Saturday, March 5, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౯౧(491)

( శమంతకపంచకమున కరుగుట ) 

10.2-1045-క.
ఆ రాజులు గాంచిరి నిజ
నారీయుతు లగుచు నంగనాపరివారున్,
ధీరున్, దానవకులసం
హారున్, గోపీమనోవిహారు, నుదారున్.
10.2-1046-వ.
కని య మ్మాధవ బలదేవులు సేయు సముచిత పూజావిధానంబులం బరితృప్తులై, యమ్ముకుందు సాన్నిధ్యంబు గలిగి, తదీయ సంపద్విభవాభిరాము లై విలసిల్లుచున్న యుగ్రసేనాది యదు వృష్ణి పుంగవులం జూచి, వారలతోడ నా రాజవరులు మాధవుండు విన నిట్లనిరి. 

భావము:
ఆ రాజులు అందరూ సతీసమేతంగా వచ్చి, ప్రియకాంతా పరివారాలతో కూడి ఉన్న శ్రీకృష్ణుని, మహాధీశాలి, రాక్షస కులాంతకుని గోపికా మనోవిహారుని దర్శనం చేసుకున్నారు. అలా కృష్ణదర్శన కుశలులైన ఆ రాజశ్రేష్ఠులను బలకృష్ణులు కూడ సాదరంగా సత్కరించి వారికి ఎంతో ఆనందం కలిగించారు. అతని అనుగ్రహ లబ్ధ వైభవంతో ప్రకాశిస్తూ, శ్రీకృష్ణ సన్నిధిలో ఉన్న ఉగ్రసేనాది యాదవ ప్రముఖులను చూసి శ్రీకృష్ణుడికి వినపడేలా ఇలా అన్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=74&Padyam=1046 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




No comments: