Thursday, March 31, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౦౯(509)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1083-సీ.
పాంచాలితో మద్రపతిసుత యిట్లను-
  "సంగీతవిద్యా విశారదుండు
నారదుచేతి వీణాస్వనకలిత మై-
  నట్టి గోవింద కథామృతంబు
దవిలి యేఁ గ్రోలి చిత్తము దన్మయత్వంబు-
  నొంది మోదించుచు నుండునంత
దుహితృవత్పలుఁడు మద్గురుఁడు దా నది విని-
  సదుపాయ మొక్కటి మదిఁ దలంచి
10.2-1083.1-తే.
చదల నెబ్భంగి నైన గోచరము గాక
వారి మధ్యములో నభివ్యాప్తి దోఁచు
మత్స్యయంత్రంబు కల్పించి మనుజు లెంత
వారి కై నను దివ్వ మోవంగరాని.
10.2-1084-తే.
ధనువుఁ బవిచండ నిష్ఠురాస్త్రంబు నచట
సంచితంబై న గంధపుష్పాక్షతలనుఁ
బూజగావించి యునిచి "యే పురుషుఁ డేని
నిద్ధబలమున నీ చాప మెక్కు వెట్టి. 

భావము:
“మద్ర రాజు పుత్రిక లక్షణ పాంచాల రాజు పుత్రి ద్రౌపదితో ఇలా అన్నది, “నారదుడు సంగీత విద్యలోనూ, తన మహతీ వీణాలాపనలలోనూ మహాపండితుడు. సతత గోవిందనామ పారాయణుడు. అట్టి మహతీ స్వన మాధుర్యంతో కూడిన నారదుడు చేసే ముకుందుని కధాసుథలు తనివితీరా గ్రోలి పరవశించేదానిని. కూతురుపై ఎంతో వాత్యల్యం గల వాడు నా తండ్రి, ఈ విషయం తెలిసి నా మనసు గ్రహించాడు. నా వివాహానికి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆకాశంలో కంటికి కానబడని విధంగా మత్స్యయంత్రాన్ని ఏర్పాటుచేసి, క్రింద ఉన్న నీటిలో అది ప్రతిబింబించేలాగ ఏర్పాటు చేయించాడు. ఎవరైనా సరే చేపను ఆ నీటిలోని ప్రతిబంబం ద్వారా తప్ప కనిపెట్టలేరు. ఒక విల్లూ, వజ్రాయుధానికి సాటివచ్చే ఒక గట్టి బాణాన్ని అక్కడ ఉంచి. గంథపుష్పాక్షతలతో పూజించాడు. “ఎవరైతే తన బలం ప్రదర్శించి ఈ విల్లు ఎక్కుపెట్టి...


http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=77&Padyam=1083 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :



  

శ్రీకృష్ణ విజయము - ౫౦౮(508)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1082-వ.
అట్టియెడఁ గృష్ణకథావిశేషంబులు పరితోషంబున నుగ్గడించుచుఁ బ్రసంగ వశంబున నా రుక్మిణీదేవి మొదలగు శ్రీకృష్ణుభార్యలం గనుంగొని పాంచాలి యిట్లనియె. “మిమ్ముఁ బుండరీకాక్షుండు వివాహంబయిన తెఱంగులు వినిపింపుఁడన వారును దమ పరిణయంబుల తెఱంగులు మున్ను నే నీకుం జెప్పిన విధంబున వినిపించి; రందు సవిస్తరంబుగాఁ దెలియం బలుకని మద్రరాజకన్యకా వృత్తాంతం బా మానిని పాంచాలికిం జెప్పిన విధంబు విను మని శుకుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె. 

భావము:
ఆ సమయంలో ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని గాథలను సంతోషంతో చెప్తూ ఉంది. అలా చెప్తూ రుక్మిణి మొదలైన అంతఃపుర కాంతలతో. “కలువకన్నుల కన్నయ్య మిమ్మల్ని కల్యాణమాడిన కబుర్ల వివరాలు అన్నీ చెప్పండి.” అని కోరింది. ఒక్క లక్షణ తప్ప తక్కిన శ్రీకృష్ణుని భార్యలు అందరి వివాహ వృత్తాంతాలను పరీక్షిత్తూ! ఇంతకు మునుపు నేను నీకు చెప్పి ఉన్నాను కదా. వారు ఆ వివరాలే ద్రౌపదికి చెప్పారు. మద్రదేశాధిపతి బృహత్సేనుడి పుత్రి లక్షణ తనను కృష్ణుడు పరిణయ మాడిన సన్నివేశాన్ని ద్రౌపదికి చెప్పిన వివరాలు చెప్తాను, వినుము.” అని శుకమహర్షి పరీక్షిత్తునకు చెప్పసాగాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=77&Padyam=1082 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :



 

Monday, March 28, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౦౭(507)

( నందాదులు చనుదెంచుట ) 

10.2-1080-క.
అని వినుతించిన నచ్చటి
జనపాలక బంధుమిత్ర సకలజనములున్
విని యనురాగిల్లిరి నె
మ్మనముల నానంద జలధిమగ్నులు నగుచున్.
10.2-1081-తే.
అట్టి యొప్పగువేళ నెయ్యంబు మెఱసి
యొక్కచోటను సంతోషయుక్తు లగుచు
దానవాంతక సతులును ద్రౌపదియును
గూడి తమలోన ముచ్చట లాడుచుండి. 

భావము:
ఈ మాదిరి ధర్మరాజు శ్రీకృష్ణుడిని ప్రస్తుతించగా విని అక్కడ ఉన్న రాజులు, బంధు మిత్రులు, సకల జనులు రంజిల్లిన నిండు మనసులతో ఎంతో సంతోషించారు. అట్టి సంతోష సమయంలో అన్యోన్య స్నేహం అతిశయించగా శ్రీకృష్ణుని కాంతలూ, ద్రౌపదీ ఒకచోట కూడి కబుర్లు చెప్పుకోసాగారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=76&Padyam=1081 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :



  

Friday, March 25, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౦౬(506)

( నందాదులు చనుదెంచుట ) 

10.2-1078-వ.
అదియునుం గాక,
10.2-1079-సీ.
సుమహిత స్వప్న సుషుప్తి జాగరములన్-
  మూఁడవస్థలఁ బాసి వాఁడి మిగిలి
వెలినుందు లో నుందు; విశ్వమై యుందువు-
  విశ్వంబు నీయందు వెలుఁగుచుండు;
భవదీయ మహిమచేఁ బాటిల్లు భువనంబు-
  లుదయించు నొక వేళ నుడిగి మఁడుగు;
సంచి తాఖండిత జ్ఞానివై యొప్పుచు-
  నవిహత యోగమాయాత్మఁ దనరి
10.2-1079.1-తే.
దురితదూరులు నిత్యముక్తులకుఁ జెంద
నలవియై పెంపు దీపింతు వంబుజాక్ష!
ఘనకృపాకర! నఖిలవికారదూర!
నీకు మ్రొక్కెద సర్వలోకైకనాథ!" 

భావము:
అంతేకాకుండా పద్మాక్షా! నిఖిల లోకాధినాథ! నిర్వికార! నిరతిశయ కృపాసముద్రుడ! నీవు జాగ్రత్త, స్వప్న, నిద్రావస్థలు అనే అవస్థాత్రయానికి అతీతుడవు; అఖండ జ్ఞానస్వరూపుడవు; సకల లోకాలకు అధినాథుడవు; సర్వవ్యాపివి; విశ్వమే నీవు; నీవే విశ్వం; ఈ విశ్వమునకు వెలుపల లోపల వ్యాపించి ఉంటావు; ఈ విశ్వం నీ యందే నిలచి ఉంటుంది; సృష్టి స్థితి లయాలు నీ సంకల్పాధీనాలు; యోగమాయ నీకు లోబడి ఉంటుంది; పాపదూరులై నిత్యముక్తులైన యోగులు నిను చేరుట కొఱకే ప్రయత్నిస్తారు; అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=76&Padyam=1079 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :



  

Thursday, March 24, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౦౫(505)

( నందాదులు చనుదెంచుట ) 

10.2-1076-ఉ.
ధర్మతనూభవుం గని పదంబులకున్ నతుఁడై సపర్యలన్
నిర్మలభక్తిమై నడపి "నీవునుఁ దమ్ములు బంధుకోటి స
త్కర్మ చరిత్రులై తగు సుఖంబుల నొప్పుచునున్న వారె" నా
నర్మిలిఁ బాండవాగ్రజుఁడు నమ్మధుసూదనుతోడ నిట్లనున్.
10.2-1077-క.
"సరసిజనాభ! భవత్పద
సరసీరుహ మాశ్రయించు జను లతిసౌఖ్య
స్ఫురణం బొలుపారుచు భువిఁ
జరియింపరె! భక్త పారిజాత! మురారీ! 

భావము:
తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజును చూసి, అతని పాదములకు నమస్కరించి, “ధర్మరాజా! నీవూ, నీ తమ్ముళ్ళూ, బంధుజనాలూ సత్కర్మ నిరతులై సుఖంగా ఉన్నారా?” అని అడిగాడు. అంతట ధర్మరాజు ప్రీతితో మధుసూదనుడైన శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు. పద్మనాభా! భక్తుల పాలిటి పారిజాతమా! మురారి! నీ పాదారవిందాలను ఆశ్రయించినవారు నిత్యసౌఖ్యాలతో అత్యంత సంతుష్టులై ఉంటారు కదా. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=76&Padyam=1077 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Tuesday, March 22, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౦౩(503)


( నందాదులు చనుదెంచుట )

10.2-1072-సీ.
భిలభూతములకు నయంబు నాది మ-
  ధ్యాంతరాంతర్భహిర్వ్యాప్తి నైన
టపటాదిక భూతకార్యంబులకు నుపా-
  దానకారణములై నరునట్టి
గనానిలానలక్షోణులను భూత-
  పంచకం బైక్యత డయుఁ గాదె
లోకంబులందుఁ బంచీరణవ్యవ-
  స్థలచేత నట్టి భూముల రీతి
10.2-1072.1-తే.
గనముఖభూత తత్కార్యకారణములఁ
గిలి యాధార హేతుభూతంబ నైన
నాకుఁ బర మన్య మొక్కఁ డెన్నంగ లేడు
విమలమతులార! మాటలు వేయునేల? "
10.2-1073-తే.
నినఁ దెలివొంది వారు దేహాభిమాన
ములు సమస్తంబు విడిచి "యో! లిననాభ!
నిఖిలజగదంతరాత్మ! మానిత చరిత్ర!
క్తజనమందిరాంగణపారిజాత!

భావము:
సమస్త జీవుల బహిరంతరాల్లోనూ సర్వ కాల సర్వావస్థలలోను నేనుంటాను. సకల ప్రాణుల కార్యకలాపాలకూ పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాల సంబంధమే కారణము. ఘటపటాది న్యాయం ప్రకారం వీటిని ఉపాదాన కారణములు అంటారు. అటువంటి పంచభూతాలకూ ఆధారము అయినవాడను నేనే. కనుక నేనే సర్వమునకూ కర్తను. అటువంటి నాకు స్వపరాది తారతమ్యాలు లేవు. నిర్మల హృదయులారా! ఈ విషయంలో ఏ సందేహము కాని, తర్కవితర్కాలు కాని అక్కర లేదు. ఈ విధముగా, శ్రీకృష్ణుడు తన మహత్మ్యాన్ని విశదీకరించగా వినిన గోపికలు వివేకవంతులై దేహాభిమానాలను విసర్జించారు. అచ్యుతుని అనంత గుణాలను ఇలా ప్రస్తుతించారు “ఓ పద్మనాభ! సచ్చరిత్రా! భక్తజన కల్పవృక్షమా! సమస్త లోకాల లోన ఉండు అంతరాత్మా!



http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=76&Padyam=1072

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :



Monday, March 21, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౦౨(502)

( నందాదులు చనుదెంచుట ) 

10.2-1070-చ.
"వనజదళాక్షులార! బలవద్రిపు వర్గములన్ జయింపఁగాఁ
జని తడవయ్యె; దీనికి భృశంబుగ మీ మది నల్గకుండుఁడీ!
యనయము దైవ మిట్లు సచరాచరజాలము నొక్కవేళఁ గూ
ర్చును నొకవేళఁ బాపును మరుద్ధతతూల తృణంబులం బలెన్.
10.2-1071-సీ.
"తరలాక్షులార! మద్భక్తి చేతనులకుఁ-
  దనరు మోక్షానందదాయకంబు
జప తపో వ్రత దాన సత్కర్మముల ముక్తి-
  కలుగంగ నేరదు కానఁ దలఁప
విధి శివ సనకాది విమలచిత్తంబులఁ-
  బొడమని భక్తి మీ బుద్ధులందు
జనియించె మీ పూర్వ సంచితసౌభాగ్య-
  మెట్టిదో యది తుదముట్టె నింక
10.2-1071.1-తే.
నటమటము గాదు మీకు నెన్నఁటికి నైనఁ
గలుగనేరవు నిరయసంగతములైన
జన్మకర్మము లిటమీఁద మన్మనీష
సుమహితధ్యానలార! యో! రమణులార! 

భావము:
కలువరేకుల వంటి కన్నులున్న కాంతలారా! బలవంతులైన శత్రువులను జయించటానికి వెళ్ళాము. తిరిగిరావడానికి ఆలస్యమైనది. అందుచేత మీరు అంతగా అలుగవద్దు. ఎప్పుడూ గాలికి ఎగురగొట్టబడే దూదిపింజలలాగ, గడ్డిపరకలలాగ చరాచర ప్రపంచం దైవసంకల్పాన్ని అనుసరించి ఒక్కోసారి కలుస్తూ, ఒక్కోసారి విడిపోతూ ఉంటుంది. అనురాగంతో రెపరెపలాడే ప్రకాశవంతమైన కనులు కలిగిన ఓ సుందరీమణులారా! నాపై భక్తికల మనసులు గలవారికి మోక్షం సులభసాధ్యము, ఆనందదాయకము అవుతుంది. కేవలం జపము, తపస్సు, దానాలు మున్నగు సత్కార్యాలతోటి ముక్తి కలుగదు. శివుడు, బ్రహ్మదేవుడు సనక సనందాదులకు సైతం తమ హృదయాలలో అంకురించని అంతటి గాఢమైన భక్తి మీలో మొలకెత్తింది. మీరు పుర్వజన్మలలో చేసిన సుకృతాల విశేషం పరిపూర్ణంగా ఫలించింది. మీ పుణ్యఫలం వ్యర్థం కాదు. నా యందలి అధికమైన ధ్యానం గల బుద్ధి వలన, ఇక ఎప్పటికీ నరక హేతువులైన జన్మకర్మలు మీకు కలుగవు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=76&Padyam=1071 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Sunday, March 20, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౦౧(501)

( నందాదులు చనుదెంచుట ) 

10.2-1068-చ.
నళినదళాక్షుఁ జూచి నయనంబులు మోడ్వఁగఁ జాల కాత్మలన్
వలచి తదీయమూర్తి విభవంబు దలంచుచుఁ గౌఁగిలించుచుం
బులకలు మేన జాదుకొనఁ బొల్తులు సొక్కిరి బ్రహ్మమున్ మనం
బులఁ గని చొక్కు యోగిజనముం బురుడింపఁగ మానవేశ్వరా!
10.2-1069-చ.
పొలఁతుల భావ మాత్మఁ గని ఫుల్లసరోరుహలోచనుండు వా
రలనపు డేకతంబునకు రమ్మని తోకొని పోయి యందు న
ర్మిలిఁ బరిరంభణంబు లొనరించి లసద్దరహాసచంద్రికా
కలిత కపోలుఁడై పలికెఁ గాంతల భక్తినితాంతచిత్తలన్. 

భావము:
పద్మదళాక్షుడు గోపాలుడిని చూస్తున్నంతసేపూ ఆ గోపికలు తమ కళ్ళ రెప్పలను వాల్చలేకపోయారు. వారు కృష్ణుని జగన్మోహన సౌందర్య వైభవాన్ని వర్ణించుకుంటూ, తమ మనసులలో కౌగలించుకుంటూ, బ్రహ్మసాక్షాత్కారం పొందిన యోగులలాగా ఆ గోపస్త్రీలు పరవశించగా వారి తనువులు గగుర్పొడిచాయి. గోపికల భావం గ్రహించిన శ్రీకృష్ణుడు ఏకాంతప్రదేశానికి వారిని పిలుచుకొని వెళ్ళి, ప్రేమతో కౌగలించుకుని భక్తిపరవశులైన ఆ కాంతలతో చక్కని చిరునవ్వులు నవ్వుతూ ఇలా అన్నాడు 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=76&Padyam=1069 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Friday, March 18, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౦౦(500)

( నందాదులు చనుదెంచుట ) 

10.2-1066-క.
అంటిన ప్రేమను వీరిం
గంటికి ఱెప్పడ్డమైన గతిఁ బెంపఁగ మా
కంటెన్ నెన రౌటను మీ
యింటన్ వసియించి యుండి రిన్నిదినంబుల్‌. "
10.2-1067-వ.
అని యిట్లు ప్రియాలాపంబులు పలుకుచుండు నవసరంబున గోపాలసుందరు లమందానంద కందళితహృదయ లయి హృదయేశ్వరుం డైన గోవిందుఁడు చిరకాలసమాగతుం డగుటం జేసి, యతనిం జూచు తలంపు లుల్లంబుల వెల్లిగొనం జేరి. 

భావము:
వీరిని కంటిరెప్పలాగా మీరు పెంచారు. వీరిమీద మాకంటే మీకే ప్రేమ ఎక్కువ. అందుకే ఇన్నాళ్ళూ మీ ఇంట్లో వీరు సుఖంగా ఉన్నారు.” రోహిణీదేవి దేవకీదేవి యశోదాదేవితో ఇలా సల్లాపాలు పలుకుతూ ఉండగా, గోపకాంతలు రాకరాక వచ్చిన తమ ప్రాణేశ్వరుడైన శ్రీకృష్ణుడిని చూడాలనే తహతహ ఆనందం హృదయాలలో పొంగిపొరలుతుండగా అక్కడికి చేరారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=76&Padyam=1067 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Wednesday, March 16, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౯౯(499)

( నందాదులు చనుదెంచుట ) 

10.2-1064-చ.
స్థిరమతితోడ రోహిణియు దేవకియుం దగ నందగోప సుం
దరిఁ గని కౌఁగిలించికొని తత్కృతులెల్లఁ దలంచి "యింతి! నీ
వరుఁడును నీవు బంధుజనవత్సలతన్ మును చేయుసత్కృతుల్‌
మఱవఁగ వచ్చునే? తలఁప మా కిఁక నెన్నఁటికిం దలోదరీ!
10.2-1065-క.
జననం బందుట మొదలుగ
ఘనమోహముతోడఁ బెంచు కతమునఁ దమకున్
జననీ జనకులు వీరని
మనములఁ దలపోయలేరు మము నీ తనయుల్‌. 

భావము:
రోహిణి దేవకి ఇద్దరూ ఆ నందుని సతి యశోదాదేవిని ప్రేమతో కౌగలించుకొన్నారు. ఆమె చేసిన మంచి పనులను తలంచుకుని, వారు ఆమెతో ఇలా అన్నారు. “మగువా! ఇంతకు ముందు బంధుప్రీతితో, నీవూ నీ భర్తా చేసిన ఎనలేని మంచిపనులను ఎన్నటికైనా మరువగలమా? పుట్టిన దగ్గరనుండి మీరే బలరామ కృష్ణులను అపారమైన అనురాగంతో పెంచి పెద్దచేసారు. కనుకనే, ఈ కుమారులు ఇప్పటికీ మమ్మల్ని తల్లిదండ్రుల మని భావింపలేకున్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=76&Padyam=1065 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Monday, March 14, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౯౮(498)

( నందాదులు చనుదెంచుట ) 

10.2-1062-క.
వసుదేవుఁడు వారికి సం
తసమునఁ గావించె సముచితక్రియ లంతన్
ముసలియు హరియును మ్రొక్కిరి
వెస నందయశోదలకును వినయం బెసఁగన్.
10.2-1063-వ.
అట్లు నమస్కృతులుసేసి, యాలింగనంబులు గావించి, నయనారవిందంబుల నానందబాష్పంబుల దొరఁగ నఱలేని స్నేహంబులు చిత్తంబుల నత్తమిల్ల నేమియుం బలుకకుండి; రంత నయ్యశోదాదేవి రామకృష్ణుల నిజాంకపీఠంబుల నునిచి యక్కునం గదియందిగిచి, చెక్కిలి ముద్దుగొని, శిరంబులు మూర్కొని, చిబుకంబులు పుడుకుచుఁ, బునఃపునరాలింగనంబులు గావించి, పరమానందంబునం బొందుచు నున్నంతఁ బదంపడి. 

భావము:
వసుదేవుడు సంతోషంతో వారికి సముచిత సత్కారాలు చేసాడు. బలరాముడు శ్రీకృష్ణుడు వినయంగా నందయశోదలకు నమస్కరించారు. అలా నందయశోదలకు బలరామకృష్ణులు మ్రొక్కిన పిమ్మట. వారిని కౌగలించుకుని నిండుగా స్నేహభావాలు, భక్త్యనురాగాలు పెల్లుబికి కనుల వెంట అనందబాష్పాలు పొంగిపొరలగా మాటలురాక మౌనంగా ఉన్నారు. అంతట, యశోదాదేవి బలరామకృష్ణులను ఒడిలో కుర్చుండపెట్టుకున్నది; వారిని తన గుండెలకు హత్తుకున్నది; చెక్కిలి ముద్దాడింది; మూర్ధం ఆఘ్రాణించింది; చిబుకాలు నిమురుతూ పలుమార్లు కౌగలించుకొని పరమానందం పొందింది. ఆ తరువాత 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=76&Padyam=1063 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Sunday, March 13, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౯౭(497)

( నందాదులు చనుదెంచుట ) 

10.2-1059-క.
"నందయశోదలు గోపక
బృందంబులు గోపికలునుఁ బిరిగొని పరమా
నందంబునఁ జనుదెంచిరి
మందరధరుఁ జూచువేడ్క మనములఁ బొడమన్.
10.2-1060-వ.
ఇట్లు సనుదెంచిన.
10.2-1061-క.
అతిచిరకాల సమాగతు
నతని నిరీక్షించి వృష్ణి యాదవ భోజ
ప్రతతులు నెదురేఁగి సము
న్నతితో నాలింగనములు నడపిరి వరుసన్. 

భావము:
శ్రీకృష్ణుడిని చూడాలనే ఆనందంతో నంద యశోదలు, గోపాలురను గోపికలను వెంటబెట్టుకుని వచ్చారు. అలా నందమహారాజు విచ్చేయడం చూసి ఈ విధంగా చాలాకాలం తర్వాత వచ్చిన నందుని వృష్ణి, భోజ, యాదవ ప్రముఖులు అందరూ వరుసగా ఎదురేగి ప్రేమతో పరామర్శించి, కౌగలించుకొని స్వాగతం పలికారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=76&Padyam=1061 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Friday, March 11, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౯౬(496)

( కుంతీదేవి దుఃఖంబు ) 

10.2-1057-సీ.
"తల్లి! నీ కేల సంతాపింప మనమునఁ-
  దలవఁక విధినేల సొలసె? దింత
యఖిల నియామకుండగు నీశ్వరుఁడు మాయ-
  యవనికాంతరుఁడైన యట్టి సూత్ర
ధారుని కైవడిఁ దగిలి నటింపఁగ-
  మనుజులు కీలుబొమ్మలు దలంపఁ;
గావున విధిసేఁతఁ గడిచి వర్తింపంగ-
  దేవతలకునైనఁ దీఱ; దట్లు
10.2-1057.1-తే.
క్రోధచిత్తుండు కంసుఁడు బాధవఱుప
నిలయములు దప్పి నే మడవులఁ జరింప
ఘనకృపానిధి యీ హరి గలుగఁబట్టి
కోరి మా కిండ్లు గ్రమ్మఱఁ జేరఁ గలిగె. "
10.2-1058-వ.
అని యూరడిలం బలుకు నవసరంబున. 

భావము:
“తల్లీ! కుంతీ! నీవు బాధపడడం దేనికమ్మా? విధిని నిందించడ మెందుకు? అన్నింటికీ కర్త ఈశ్వరుడే; మాయ అనే తెరవెనుక ఉన్న సూత్రధారి వంటివాడు అయిన ఆయన; నడిపిస్తుంటే నటించే ఈ మానవులు అంతా అతని చేతిలో కీలుబొమ్మలు; కనుక విధికి ఎదురీదడం దేవతలకైనా సాధ్యం కాదు. ఇంతకు ముందు దుర్మార్గుడైన కంసుడు మమ్మల్ని క్రూరంగా బాధించాడు. మేము మా స్వస్థలం వదిలి, అడవుల పాలై, నానా అవస్థలూ పడ్డాము. కరుణాసింధు వైన ఈ కృష్ణుడి అనుగ్రహంచేత మేము ఆ ఇక్కట్ల నుండి గట్టెక్కి ఇలా ఉన్నాము.” ఈ మాదిరిగా వసుదేవుడు కుంతిని ఊరడించాడు. ఆ సమయంలో.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=75&Padyam=1057 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Wednesday, March 9, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౯౫(495)

( కుంతీదేవి దుఃఖంబు ) 

10.2-1054-క.
"ఓ యన్న! పాండుతనయులు
నీ యల్లుం డ్రడవులందు నెఱి మృగములతోఁ
బాయని యిడుమలఁ బడఁ గరు
ణాయత్తుల రగుచు మీర లరయఁగ వలదే?"
10.2-1055-వ.
అని బహుప్రకారంబుల సంతాపించుచు మఱియు నిట్లనియె.
10.2-1056-క.
"అతిబలవంతపు విధి దాఁ
బ్రతికూలంబైనఁ గలరె బంధువు?" లనుచున్
ధృతి గలఁగ బాష్పజలపూ
రితలోచన యగు సహోదరిం జూచి యనెన్. 

భావము:
“అన్నయ్యా! పాండురాజుకు పుత్రులు, నీకు అల్లుళ్ళూ అయిన పాండవులు కీకారణ్యాలలో భీకరమృగాల మధ్య పలుబాధలు పడతున్నారు. వారిని మీరు దయార్ద్రహృదయంతో చూడాలి కదా.” అంటూ కుంతీదేవి పరిపరివిధాలుగా పరితపిస్తూ వసుదేవుడితో ఇంకా ఇలా అన్నది. “బహు బలవత్తరమైన విధి, ప్రతికూలంగా ఉంటే, ఇంకా బంధువులంటూ ఎవరుంటారులే?” అంటూ కంటతడి పెడుతున్న సోదరి కుంతితో వసుదేవుడు ఇలా అన్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=75&Padyam=1056 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౪౯౪(494)

( శమంతకపంచకమున కరుగుట ) 

10.2-1051-వ.
అప్పుడు.
10.2-1052-క.
తన సుతులకు గాంధారీ
తనయులు గావించు నపకృతంబుల కాత్మన్
ఘనముగ నెరియుచు నచ్చటఁ
గనుఁగొనె వసుదేవు విగతకల్మషభావున్.
10.2-1053-వ.
అట్లు గనుంగొని యతనితో నిట్లనియె. 

భావము:
అప్పుడు, ఆ శమంతకక్షేత్రంలో తన కుమారులకు కౌరవులవలన కలిగిన అపకారాలకు మనస్సులో బాధపడుతూ స్మరించుకుంటుంటే తన అన్నగారు నిర్మలాత్ముడు అయిన వసుదేవుడు కనబడ్డాడు. అలా శమంతకపంచకంలో తారసపడిన తన అన్న వసుదేవుడితో కుంతీదేవి ఇలా అన్నది. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=74&Padyam=1053 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, March 7, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౯౩(493)

( శమంతకపంచకమున కరుగుట ) 

10.2-1049-మ.
నిరయస్వర్గము లాత్మఁ గైకొనక తా నిర్వాణమూర్తైన యీ
హరిఁ జూడన్, హరితోడఁ బల్క, హరిమే నంటన్, హరిం బాడఁగా
హరితో నేఁగ, సహాసనాస్తరణ శయ్యావాసులై యుండఁగన్
హరి బంధుత్వసఖిత్వముల్ గలుగు భాగ్యం బెట్లు సిద్ధించెనో?"
10.2-1050-తే.
అనుచు యాదవ వృష్ణి భోజాంధకులును
హరిదయాలబ్ధనిఖిలార్థు లగుచు నున్న
మనికిఁ దమ చిత్తములఁ బలుమాఱుఁ బొగడి
పరిణమించిరి; యంత న ప్పాండుమహిషి. 

భావము:
ఈ యాదవ పుంగవులు స్వర్గ నరకాలను లెక్కచేయక, ఈలాగున కృష్ణుడిని చూస్తూ; కృష్ణుని పొగుడుతూ; కృష్ణునితోకలసి ప్రయాణం చేస్తూ; కలసి కూర్చుంటూ; కలసి శయనిస్తూ; సాయుజ్యము పొందినట్లు ఉన్నారు. కృష్ణునితో ఈ బంధుత్వ మిత్రత్వాలు కలిగే భాగ్యం వీరికి ఎలా లభ్యము అయిందో?” అని ఆ రాజశ్రేష్ఠులంతా ఆశ్చర్యపడుతూ, శ్రీకృష్ణుడి దయవలన సిద్ధించిన సకల వైభవాలతో జీవిస్తున్న ఉగ్రసేనాది యదు వృష్ణి పుంగవులను ఆ రాజులు అందరూ అనేక సార్లు అభినందించారు. ఆ సమయంలో పాండురాజు పత్ని కుంతీదేవి.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=74&Padyam=1050 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Sunday, March 6, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౯౨(492)

( శమంతకపంచకమున కరుగుట ) 

10.2-1047-మ
"మనశాస్త్రంబులువాక్కులున్మనములున్మాంగల్యముంబొందిపా
వనమై యొప్పెడి నే రమావిభుని భాస్వత్పాదపంకేజ సే
చనతోయంబుల నే మహాత్ముని పదాబ్జాతంబు లెందేని సోఁ
కినచో టెల్లను ముక్తి హేతువగు, నీ కృష్ణుండె పో! చూడఁగన్.
10.2-1048-చ.
సనక సనందనాది మునిసత్తము లంచిత యోగదృష్టిచేఁ
బనివడి యాత్మలన్ వెదకి పట్ట నగోచరమైన మూర్తి యి
ట్లనవరతంబు మాంస నయనాంచల గోచరుఁ డయ్యెనట్టె! యే
మన నగు? వీరిపుణ్యమున కాదట నెట్టితపంబు సేసిరో? 

భావము:
ఈ శ్రీకృష్ణుడు సామాన్యుడు కాడు. తెలియండి. మన శాస్త్రాలు, మాటివ్వడాలు, మనసు పెట్టడాలు, శుభాకాంక్షలు అన్నీ ఈ పరంధాముని పాదపద్మతీర్ధం వలన పవిత్రములు అవుతున్నాయి; ఈ మహాత్ముడి పాదస్పర్శకు నోచుకున్న ప్రదేశాలు అన్నీ ముక్తిదాయకాలే. అంతటి మహానుభావుడు ఈయన. సనకసనందాది మహామునులు తమ యోగదృష్టితో ఆత్మసాక్షాత్కారం చేసుకోదలచినా గోచరంకాని మంగళమూర్తిని, ఇలా ఈ ఉగ్రసేనాది యాదవులు ఎల్లవేళలా భౌతిక నేత్రాలతో కన్నులారా చూస్తున్నారు. వీరి పుణ్యము ఎంతటిదో? వీరు ఎంత నిష్ఠతో తపస్సు చేసి ఇది పొందారో? 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=74&Padyam=1048 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Saturday, March 5, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౯౧(491)

( శమంతకపంచకమున కరుగుట ) 

10.2-1045-క.
ఆ రాజులు గాంచిరి నిజ
నారీయుతు లగుచు నంగనాపరివారున్,
ధీరున్, దానవకులసం
హారున్, గోపీమనోవిహారు, నుదారున్.
10.2-1046-వ.
కని య మ్మాధవ బలదేవులు సేయు సముచిత పూజావిధానంబులం బరితృప్తులై, యమ్ముకుందు సాన్నిధ్యంబు గలిగి, తదీయ సంపద్విభవాభిరాము లై విలసిల్లుచున్న యుగ్రసేనాది యదు వృష్ణి పుంగవులం జూచి, వారలతోడ నా రాజవరులు మాధవుండు విన నిట్లనిరి. 

భావము:
ఆ రాజులు అందరూ సతీసమేతంగా వచ్చి, ప్రియకాంతా పరివారాలతో కూడి ఉన్న శ్రీకృష్ణుని, మహాధీశాలి, రాక్షస కులాంతకుని గోపికా మనోవిహారుని దర్శనం చేసుకున్నారు. అలా కృష్ణదర్శన కుశలులైన ఆ రాజశ్రేష్ఠులను బలకృష్ణులు కూడ సాదరంగా సత్కరించి వారికి ఎంతో ఆనందం కలిగించారు. అతని అనుగ్రహ లబ్ధ వైభవంతో ప్రకాశిస్తూ, శ్రీకృష్ణ సన్నిధిలో ఉన్న ఉగ్రసేనాది యాదవ ప్రముఖులను చూసి శ్రీకృష్ణుడికి వినపడేలా ఇలా అన్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=74&Padyam=1046 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Thursday, March 3, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౯౦(490)

( శమంతకపంచకమున కరుగుట ) 

10.2-1044-వ.
మున్న చనుదెంచి యున్న మత్స్యౌశీనర, కోసల, విదర్భ, కురు, సృంజయ, కాంభోజ, కేకయ, మద్ర, కుంత్యారట్ట, కేరళాది భూపతులును; మఱియుం దక్కిన రాజవరులును హితులును; నంద గోపాది గోపాలురును; గోపికాజనంబులును; ధర్మరాజానుగతులై వచ్చిన భీష్మ, ద్రోణ, ధృతరాష్ట్ర, గాంధారీ, కుంతీ, పాండవ, తద్దార నివహ, సంజయ, విదుర, కృప, కుంతిభోజ, విరాట, భీష్మక, నగ్నజి, ద్ద్రుపద, శైబ్య, ధృష్టకేతు, కాశిరాజ, దమఘోష, విశాలాక్ష, మైథిల, యుధామన్యు, సుశర్మలును, సపుత్త్రకుండైన బాహ్లికుండును మొదలుగాననేకులు నుగ్రసేనాది యాదవ ప్రకరంబులం బూజలం దృప్తులం జేసిన వారునుం బ్రముదితాత్ములై; రయ్యెడ. 

భావము:
వీరికంటే ముందుగా ఎందరో క్షత్రియ ప్రముఖులు మున్నగు వారు ఆ పుణ్యతీర్థాన్ని సేవించడానికి వచ్చి ఉన్నారు. ఆ మత్స్య, ఉశీనర, కోసల, విదర్భ, కురు, సృంజయ, కాంభోజ, కేకయ, మద్ర, కుంతి, ఆరట్ట, కేరళ మున్నగు సకల దేశాధీశ్వరులూ; శ్రేయోభిలాషులు; నందగోపాది గోపాలకులూ; ధర్మరాజుతో కలసివచ్చిన భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, సతీ సమేతులైన పాండవులు; సంజయుడు, విదురుడు, కృపాచార్యులు, కుంతిభోజుడు, విరాటుడు, భీష్మకుడు, నగ్నజిత్తు, ద్రుపదుడు, శైబ్యుడు, ధృష్టకేతుడు, కాశిరాజు, దమఘోషుడు, విశాలాక్షుడు, మైథిలుడు, యుధామన్యువు, సుశర్మలును; పుత్రసమేతంగా వచ్చిన బాహ్లికుడు; మొదలైన వారందరూ ఉగ్రసేనాది యాదవ ముఖ్యులచే పూజలందుకున్నారు. అందుకు వారంతా ఎంతో సంతోషించారు. ఆ సమయంలో.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=74&Padyam=1044 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Wednesday, March 2, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౮౯(489)

( శమంతకపంచకమున కరుగుట ) 

10.2-1043-క.
తనరిన పల్లవ రుచిరా
సనముల నాసీను లగుచు సత్సుఖగోష్ఠిం
బెనుపొందఁగ నట వసియిం
చినచోఁ దత్పుణ్యతీర్థ సేవారతులై. 

టీకా:
తనరిన = చక్కగా నున్న; పల్లవ = చిగుళ్ళచేత; రుచిర = అందమైన; ఆసనములన్ = ఆసనములమీద; ఆసీనులు = కూర్చున్నవారు; అగుచున్ = ఔతు; సత్ = మంచి; సుఖగోష్ఠిన్ = ఇష్టాగోష్టి యందు; పెనుపొందన్ = అతిశయించి; అటన్ = అక్కడ; వసియించి = ఉండిన; చోన్ = చోటునకు; తత్ = ఆ; పుణ్యతీర్థ = పుణ్యతీర్థమును; సేవారతులు = సేవించు ఆసక్తి కలవారు; ఐ = అయ్యి. 

భావము:
ఆ పుణ్యక్షేత్రాన్ని సేవించే ఆసక్తిమీర, అక్కడ నందనందనుడు మున్నగు వారంతా, మెత్తని నవనవలాడే చిగురుటాకుల మెత్తలపై కుర్చొని సరససల్లాపాలు చేస్తూ ప్రొద్దుపుచ్చారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=74&Padyam=1043 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




శ్రీకృష్ణ విజయము - ౪౮౮(488)

( శమంతకపంచకమున కరుగుట ) 

10.2-1040-క.
భూసురవరులకు ననుపమ
వాసోలంకార ధేను వసు రత్న ధరి
త్రీ సుమహిత వస్తువు లు
ల్లాసంబున దాన మిచ్చి లాలితు లగుచున్.
10.2-1041-క.
పునరవగాహనములు పెం
పొనరం గావించి బంధుయుక్తముగా భో
జనకృత్యంబులు దీర్చి స
దనురాగము లుల్లసిల్ల నచ్చోటఁ దగన్.
10.2-1042-క.
ఘనశాఖాకీర్ణములై
యినరశ్ములు దూఱనీక యెసకం బెసఁగన్
ననిచిన పొన్నల నీడల
ననిచిన వేడుకల నందనందన ముఖ్యుల్‌. 

భావము:
గృహ, భూషణ, భూ, సువర్ణ, రత్న, గోదానాలు చేసారు. మఱియు, అనేక గొప్ప వస్తువులు మున్నగువాటిని సాటిలేని దానాలు, మనోజ్ఞంగా బ్రాహ్మణోత్తములకు ఇచ్చారు. దానాలు చేసాక, శమంతపంచకంలో మరల స్నానాలు చేసి, బలరామ కృష్ణులు బంధువులతో కలసి భోజనాలు చేసారు. ఘనమైన అన్యోన్యో ఆదరాభిమానలతో చక్కగా అక్కడ సూర్యకిరణాలుకూడా ప్రవేశించడానికి వీలులేనంత దట్టంగా పెరిగి చిగురించిన పొన్నచెట్ల నీడలో వారు విశేషమైన సమ్మోదంతో కూర్చున్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=74&Padyam=1042 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :