Wednesday, March 9, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౯౫(495)

( కుంతీదేవి దుఃఖంబు ) 

10.2-1054-క.
"ఓ యన్న! పాండుతనయులు
నీ యల్లుం డ్రడవులందు నెఱి మృగములతోఁ
బాయని యిడుమలఁ బడఁ గరు
ణాయత్తుల రగుచు మీర లరయఁగ వలదే?"
10.2-1055-వ.
అని బహుప్రకారంబుల సంతాపించుచు మఱియు నిట్లనియె.
10.2-1056-క.
"అతిబలవంతపు విధి దాఁ
బ్రతికూలంబైనఁ గలరె బంధువు?" లనుచున్
ధృతి గలఁగ బాష్పజలపూ
రితలోచన యగు సహోదరిం జూచి యనెన్. 

భావము:
“అన్నయ్యా! పాండురాజుకు పుత్రులు, నీకు అల్లుళ్ళూ అయిన పాండవులు కీకారణ్యాలలో భీకరమృగాల మధ్య పలుబాధలు పడతున్నారు. వారిని మీరు దయార్ద్రహృదయంతో చూడాలి కదా.” అంటూ కుంతీదేవి పరిపరివిధాలుగా పరితపిస్తూ వసుదేవుడితో ఇంకా ఇలా అన్నది. “బహు బలవత్తరమైన విధి, ప్రతికూలంగా ఉంటే, ఇంకా బంధువులంటూ ఎవరుంటారులే?” అంటూ కంటతడి పెడుతున్న సోదరి కుంతితో వసుదేవుడు ఇలా అన్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=75&Padyam=1056 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: