Sunday, March 20, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౦౧(501)

( నందాదులు చనుదెంచుట ) 

10.2-1068-చ.
నళినదళాక్షుఁ జూచి నయనంబులు మోడ్వఁగఁ జాల కాత్మలన్
వలచి తదీయమూర్తి విభవంబు దలంచుచుఁ గౌఁగిలించుచుం
బులకలు మేన జాదుకొనఁ బొల్తులు సొక్కిరి బ్రహ్మమున్ మనం
బులఁ గని చొక్కు యోగిజనముం బురుడింపఁగ మానవేశ్వరా!
10.2-1069-చ.
పొలఁతుల భావ మాత్మఁ గని ఫుల్లసరోరుహలోచనుండు వా
రలనపు డేకతంబునకు రమ్మని తోకొని పోయి యందు న
ర్మిలిఁ బరిరంభణంబు లొనరించి లసద్దరహాసచంద్రికా
కలిత కపోలుఁడై పలికెఁ గాంతల భక్తినితాంతచిత్తలన్. 

భావము:
పద్మదళాక్షుడు గోపాలుడిని చూస్తున్నంతసేపూ ఆ గోపికలు తమ కళ్ళ రెప్పలను వాల్చలేకపోయారు. వారు కృష్ణుని జగన్మోహన సౌందర్య వైభవాన్ని వర్ణించుకుంటూ, తమ మనసులలో కౌగలించుకుంటూ, బ్రహ్మసాక్షాత్కారం పొందిన యోగులలాగా ఆ గోపస్త్రీలు పరవశించగా వారి తనువులు గగుర్పొడిచాయి. గోపికల భావం గ్రహించిన శ్రీకృష్ణుడు ఏకాంతప్రదేశానికి వారిని పిలుచుకొని వెళ్ళి, ప్రేమతో కౌగలించుకుని భక్తిపరవశులైన ఆ కాంతలతో చక్కని చిరునవ్వులు నవ్వుతూ ఇలా అన్నాడు 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=76&Padyam=1069 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




No comments: