Wednesday, March 2, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౮౮(488)

( శమంతకపంచకమున కరుగుట ) 

10.2-1040-క.
భూసురవరులకు ననుపమ
వాసోలంకార ధేను వసు రత్న ధరి
త్రీ సుమహిత వస్తువు లు
ల్లాసంబున దాన మిచ్చి లాలితు లగుచున్.
10.2-1041-క.
పునరవగాహనములు పెం
పొనరం గావించి బంధుయుక్తముగా భో
జనకృత్యంబులు దీర్చి స
దనురాగము లుల్లసిల్ల నచ్చోటఁ దగన్.
10.2-1042-క.
ఘనశాఖాకీర్ణములై
యినరశ్ములు దూఱనీక యెసకం బెసఁగన్
ననిచిన పొన్నల నీడల
ననిచిన వేడుకల నందనందన ముఖ్యుల్‌. 

భావము:
గృహ, భూషణ, భూ, సువర్ణ, రత్న, గోదానాలు చేసారు. మఱియు, అనేక గొప్ప వస్తువులు మున్నగువాటిని సాటిలేని దానాలు, మనోజ్ఞంగా బ్రాహ్మణోత్తములకు ఇచ్చారు. దానాలు చేసాక, శమంతపంచకంలో మరల స్నానాలు చేసి, బలరామ కృష్ణులు బంధువులతో కలసి భోజనాలు చేసారు. ఘనమైన అన్యోన్యో ఆదరాభిమానలతో చక్కగా అక్కడ సూర్యకిరణాలుకూడా ప్రవేశించడానికి వీలులేనంత దట్టంగా పెరిగి చిగురించిన పొన్నచెట్ల నీడలో వారు విశేషమైన సమ్మోదంతో కూర్చున్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=74&Padyam=1042 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




No comments: