Thursday, March 24, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౦౫(505)

( నందాదులు చనుదెంచుట ) 

10.2-1076-ఉ.
ధర్మతనూభవుం గని పదంబులకున్ నతుఁడై సపర్యలన్
నిర్మలభక్తిమై నడపి "నీవునుఁ దమ్ములు బంధుకోటి స
త్కర్మ చరిత్రులై తగు సుఖంబుల నొప్పుచునున్న వారె" నా
నర్మిలిఁ బాండవాగ్రజుఁడు నమ్మధుసూదనుతోడ నిట్లనున్.
10.2-1077-క.
"సరసిజనాభ! భవత్పద
సరసీరుహ మాశ్రయించు జను లతిసౌఖ్య
స్ఫురణం బొలుపారుచు భువిఁ
జరియింపరె! భక్త పారిజాత! మురారీ! 

భావము:
తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజును చూసి, అతని పాదములకు నమస్కరించి, “ధర్మరాజా! నీవూ, నీ తమ్ముళ్ళూ, బంధుజనాలూ సత్కర్మ నిరతులై సుఖంగా ఉన్నారా?” అని అడిగాడు. అంతట ధర్మరాజు ప్రీతితో మధుసూదనుడైన శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు. పద్మనాభా! భక్తుల పాలిటి పారిజాతమా! మురారి! నీ పాదారవిందాలను ఆశ్రయించినవారు నిత్యసౌఖ్యాలతో అత్యంత సంతుష్టులై ఉంటారు కదా. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=76&Padyam=1077 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




No comments: