10.2-1064-చ.
స్థిరమతితోడ రోహిణియు దేవకియుం దగ నందగోప సుం
దరిఁ గని కౌఁగిలించికొని తత్కృతులెల్లఁ దలంచి "యింతి! నీ
వరుఁడును నీవు బంధుజనవత్సలతన్ మును చేయుసత్కృతుల్
మఱవఁగ వచ్చునే? తలఁప మా కిఁక నెన్నఁటికిం దలోదరీ!
10.2-1065-క.
జననం బందుట మొదలుగ
ఘనమోహముతోడఁ బెంచు కతమునఁ దమకున్
జననీ జనకులు వీరని
మనములఁ దలపోయలేరు మము నీ తనయుల్.
భావము:
రోహిణి దేవకి ఇద్దరూ ఆ నందుని సతి యశోదాదేవిని ప్రేమతో కౌగలించుకొన్నారు. ఆమె చేసిన మంచి పనులను తలంచుకుని, వారు ఆమెతో ఇలా అన్నారు. “మగువా! ఇంతకు ముందు బంధుప్రీతితో, నీవూ నీ భర్తా చేసిన ఎనలేని మంచిపనులను ఎన్నటికైనా మరువగలమా? పుట్టిన దగ్గరనుండి మీరే బలరామ కృష్ణులను అపారమైన అనురాగంతో పెంచి పెద్దచేసారు. కనుకనే, ఈ కుమారులు ఇప్పటికీ మమ్మల్ని తల్లిదండ్రుల మని భావింపలేకున్నారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=76&Padyam=1065
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment