Monday, March 21, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౦౨(502)

( నందాదులు చనుదెంచుట ) 

10.2-1070-చ.
"వనజదళాక్షులార! బలవద్రిపు వర్గములన్ జయింపఁగాఁ
జని తడవయ్యె; దీనికి భృశంబుగ మీ మది నల్గకుండుఁడీ!
యనయము దైవ మిట్లు సచరాచరజాలము నొక్కవేళఁ గూ
ర్చును నొకవేళఁ బాపును మరుద్ధతతూల తృణంబులం బలెన్.
10.2-1071-సీ.
"తరలాక్షులార! మద్భక్తి చేతనులకుఁ-
  దనరు మోక్షానందదాయకంబు
జప తపో వ్రత దాన సత్కర్మముల ముక్తి-
  కలుగంగ నేరదు కానఁ దలఁప
విధి శివ సనకాది విమలచిత్తంబులఁ-
  బొడమని భక్తి మీ బుద్ధులందు
జనియించె మీ పూర్వ సంచితసౌభాగ్య-
  మెట్టిదో యది తుదముట్టె నింక
10.2-1071.1-తే.
నటమటము గాదు మీకు నెన్నఁటికి నైనఁ
గలుగనేరవు నిరయసంగతములైన
జన్మకర్మము లిటమీఁద మన్మనీష
సుమహితధ్యానలార! యో! రమణులార! 

భావము:
కలువరేకుల వంటి కన్నులున్న కాంతలారా! బలవంతులైన శత్రువులను జయించటానికి వెళ్ళాము. తిరిగిరావడానికి ఆలస్యమైనది. అందుచేత మీరు అంతగా అలుగవద్దు. ఎప్పుడూ గాలికి ఎగురగొట్టబడే దూదిపింజలలాగ, గడ్డిపరకలలాగ చరాచర ప్రపంచం దైవసంకల్పాన్ని అనుసరించి ఒక్కోసారి కలుస్తూ, ఒక్కోసారి విడిపోతూ ఉంటుంది. అనురాగంతో రెపరెపలాడే ప్రకాశవంతమైన కనులు కలిగిన ఓ సుందరీమణులారా! నాపై భక్తికల మనసులు గలవారికి మోక్షం సులభసాధ్యము, ఆనందదాయకము అవుతుంది. కేవలం జపము, తపస్సు, దానాలు మున్నగు సత్కార్యాలతోటి ముక్తి కలుగదు. శివుడు, బ్రహ్మదేవుడు సనక సనందాదులకు సైతం తమ హృదయాలలో అంకురించని అంతటి గాఢమైన భక్తి మీలో మొలకెత్తింది. మీరు పుర్వజన్మలలో చేసిన సుకృతాల విశేషం పరిపూర్ణంగా ఫలించింది. మీ పుణ్యఫలం వ్యర్థం కాదు. నా యందలి అధికమైన ధ్యానం గల బుద్ధి వలన, ఇక ఎప్పటికీ నరక హేతువులైన జన్మకర్మలు మీకు కలుగవు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=76&Padyam=1071 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




No comments: