Thursday, March 31, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౦౮(508)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1082-వ.
అట్టియెడఁ గృష్ణకథావిశేషంబులు పరితోషంబున నుగ్గడించుచుఁ బ్రసంగ వశంబున నా రుక్మిణీదేవి మొదలగు శ్రీకృష్ణుభార్యలం గనుంగొని పాంచాలి యిట్లనియె. “మిమ్ముఁ బుండరీకాక్షుండు వివాహంబయిన తెఱంగులు వినిపింపుఁడన వారును దమ పరిణయంబుల తెఱంగులు మున్ను నే నీకుం జెప్పిన విధంబున వినిపించి; రందు సవిస్తరంబుగాఁ దెలియం బలుకని మద్రరాజకన్యకా వృత్తాంతం బా మానిని పాంచాలికిం జెప్పిన విధంబు విను మని శుకుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె. 

భావము:
ఆ సమయంలో ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని గాథలను సంతోషంతో చెప్తూ ఉంది. అలా చెప్తూ రుక్మిణి మొదలైన అంతఃపుర కాంతలతో. “కలువకన్నుల కన్నయ్య మిమ్మల్ని కల్యాణమాడిన కబుర్ల వివరాలు అన్నీ చెప్పండి.” అని కోరింది. ఒక్క లక్షణ తప్ప తక్కిన శ్రీకృష్ణుని భార్యలు అందరి వివాహ వృత్తాంతాలను పరీక్షిత్తూ! ఇంతకు మునుపు నేను నీకు చెప్పి ఉన్నాను కదా. వారు ఆ వివరాలే ద్రౌపదికి చెప్పారు. మద్రదేశాధిపతి బృహత్సేనుడి పుత్రి లక్షణ తనను కృష్ణుడు పరిణయ మాడిన సన్నివేశాన్ని ద్రౌపదికి చెప్పిన వివరాలు చెప్తాను, వినుము.” అని శుకమహర్షి పరీక్షిత్తునకు చెప్పసాగాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=77&Padyam=1082 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :



 

No comments: