Friday, March 25, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౦౬(506)

( నందాదులు చనుదెంచుట ) 

10.2-1078-వ.
అదియునుం గాక,
10.2-1079-సీ.
సుమహిత స్వప్న సుషుప్తి జాగరములన్-
  మూఁడవస్థలఁ బాసి వాఁడి మిగిలి
వెలినుందు లో నుందు; విశ్వమై యుందువు-
  విశ్వంబు నీయందు వెలుఁగుచుండు;
భవదీయ మహిమచేఁ బాటిల్లు భువనంబు-
  లుదయించు నొక వేళ నుడిగి మఁడుగు;
సంచి తాఖండిత జ్ఞానివై యొప్పుచు-
  నవిహత యోగమాయాత్మఁ దనరి
10.2-1079.1-తే.
దురితదూరులు నిత్యముక్తులకుఁ జెంద
నలవియై పెంపు దీపింతు వంబుజాక్ష!
ఘనకృపాకర! నఖిలవికారదూర!
నీకు మ్రొక్కెద సర్వలోకైకనాథ!" 

భావము:
అంతేకాకుండా పద్మాక్షా! నిఖిల లోకాధినాథ! నిర్వికార! నిరతిశయ కృపాసముద్రుడ! నీవు జాగ్రత్త, స్వప్న, నిద్రావస్థలు అనే అవస్థాత్రయానికి అతీతుడవు; అఖండ జ్ఞానస్వరూపుడవు; సకల లోకాలకు అధినాథుడవు; సర్వవ్యాపివి; విశ్వమే నీవు; నీవే విశ్వం; ఈ విశ్వమునకు వెలుపల లోపల వ్యాపించి ఉంటావు; ఈ విశ్వం నీ యందే నిలచి ఉంటుంది; సృష్టి స్థితి లయాలు నీ సంకల్పాధీనాలు; యోగమాయ నీకు లోబడి ఉంటుంది; పాపదూరులై నిత్యముక్తులైన యోగులు నిను చేరుట కొఱకే ప్రయత్నిస్తారు; అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=76&Padyam=1079 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :



  

No comments: