10.2-1062-క.
వసుదేవుఁడు వారికి సం
తసమునఁ గావించె సముచితక్రియ లంతన్
ముసలియు హరియును మ్రొక్కిరి
వెస నందయశోదలకును వినయం బెసఁగన్.
10.2-1063-వ.
అట్లు నమస్కృతులుసేసి, యాలింగనంబులు గావించి, నయనారవిందంబుల నానందబాష్పంబుల దొరఁగ నఱలేని స్నేహంబులు చిత్తంబుల నత్తమిల్ల నేమియుం బలుకకుండి; రంత నయ్యశోదాదేవి రామకృష్ణుల నిజాంకపీఠంబుల నునిచి యక్కునం గదియందిగిచి, చెక్కిలి ముద్దుగొని, శిరంబులు మూర్కొని, చిబుకంబులు పుడుకుచుఁ, బునఃపునరాలింగనంబులు గావించి, పరమానందంబునం బొందుచు నున్నంతఁ బదంపడి.
భావము:
వసుదేవుడు సంతోషంతో వారికి సముచిత సత్కారాలు చేసాడు. బలరాముడు శ్రీకృష్ణుడు వినయంగా నందయశోదలకు నమస్కరించారు. అలా నందయశోదలకు బలరామకృష్ణులు మ్రొక్కిన పిమ్మట. వారిని కౌగలించుకుని నిండుగా స్నేహభావాలు, భక్త్యనురాగాలు పెల్లుబికి కనుల వెంట అనందబాష్పాలు పొంగిపొరలగా మాటలురాక మౌనంగా ఉన్నారు. అంతట, యశోదాదేవి బలరామకృష్ణులను ఒడిలో కుర్చుండపెట్టుకున్నది; వారిని తన గుండెలకు హత్తుకున్నది; చెక్కిలి ముద్దాడింది; మూర్ధం ఆఘ్రాణించింది; చిబుకాలు నిమురుతూ పలుమార్లు కౌగలించుకొని పరమానందం పొందింది. ఆ తరువాత
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=76&Padyam=1063
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment