Sunday, March 6, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౯౨(492)

( శమంతకపంచకమున కరుగుట ) 

10.2-1047-మ
"మనశాస్త్రంబులువాక్కులున్మనములున్మాంగల్యముంబొందిపా
వనమై యొప్పెడి నే రమావిభుని భాస్వత్పాదపంకేజ సే
చనతోయంబుల నే మహాత్ముని పదాబ్జాతంబు లెందేని సోఁ
కినచో టెల్లను ముక్తి హేతువగు, నీ కృష్ణుండె పో! చూడఁగన్.
10.2-1048-చ.
సనక సనందనాది మునిసత్తము లంచిత యోగదృష్టిచేఁ
బనివడి యాత్మలన్ వెదకి పట్ట నగోచరమైన మూర్తి యి
ట్లనవరతంబు మాంస నయనాంచల గోచరుఁ డయ్యెనట్టె! యే
మన నగు? వీరిపుణ్యమున కాదట నెట్టితపంబు సేసిరో? 

భావము:
ఈ శ్రీకృష్ణుడు సామాన్యుడు కాడు. తెలియండి. మన శాస్త్రాలు, మాటివ్వడాలు, మనసు పెట్టడాలు, శుభాకాంక్షలు అన్నీ ఈ పరంధాముని పాదపద్మతీర్ధం వలన పవిత్రములు అవుతున్నాయి; ఈ మహాత్ముడి పాదస్పర్శకు నోచుకున్న ప్రదేశాలు అన్నీ ముక్తిదాయకాలే. అంతటి మహానుభావుడు ఈయన. సనకసనందాది మహామునులు తమ యోగదృష్టితో ఆత్మసాక్షాత్కారం చేసుకోదలచినా గోచరంకాని మంగళమూర్తిని, ఇలా ఈ ఉగ్రసేనాది యాదవులు ఎల్లవేళలా భౌతిక నేత్రాలతో కన్నులారా చూస్తున్నారు. వీరి పుణ్యము ఎంతటిదో? వీరు ఎంత నిష్ఠతో తపస్సు చేసి ఇది పొందారో? 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=74&Padyam=1048 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




No comments: