండు విధిచోదితంబయిన ప్రమాణంబువలన విముక్తుండై వర్తించు; నట్లుగావున యోగీశ్వరుండవైన నీ వీశితవ్యుల మైన మమ్ము నిష్పాపులం జేయు” మని నుతించి మఱియు నిట్లనియె.
10.2-1152-మత్త.
“కంటిగంటి భవాబ్ధి దాఁటఁగఁ గంటి ముక్తినిధానముం
గంటి నీ కరుణావలోకముఁ గంటి బాపము వీడ ము
క్కంటి తామరచూలియుం బొడఁ గాననట్టి మహాత్మ! నా
యింటికిం జనుదెంచి తీశ్వర! యేఁ గృతార్థతఁ బొందితిన్.

భావము:
దేవా! శ్రద్ధాతిశయంతో నిన్ను సేవించే వాడు ఎవరైనా సరే మహాత్ముడే. ఆ మహాత్ముడు సంసారబంధాల నుంచి విముక్తుడవుతాడు. కనుక మహాయోగులకు ఈశ్వరుడవు ఐన నీవు పాలించదగినవారము ఐన మమ్మల్ని పాపరహితులను కావించు.” అని స్తుతించి, ఇంకా ఇలా అన్నాడు. “నా పాపం అంతరించింది; సంసారసాగరం దాటగలిగాను; ముక్తిసాధనం చూడగలిగాను; నీ కరుణాదృష్టికి పాత్రుడనయ్యాను; పరమశివుడు, బ్రహ్మదేవుడు సైతం కానరాని మహాత్మా! నీవు నా గృహానికి విచ్చేశావు. నేను ధన్యుడిని అయ్యాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1152

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Tuesday, May 17, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౪౫(545)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1149-ఉ.
వైరముచేతఁ జేదినృపవర్గముఁ, గామముచేత గోపికల్‌,
మీఱినభక్తి నాశ్రితులు మిమ్ము నహర్నిశమున్ మనంబులం
దారఁగనీక రూపగుణతత్పరులై మిముఁ బొందు కైవడిన్
భూరివివేక సత్త్వగుణముల్‌ గల దేవత లంద నేర్తురే!
10.2-1150-క.
కాన భవత్పదపద్మ
ధ్యానంబునఁ గాని శాస్త్రతత్త్వంబులచేఁ
గానరు శ్రుతిసంవేద్యం
బైన భవత్పదముఁ జిన్మయాకార! హరీ!

భావము:
వైరంతో శిశుపాలుడు మున్నగువారు; కామం చేత గోపికలూ; మిక్కిలి భక్తితో ఆశ్రితులూ; నిన్ను నిరంతరం విడువక చింతిస్తుంటారు. వారు నీ రూపగుణాలను స్మరించుకుంటూ నిన్ను చేరుకొన్నట్లుగా; సత్త్వగుణ సంపన్నులు, మహాజ్ఞానులు అయిన దేవతలు సైతం నిన్ను అందుకోలేరు. ఓ కృష్ణ! చిద్రూప! అందుచేత, నీ పాదపద్మాలను నిరంతరం ధ్యానించడం వలననే వేదవేద్యుడైనా నిన్ను చేరుకోగలరు కానీ శాస్త్రాలు వల్లెవేయడం వలన కాదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1150

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Monday, May 16, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౪౪(544)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1146-వ.
అని యభినందించి యిట్లనియె.
10.2-1147-ఉ.
"రాజస తామసాత్ములకు రాదుగదా నినుఁగాన నవ్యపం
కేజదళాయతాక్ష! మునిగేయ! పవిత్రచరిత్ర! విస్ఫుర
ద్రాజకళాధరాజ సురరాజ ముఖామర మౌళిరత్న వి
భ్రాజితపాదపీఠ! భవబంధవిమోచన! పద్మలోచనా!
10.2-1148-మ.
మది నూహింపఁగ యోగివర్యులు భవన్మాయా లతాబద్ధులై
యిదమిత్థమ్మనలేరు తామసులమై యేపారు మాబోఁటి దు
ర్మదు లేరీతి నెఱుంగఁ జాలుదురు సమ్యగ్ధ్యానధీయుక్తి? నీ
పదముల్‌ సేరెడి త్రోవఁ జూపి భవకూపంబుం దరింపింపవే!

భావము:
ఇలా ప్రార్థించి శ్రీకృష్ణుడితో బలి ఈలాగున అన్నాడు. “అంబుజాక్షా! రాజస తామస గుణాలతో మెలిగేవారు నీ దర్శనం పొందలేరు. మహర్షులచే కీర్తింపబడువాడా! అతి పవిత్ర చరిత్ర కలవాడ! పరమశివ బ్రహ్మేంద్రాది దేవతలు కిరీటాలలోని రత్నాలకాంతులు నీ పాదపీఠంపై ప్రతిఫలించేలా భక్తితో నమస్కరిస్తారు కదా. భవబంధాల్ని త్రెంచువాడవు నీవే కదా. ఎంతటి మహాయోగులు అయినా నీ మాయలకు వశులై నీవు ఎలాంటివాడవో? నీ రూపం ఎలాంటిదో? తెలుసుకోలేరు. అలాంటప్పుడు, మావంటి తామసులూ దుర్మదులూ నిన్నెలా తెలుసుకోగలరు. పరిపూర్ణ ప్రజ్ఞామతితో నీ పాదాలు చేరు మార్గం చూపించి మమ్మల్ని సంసారకూపం నుంచి ఉద్ధరించు

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1148

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Sunday, May 15, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౪౩(543)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1144-వ.
సమర్పించి యప్పుండరీకాక్షుని చరణారవిందంబు లొత్తుచు నా నందబాష్పపూరంబు తోరంబుగా రోమాంచ కంచుకిత శరీరుండగుచుం దన గరకమలంబులు ఫాలభాగంబునం గదియించి యిట్లని స్తుతియించె.
10.2-1145-ఉ.
ధీయుతుఁడై “నమో భగవతే! హరయే! పరమాత్మనే! ముకుం
దాయ! సమస్తభక్తవరదాయ! నమః పురుషోత్తమాయ! కృ
ష్ణాయ! మునీంద్రవంద్యచరణాయ! సురారిహరాయ! సాంఖ్యయో
గాయ! వినీల భాస్వదలకాయ! రథాంగధరాయ వేధసే!"

భావము:
అలా సత్కారాలు చేసిన పిమ్మట, జాలువారుతున్న ఆనందబాష్పాలతో, పులకించే శరీరంతో, చేతులతో పాదపద్మాలను ఒత్తుతూ, చేతులు జోడించి భగవంతుడైన శ్రీకృష్ణుడిని ఇలా స్తుతించాడు. చక్కటి బుద్ధిశాలి అయి “హేభగవాన్! శ్రీహరీ! పరమాత్మా! ముకుందా! భక్తవరదా! నీకు నమస్కారం. పురుషోత్తమా! శ్రీకృష్ణా! మునీశ్వర వంద్య! పాదపద్మా! రాక్షస ప్రాణ హరణా! చక్రధరా! సాంఖ్యయోగ స్వరూపా! మిలమిల మెరిసే నీలాల ముంగురుల వాడా! నమస్కారం.” అని బలిచక్రవర్తి శ్రీకృష్ణుడిని స్తుతించాడు

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1145

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Saturday, May 14, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౪౨(542)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1143-సీ.
సురభి కాలాగరు హరిచంద నై లాది-
  ధూపంబు లా విశ్వరూపకులకుఁ,
గాంచనపాత్ర సంగతరత్న కర్పూర-
  దీపంబు లా జగద్దీపకులకుఁ,
బాయసాపూపాన్న పక్వఫలాది నై-
  వేద్యంబు లా వేదవేద్యులకునుఁ,
దనరు వినూత్నరత్నప్రభాభాసి తా-
  భరణంబు లా దైత్యహరణులకును,
10.2-1143.1-తే.
మిలమిలని మంచుతోఁ బొలుపలరు బహు వి
ధాంబరంబులు నీలపీతాంబరులకు,
సలలిత కుసుమమాలికా మలయజాను
లేపనంబులు భూరినిర్లేపులకును.

భావము:
విశ్వరూపులైన బలరామ కృష్ణులను చక్కటి సువాసనలు విరజిమ్మే నల్లఅగరు, మంచిగంధము, ఏలకులు మున్నగు సుగంధ ధూపాలు; జగత్ప్రదీపకులు అయిన వారిని రత్నాలు పొదిగిన బంగారు పాత్రలో కర్పూరదీపాలు సమర్పించాడు. వేదవేద్యులు అయినవారిని పండ్లూ పాయసమూ అప్పములు మొదలైన నైవేద్యాలు; ఆ అసురసంహారులకు వినూత్న రత్నాభరణాలు; నీలాంబర పీతాంబరులకు మిలమిల మెరిసే బహు రకములైన సన్నని మేలు వస్త్రములు; మహా నిస్సంగులకు మనోహరమైన పూలదండలు, మంచిగంధపు మైపూతలు; దానవేశ్వరుడు బలిచక్రవర్తి అర్చించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1143

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Friday, May 13, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౪౧(541)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1141-మ.
కనియెన్ దానవుఁ, డింద్రసేనుఁడు దళత్కంజాక్షులన్, దక్షులన్,
ఘనసారాంబుదవర్ణులన్, నిఖిలలోకైకప్రభాపూర్ణులం,
దనరారన్ హలచక్రపాణులను, భక్తత్రాణులన్, నిత్యశో
భనవర్ధిష్ణుల, రామకృష్ణుల, జయభ్రాజిష్ణులన్, జిష్ణులన్.
10.2-1142-చ.
కని హితకోటితో నెదురుగాఁ జనుదెంచి మనోనురాగ సం
జనిత కుతూహలుం డగుచుఁ జాఁగిలి మ్రొక్కి సమగ్ర కాంచనా
సనముల నుంచి తచ్చరణసారససేచన సర్వలోక పా
వన సలిలంబు లౌదల ధ్రువంబుగఁ దాల్చి సుభక్తి యుక్తుఁ డై.

భావము:
సుతలలోక నివాసి ఐన దానవ చక్రవర్తి బలిచక్రవర్తి వికసించిన పద్మాలవంటి కన్నుల కలవారు, భక్తులను రక్షించేవారు, శాశ్వతమైన మేళ్ళు ఒనగూర్చు వారు, జయశీలురు, ప్రభాశీలురు అయిన బలకృష్ణులను; హలధరుడు, పచ్చకర్పూరం వంటి ఛాయ కల వాడు అయిన బలరాముడిని; చక్రధారి, నీలమేఘశ్యాముడు అయిన కృష్ణుడిని వస్తుండగా చూసాడు. బలిచక్రవర్తి తన ఆప్తులతో బలరామ కృష్ణుల కెదురు వచ్చి అత్యంతానురాగంతో వారికి స్వాగతం పలికి, పాదాభివందనాలు చేసాడు. వారిని సువర్ణపీఠాలపై ఆసీనులను చేసి వారి పాదాలు కడిగి పాదజలాన్ని భక్తితో తల మీద చల్లుకున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1142

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

శ్రీకృష్ణ విజయము - ౫౪౦(540)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1140-వ.
అని యనేక విధంబుల వినుతించుచు నిట్లనియె; “మీరలు మహానుభావులరు; మీరు తొల్లి యనేకకాలంబు సనినక్రిందట మృతుండై, దండధరుమందిరంబున నున్న గురుకుమారుని మీ మహాప్రభావంబులు లోకంబులఁ బరిపూర్ణంబులై ప్రకాశింప; నక్కాలుని చెంతనుండి మగుడందెచ్చి గురుదక్షిణగా నొసంగితి; రివ్విధంబునం గంసునిచేత హతులైన మత్పుత్త్రులనందఱ మరలం దెచ్చి నా మనంబున నున్న దుఃఖంబు నివారింపవలయు” నని దేవకీదేవి ప్రార్థించినం దమతల్లి యాడిన మృదుమధురవాక్యంబు లత్యాదరంబున నాదరించి, యప్పుడు బలకృష్ణులు దమ యోగమాయా మహత్త్వంబున సుతలంబునకుం జని; రట్టి యెడ.

భావము:
అని ఇలా బలరామకృష్ణులను స్తుతిస్తూ దేవకీదేవి వారితో ఇలా అన్నది. “మహానుభావులారా! మీరు చాలా కాలం క్రితం మృతుడై యమలోకంలో ఉన్న గురువు యొక్క కుమారుని తీసుకువచ్చి గురుదక్షిణగా సమర్పించిన మహాత్ములు. మీ గొప్పదనం లోకులు వేనోళ్ళ పొగడుతున్నారు. అలాగే కంసుడు సంహరించిన నా బిడ్డలను తీసుకువచ్చి నా శోకాన్ని నివారించండి.” ఇలా తల్లి దేవకీదేవి వేడుకోగా బలరామకృష్ణులు ఆదరంతో విన్నారు. తమ యోగ మాయా ప్రభావంతో సుతలలోకానికి వెళ్ళారు. అప్పుడు....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1140

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Wednesday, May 11, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౩౯(539)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1138-క.
ముర కంస చైద్య పౌండ్రక
నరక జరాతనయ యవన నరనాయకులన్
దురితాత్ములఁ బొరిగొని భూ
భర ముడిపిన యట్టి మేటిబలులు దలంపన్.
10.2-1139-ఆ.
జనన వృద్ధి విలయ సంగతి నిఖిలంబుఁ
బొందఁ జేయు పరమపురుషులార!
మీకు లీల లౌట మీ రని నమ్మిన
దాన నేను వినుఁ డుదారులార!"

భావము:
“మీరు పాపాత్ములైన కంసుడు, చేదిదేశపు శిశుపాలుడు, మురాసురుడు, పౌండ్రక వాసుదేవుడు, నరకాసురుడు, జరాసంధుడు, కాలయవనుడు మున్నగు దుష్ట రాజులను సంహరించి భూభారాన్ని బాపిన మహా బలవంతులు.” అని దేవకీదేవి బలరామ కృష్ణులను ప్రశంసించి, “మీరు తలచుకుంటే సృష్టి స్థితి లయాలు జరిపే పరమపురుషులు. అవన్నీ మీ లీలావిలాసాలు. నేను మిమ్మల్ని నమ్మిన దానిని. నా కోరిక వినండి నాయనలారా!”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1139

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Tuesday, May 10, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౩౮(538)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1137-సీ.
అవనీశ! యొక్కనాఁ డానకదుందుఖి-
  భార్య పద్మాక్షుండు బలుఁడుఁ దొల్లి
శరధిలోఁ జొచ్చిన గురుతనూభవునిని-
  మరలంగఁ దెచ్చిన మహిమ లెల్ల
జనములు దమలోన సన్నుతుల్‌ సేయంగ-
  విని తన సుతులు దుర్వృత్తుఁడైన
కంసుచే నిహతులై కాలునిపురి నున్న-
  వారి నందఱఁ జూడఁ గోరి కృష్ణ
10.2-1137.1-తే.
బలులకడ కేగి కన్నుల బాష్పకణము
లొలుక "నో రామ! రామ! నిత్యోన్నతాత్మ!
పరమపావనమూర్తి! యో మురవిభేది!
యిందిరానాథ! యోగీశ్వరేశ! కృష్ణ!

భావము:
ఇంతక్రితం బలరామకృష్ణులు సముద్రంలో పడిపోయిన తమ గురుపుత్రుడిని మళ్ళీ తెచ్చి ఇచ్చిన విషయం ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండగా, వసుదేవుడి భార్య దేవకీదేవి విన్నది. కంసునిచేత వధింపబడి యముని సదనంలో ఉన్న తన బిడ్డలను చూడాలని అమె మనసులో కోరిక బలపడింది. అమె బలరామ కృష్ణుల దగ్గరకు వెళ్ళి కన్నీరు కారుస్తూ “ఓ రామా! ఓ కృష్ణా! పరమోన్నతాత్ములారా! పరమ పావన మూర్తులారా! మురాసుర సంహారీ! శ్రీపతి! యోగీశ్వరేశ్వర!” అంటూ వారిని పలువిధాలుగా ప్రస్తుతించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1137

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Monday, May 9, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౩౭(537)

( వసుదేవుని గ్రతువు ) 

10.2-1134-ఆ.
మరలి మరలి "కృష్ణ! మాధవ! గోవింద!
పద్మనాభ! భక్త పారిజాత!
దేవదేవ!" యనుచుఁ దివిరి చూచుచు మధు
రాభిముఖులు నగుచు నరిగి రంత.
10.2-1135-క.
క్రమమున నచ్చటఁ బ్రావృ
ట్సమయం బగుటయును బంధుజన యాదవ వ
ర్గము లోలిఁ గొలువ సురగణ
నమితులు బలకృష్ణు లాత్మనగరంబునకున్.
10.2-1136-వ.
వచ్చి సుఖంబుండు నంత.

భావము:
కృష్ణ! మాధవ! గోవింద! పద్మనాభ! భక్తపారిజాతమా! దేవాధిదేవా! అనుకుంటూ శ్రీకృష్ణనామాలు జపిస్తూ మాటిమాటికీ వెనుతిరిగి చూస్తూ, పోలేక పోలేక నందుడూ అతని అనుచరులూ మధురానగరం వైపు సాగిపోయారు. ఇలా శ్యమంతకపంచకంలో ఉండగా వర్షాకాలం వచ్చింది. బంధువులు పరివారం సేవిస్తూ ఉండగా, దేవతలచే సైతము కొలువబడువారు అయిన బలరామకృష్ణులు తమ ద్వారకానగరం చేరుకున్నారు. అంతట అందరూ ద్వారక చేరి సుఖంగా కాలం గడుపుతున్న సమయంలో....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=79&Padyam=1135

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

శ్రీకృష్ణ విజయము - ౫౩౬(536)

( వసుదేవుని గ్రతువు ) 

10.2-1132-చ.
జలరుహలోచనాది యదుసత్తము లందఱు నన్నిభంగులం
గలిత విభూషణాంబర నికాయము లిచ్చి బహూకరించి వీ
డ్కొలిపిన నందముఖ్యులు ముకుందపదాబ్జ మరందపాన స
ల్లలిత నిజాత్మ షట్పదములన్ మరలించుచు నెట్టకేలకున్.
10.2-1133-వ.
చనిచని.

భావము:
తరువాత పద్మాక్షుడు శ్రీకృష్ణుడు తక్కిన యాదవ ప్రముఖులు అందరు నందుడికి అతడి పరివారానికి తగిన ఆభరణాలు వస్త్రాలు సర్వం బహుకరించి వీడ్కోలు పలికారు. ముకుందుని చరణారవింద మకరంద పానంతో మత్తిల్లిన చిత్తాలనే తుమ్మెదలను బలవంతంగా మరలించుకుని నందుడు మొదలైనవారు ప్రయాణం సాగించారు. అలా ప్రయాణమైన నందాదులు....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=79&Padyam=1132

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, May 5, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౩౫(535)

( వసుదేవుని గ్రతువు ) 

10.2-1130-ఉ.
ఆ తఱి నుగ్రసేన వసుధాధిప, పంకజనాభ, ముష్టికా
రాతులు దమ్ము నర్థి మధురప్రియభాషల నిల్వ వేఁడినం
గౌతుక మాత్మ నివ్వటిలఁగా వసియించిరి గోపగోపికా
వ్రాతముతోడ నచ్చట ధరావర! నందయశోద లిమ్ములన్.
10.2-1131-క.
హరినయముల హరి ప్రియముల
హరిమధురాలాపములను హరికథల మనో
హరలీలఁ దగిలి నందుఁడు
నిరుపమగతి నచట మూఁడు నెల లుండె నృపా!

భావము:
ఆ తరుణంలో, ఉగ్రసేన మహారాజు బలరామ కృష్ణులూ తియ్యని మాటలతో ఉండమని మరీ మరీ వేడారు. వారి మాట మన్నించి నందుడు యశోదా గోపగోపికలతోసహా కొన్నాళ్ళుపాటు తృప్తిగా అక్కడే ఉన్నారు. ఓ పరీక్షిన్మహారాజా! ఆ విధంగా శ్రీకృష్ణుని మంచితనాన్నీ, మర్యాదనూ, మాటల మాధుర్యాన్నీ, హరి మనోహరమైన లీలావిలాసాలు వింటూ నందుడు మూడునెలలు అక్కడనే ఉన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=79&Padyam=1131

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, May 4, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౩౪(534)

( వసుదేవుని గ్రతువు ) 

10.2-1129-వ.
అని యభ్యర్థించి య మ్మునీంద్రుల యాజకులంగా వరించి, య ప్పుణ్యతీర్థోపాంతంబున మహేంద్రామితవైభవంబున, నష్టాదశ భార్యాసమేతుండై దీక్షఁ గైకొని, యమ్మహాధ్వరంబు వేదోపదిష్ట విధిం బరిసమాప్తించి, ఋత్విఙ్నికాయంబుల బహుదక్షిణలం దనిపి, భార్యాసమేతుండై యవభృథస్నానం బాచరించి, వివిధ రత్నమణి మయభూషణ విచిత్రాంబర సురభి సుమానులేపనంబులు ధరించి, నిఖిల భూదేవ ముని బంధు రాజలోకంబుల నుచిత సత్కారంబులఁ బ్రీతులం గావించిన వారును గృష్ణానుమతి నాత్మనివాసంబులకుం జని; రందు.

భావము:
వసుదేవుడు ఆ మునీంద్రులను ఋత్విక్కులుగా ఎంచుకుని, శ్యమంతపంచకతీర్థం సమీపంలో దేవేంద్రుడిని మించిన వైభవంతో భార్యలు పద్దెనిమిది మందితో సమేతంగా యాగదీక్షను గైకొన్నాడు. ఆ యజ్ఞాన్ని శాస్త్రప్రకారం పూర్తిచేసాడు. ఋత్విక్కులను అనేక దక్షిణలతో సంతృప్తి పరిచాడు. భార్యలతో కలిసి అవభృథస్నానం చేసాడు. పిమ్మట, వివిధ మణిమయ భూషణాలు, నూతనవస్త్రాలు, పరిమళభరితమైన పూలదండలు, మనోహరమైన మైపూతలు ధరించాడు. బ్రాహ్మణులనూ మునులనూ బంధువులనూ రాజసమూహాన్నీ సముచిత సత్కారాలతో సంతోషింప చేసాడు. వారు కూడా శ్రీకృష్ణుడి అనుమతి తీసుకొని తమతమ నివాసాలకు తిరిగి వెళ్ళారు. అప్పుడు....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=79&Padyam=1129

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, May 3, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౩౩(533)

( వసుదేవుని గ్రతువు ) 

10.2-1127-క.
వరతనయాధ్యయనంబులఁ
దరియించితి ఋణయుగంబుఁ; దడయక ధరణీ
వర! దేవ ఋణము సవనా
చరణుఁడవై యీఁగు టొప్పు సమ్మతితోడన్"
10.2-1128-క.
అనవుడు న వ్వసుదేవుఁడు
మునివరులకు ననియె వినయమున "మీరలు సె
ప్పిన యట్లు మఖము సేసెద
దినకరనిభులార! మీరు దీర్పఁగవలయున్!"

భావము:
ఓ వసుదేవ మహారాజా! నీవు ఉత్తములు అయిన పుత్రుని మూలంగా పితృఋణం తీర్చుకున్నావు. వేదము చదువుట వలన ఋషిఋణము తీర్చుకున్నావు. ఇలా రెండు ఋణాలు తీర్చావు. ఇంక ఉచితమైన పని, యజ్ఞం చేసి దేవఋణాన్ని తీర్చుకోవడం.” ఈ విధంగా వివరించిన మహర్షులు మాటలు విని, వసుదేవుడు వారితో ఇలా అన్నాడు. “ తేజోనిధులైన ఓ మహర్షులారా! మీరు ఉపదేశించిన ప్రకారం యాగం చేస్తాను. దానిని మీరే ఋత్విజులై జరిపించాలి. అని వినయంగా వారికి మనవి చేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=79&Padyam=1128

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, May 2, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౩౨(532)

( వసుదేవుని గ్రతువు ) 

10.2-1124-వ.
అదియునుం గాక.
10.2-1125-క.
దేవర్షి పితృ ఋణంబులు
భూవర! మఖ వేదపాఠ పుత్రులచేతన్
వావిరి నీఁగని పురుషుఁడు
పోవు నధోలోకమునకుఁ బుణ్యచ్యుతుఁడై.
10.2-1126-వ.
అట్లగుటం జేసి నీవును.

భావము:
అంతేకాక ఓ వసుదేవా! యజ్ఞాలు చేసి దేవతలఋణం; వేదాధ్యయనం చేసి ఋషిఋణం; పుత్రుని వలన పితృఋణం తీర్చుకోవాలి; ఇలా ఈ ఋణత్రయాన్ని తీర్చలేని మానవుడు పుణ్యాలకు దూరమై అధోలోకానికి పోతాడు. అందువల్ల

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=79&Padyam=1125

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, May 1, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౩౧(531)

( వసుదేవుని గ్రతువు ) 

10.2-1123-సీ.
అ మ్మునీశ్వరులకు నానకదుందుభి-
  యతిభక్తి వందనం బాచరించి
"తాపసోత్తములార! ధర్మతత్త్వజ్ఞులు-
  మన్నించి వినుఁడు నా విన్నపంబు
సత్కర్మ వితతిచే సంచితకర్మ చ-
  యంబు వాపెడు నుపాయంబు నాకు
ఘన దయామతిఁ జెప్పుఁ" డనిన న మ్మునివరుల్‌-
  భూవరుల్‌ విన వసుదేవుఁ జూచి
10.2-1123.1-తే.
యెలమిఁ "బలికిరి నిఖిల యజ్ఞేశుఁ డైన
కమలలోచనుఁ గూర్చి యాగములు సేయు;
కర్మమునఁ బాయు నెట్టి దుష్కర్మ మైన;
నిదియె ధర్మంబు గాఁగ నీ మదిఁ దలంపు.

భావము:
వసుదేవుడు ఆ మహర్షులకు నమస్కారం చేసి, “ఋషివరులారా! మీరు ధర్మతత్వజ్ఞులు. క్షమించి నా మనవి ఆలకించండి. సత్కర్మల ద్వారా పూర్వజన్మ కర్మలను పోగొట్టుకునే ఉపాయం నాకు దయతో తెలియ జెప్పండి.” అని ప్రార్థించాడు. అప్పుడా మునీశ్వరులు రాజులు అందరూ వింటూండగా వసుదేవునితో ఇలా అన్నారు. “ఈ శ్రీకృష్ణుడు సమస్త యజ్ఞాలకూ అధీశ్వరుడు; ఈ పుండరీకాక్షుడి గురించి చేసే యాగం వలన ఎలాంటి దుష్కర్మమైనా తొలగిపోతుంది. దీన్నే ధర్మంగా గ్రహించు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=79&Padyam=1123

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :