Sunday, March 13, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౯౭(497)

( నందాదులు చనుదెంచుట ) 

10.2-1059-క.
"నందయశోదలు గోపక
బృందంబులు గోపికలునుఁ బిరిగొని పరమా
నందంబునఁ జనుదెంచిరి
మందరధరుఁ జూచువేడ్క మనములఁ బొడమన్.
10.2-1060-వ.
ఇట్లు సనుదెంచిన.
10.2-1061-క.
అతిచిరకాల సమాగతు
నతని నిరీక్షించి వృష్ణి యాదవ భోజ
ప్రతతులు నెదురేఁగి సము
న్నతితో నాలింగనములు నడపిరి వరుసన్. 

భావము:
శ్రీకృష్ణుడిని చూడాలనే ఆనందంతో నంద యశోదలు, గోపాలురను గోపికలను వెంటబెట్టుకుని వచ్చారు. అలా నందమహారాజు విచ్చేయడం చూసి ఈ విధంగా చాలాకాలం తర్వాత వచ్చిన నందుని వృష్ణి, భోజ, యాదవ ప్రముఖులు అందరూ వరుసగా ఎదురేగి ప్రేమతో పరామర్శించి, కౌగలించుకొని స్వాగతం పలికారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=76&Padyam=1061 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




No comments: