Thursday, March 31, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౦౯(509)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1083-సీ.
పాంచాలితో మద్రపతిసుత యిట్లను-
  "సంగీతవిద్యా విశారదుండు
నారదుచేతి వీణాస్వనకలిత మై-
  నట్టి గోవింద కథామృతంబు
దవిలి యేఁ గ్రోలి చిత్తము దన్మయత్వంబు-
  నొంది మోదించుచు నుండునంత
దుహితృవత్పలుఁడు మద్గురుఁడు దా నది విని-
  సదుపాయ మొక్కటి మదిఁ దలంచి
10.2-1083.1-తే.
చదల నెబ్భంగి నైన గోచరము గాక
వారి మధ్యములో నభివ్యాప్తి దోఁచు
మత్స్యయంత్రంబు కల్పించి మనుజు లెంత
వారి కై నను దివ్వ మోవంగరాని.
10.2-1084-తే.
ధనువుఁ బవిచండ నిష్ఠురాస్త్రంబు నచట
సంచితంబై న గంధపుష్పాక్షతలనుఁ
బూజగావించి యునిచి "యే పురుషుఁ డేని
నిద్ధబలమున నీ చాప మెక్కు వెట్టి. 

భావము:
“మద్ర రాజు పుత్రిక లక్షణ పాంచాల రాజు పుత్రి ద్రౌపదితో ఇలా అన్నది, “నారదుడు సంగీత విద్యలోనూ, తన మహతీ వీణాలాపనలలోనూ మహాపండితుడు. సతత గోవిందనామ పారాయణుడు. అట్టి మహతీ స్వన మాధుర్యంతో కూడిన నారదుడు చేసే ముకుందుని కధాసుథలు తనివితీరా గ్రోలి పరవశించేదానిని. కూతురుపై ఎంతో వాత్యల్యం గల వాడు నా తండ్రి, ఈ విషయం తెలిసి నా మనసు గ్రహించాడు. నా వివాహానికి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆకాశంలో కంటికి కానబడని విధంగా మత్స్యయంత్రాన్ని ఏర్పాటుచేసి, క్రింద ఉన్న నీటిలో అది ప్రతిబింబించేలాగ ఏర్పాటు చేయించాడు. ఎవరైనా సరే చేపను ఆ నీటిలోని ప్రతిబంబం ద్వారా తప్ప కనిపెట్టలేరు. ఒక విల్లూ, వజ్రాయుధానికి సాటివచ్చే ఒక గట్టి బాణాన్ని అక్కడ ఉంచి. గంథపుష్పాక్షతలతో పూజించాడు. “ఎవరైతే తన బలం ప్రదర్శించి ఈ విల్లు ఎక్కుపెట్టి...


http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=77&Padyam=1083 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :



  

No comments: