10.2-788-క.
"చాలుఁ బురే యహహా! యీ
కాలము గడపంగ దురవగాహం బగు నీ
తేలా తప్పెను నేఁ డీ
బాలకు వచనములచేతఁ బ్రాజ్ఞుల బుద్ధుల్?
10.2-789-వ.
ఇట్లు దప్పిన తెఱం గెట్టనినఁ బాత్రాపాత్ర వివేకంబు సేయనేర్చిన విజ్ఞాననిపుణులు, నున్నతసత్త్వ గరిష్ఠులు, బహువిధ తపోవ్రత నియమశీలురు, ననల్పతేజులు, మహైశ్వర్యశక్తిధరులుఁ, బరతత్త్వవేదులు, నఖిలలోకపాలపూజితులు, విగతపాపులుఁ, బరమయోగీంద్రులు నుండ వీరిం గైకొనక వివేకరహితులై గోపాలబాలునిం బూజసేయుటకు నెట్లు సమ్మతించిరి; పురోడాశంబు సృగాలంబున కర్హంబగునే? యదియునుంగాక.
భావము:
“ఆహా! భలే! భలే! ఎలాంటి కాలం వచ్చేసింది, దీనిని దాటడం చాలా దుర్లభంగా ఉంది. ఈ కాల ప్రభావం చూడండి, ఇంత పసివాడి మాటలకి బుద్ధిమంతులైన ఈ పెద్దల బుద్ధులు నీతిని ఎలా తప్పాయో? నీతి తప్పాయని ఎలా అంటున్నావు అంటారా! యోగ్యత అయోగ్యతలనూ నిర్ణయించ గలిగిన మహా వివేకులు, గొప్ప సత్త్వగుణ సంపన్నులు, పాపరహితులు, సకల విధ మహా తపస్సులు, వ్రతశీలులు, మహా నియమ పాలకులు, అమిత తేజోశాలురు, గొప్ప ఐశ్వర్యవంతులు, బ్రహ్మజ్ఞానులు, సమస్త లోకపాలుర చేత పూజింపబడువారు, యోగీశ్వరులు ఎందరో ఈ సభలో ఉన్నారు. వీరందరినీ లెక్కించక బుద్ధిహీనుడైన ఒక గొల్లపిల్లవాడిని పూజించటానికి ఎలా సమ్మతించారు. యజ్ఞం కోసం ఉద్దేశించిన పురోడాశం నక్కకు ఎలా అర్హమవుతుంది? అంతేకాకుండా...
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=60&Padyam=789
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment