Tuesday, March 22, 2022
శ్రీకృష్ణ విజయము - ౫౦౩(503)
( నందాదులు చనుదెంచుట )
10.2-1072-సీ.
అభిలభూతములకు ననయంబు నాది మ-
ధ్యాంతరాంతర్భహిర్వ్యాప్తి నైన
ఘటపటాదిక భూతకార్యంబులకు నుపా-
దానకారణములై తనరునట్టి
గగనానిలానలకక్షోణులను భూత-
పంచకం బైక్యత వడయుఁ గాదె
లోకంబులందుఁ బంచీకరణవ్యవ-
స్థలచేత నట్టి భూతముల రీతి
10.2-1072.1-తే.
గగనముఖభూత తత్కార్యకారణములఁ
దగిలి యాధార హేతుభూతంబ నైన
నాకుఁ బర మన్య మొక్కఁ డెన్నంగ లేడు
విమలమతులార! మాటలు వేయునేల? "
10.2-1073-తే.
అనినఁ దెలివొంది వారు దేహాభిమాన
ములు సమస్తంబు విడిచి "యో! నలిననాభ!
నిఖిలజగదంతరాత్మ! మానిత చరిత్ర!
భక్తజనమందిరాంగణపారిజాత!
భావము:
సమస్త జీవుల బహిరంతరాల్లోనూ సర్వ కాల సర్వావస్థలలోను నేనుంటాను. సకల ప్రాణుల కార్యకలాపాలకూ పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాల సంబంధమే కారణము. ఘటపటాది న్యాయం ప్రకారం వీటిని ఉపాదాన కారణములు అంటారు. అటువంటి పంచభూతాలకూ ఆధారము అయినవాడను నేనే. కనుక నేనే సర్వమునకూ కర్తను. అటువంటి నాకు స్వపరాది తారతమ్యాలు లేవు. నిర్మల హృదయులారా! ఈ విషయంలో ఏ సందేహము కాని, తర్కవితర్కాలు కాని అక్కర లేదు. ఈ విధముగా, శ్రీకృష్ణుడు తన మహత్మ్యాన్ని విశదీకరించగా వినిన గోపికలు వివేకవంతులై దేహాభిమానాలను విసర్జించారు. అచ్యుతుని అనంత గుణాలను ఇలా ప్రస్తుతించారు “ఓ పద్మనాభ! సచ్చరిత్రా! భక్తజన కల్పవృక్షమా! సమస్త లోకాల లోన ఉండు అంతరాత్మా!
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=76&Padyam=1072
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment