Thursday, March 3, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౯౦(490)

( శమంతకపంచకమున కరుగుట ) 

10.2-1044-వ.
మున్న చనుదెంచి యున్న మత్స్యౌశీనర, కోసల, విదర్భ, కురు, సృంజయ, కాంభోజ, కేకయ, మద్ర, కుంత్యారట్ట, కేరళాది భూపతులును; మఱియుం దక్కిన రాజవరులును హితులును; నంద గోపాది గోపాలురును; గోపికాజనంబులును; ధర్మరాజానుగతులై వచ్చిన భీష్మ, ద్రోణ, ధృతరాష్ట్ర, గాంధారీ, కుంతీ, పాండవ, తద్దార నివహ, సంజయ, విదుర, కృప, కుంతిభోజ, విరాట, భీష్మక, నగ్నజి, ద్ద్రుపద, శైబ్య, ధృష్టకేతు, కాశిరాజ, దమఘోష, విశాలాక్ష, మైథిల, యుధామన్యు, సుశర్మలును, సపుత్త్రకుండైన బాహ్లికుండును మొదలుగాననేకులు నుగ్రసేనాది యాదవ ప్రకరంబులం బూజలం దృప్తులం జేసిన వారునుం బ్రముదితాత్ములై; రయ్యెడ. 

భావము:
వీరికంటే ముందుగా ఎందరో క్షత్రియ ప్రముఖులు మున్నగు వారు ఆ పుణ్యతీర్థాన్ని సేవించడానికి వచ్చి ఉన్నారు. ఆ మత్స్య, ఉశీనర, కోసల, విదర్భ, కురు, సృంజయ, కాంభోజ, కేకయ, మద్ర, కుంతి, ఆరట్ట, కేరళ మున్నగు సకల దేశాధీశ్వరులూ; శ్రేయోభిలాషులు; నందగోపాది గోపాలకులూ; ధర్మరాజుతో కలసివచ్చిన భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, సతీ సమేతులైన పాండవులు; సంజయుడు, విదురుడు, కృపాచార్యులు, కుంతిభోజుడు, విరాటుడు, భీష్మకుడు, నగ్నజిత్తు, ద్రుపదుడు, శైబ్యుడు, ధృష్టకేతుడు, కాశిరాజు, దమఘోషుడు, విశాలాక్షుడు, మైథిలుడు, యుధామన్యువు, సుశర్మలును; పుత్రసమేతంగా వచ్చిన బాహ్లికుడు; మొదలైన వారందరూ ఉగ్రసేనాది యాదవ ముఖ్యులచే పూజలందుకున్నారు. అందుకు వారంతా ఎంతో సంతోషించారు. ఆ సమయంలో.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=74&Padyam=1044 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




No comments: