Friday, March 11, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౯౬(496)

( కుంతీదేవి దుఃఖంబు ) 

10.2-1057-సీ.
"తల్లి! నీ కేల సంతాపింప మనమునఁ-
  దలవఁక విధినేల సొలసె? దింత
యఖిల నియామకుండగు నీశ్వరుఁడు మాయ-
  యవనికాంతరుఁడైన యట్టి సూత్ర
ధారుని కైవడిఁ దగిలి నటింపఁగ-
  మనుజులు కీలుబొమ్మలు దలంపఁ;
గావున విధిసేఁతఁ గడిచి వర్తింపంగ-
  దేవతలకునైనఁ దీఱ; దట్లు
10.2-1057.1-తే.
క్రోధచిత్తుండు కంసుఁడు బాధవఱుప
నిలయములు దప్పి నే మడవులఁ జరింప
ఘనకృపానిధి యీ హరి గలుగఁబట్టి
కోరి మా కిండ్లు గ్రమ్మఱఁ జేరఁ గలిగె. "
10.2-1058-వ.
అని యూరడిలం బలుకు నవసరంబున. 

భావము:
“తల్లీ! కుంతీ! నీవు బాధపడడం దేనికమ్మా? విధిని నిందించడ మెందుకు? అన్నింటికీ కర్త ఈశ్వరుడే; మాయ అనే తెరవెనుక ఉన్న సూత్రధారి వంటివాడు అయిన ఆయన; నడిపిస్తుంటే నటించే ఈ మానవులు అంతా అతని చేతిలో కీలుబొమ్మలు; కనుక విధికి ఎదురీదడం దేవతలకైనా సాధ్యం కాదు. ఇంతకు ముందు దుర్మార్గుడైన కంసుడు మమ్మల్ని క్రూరంగా బాధించాడు. మేము మా స్వస్థలం వదిలి, అడవుల పాలై, నానా అవస్థలూ పడ్డాము. కరుణాసింధు వైన ఈ కృష్ణుడి అనుగ్రహంచేత మేము ఆ ఇక్కట్ల నుండి గట్టెక్కి ఇలా ఉన్నాము.” ఈ మాదిరిగా వసుదేవుడు కుంతిని ఊరడించాడు. ఆ సమయంలో.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=75&Padyam=1057 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




No comments: