10.2.765-వ
అని గోవిందునిం బొగడి, యద్దేవు ననుమతంబునం గుంతీసుతాగ్రజుండు పరతత్త్వవిజ్ఞాను లైన ధరిణీసురులను ఋత్విజులంగా వరియించి.
10.2-766-సీ.
సాత్యవతేయ, కశ్యప, భరద్వాజోప-
హూతి, విశ్వామిత్ర, వీతిహోత్ర,
మైత్రేయ, పైల, సుమంతు, మధుచ్ఛంద,-
గౌతమ, సుమతి, భార్గవ, వసిష్ఠ,
వామదేవాకృతవ్రణ, కణ్వ, జైమిని,-
ధౌమ్య, పరాశరాధర్వ, కవషు,
లసిత, వైశంపాయ, నాసురి, దుర్వాస,-
క్రతు, వీరసేన, గర్గ, త్రికవ్య,
10.2-766.1-ఆ.
ముఖ్యులైన పరమమునులను, గృపుని, గాం
గేయ, కుంభజాంబికేయ, విదుర,
కురుకుమార, బంధు, కులవృద్ధ, ధారుణీ
సుర, నరేంద్ర, వైశ్య, శూద్రవరుల.
10.2-767-క.
రప్పింప వారు హర్షము
లుప్పతిలఁగ నేఁగుదెంచి, యుచితక్రియలం
దప్పక కనుఁగొనుచుండఁగ
నప్పుడు విధ్యుక్త నియతులై భూమిసురుల్.
భావము:
ఈవిధంగా ధర్మరాజు కృష్ణుడిని నుతించి ఆయన ఆజ్ఞానుసారం వేదవిజ్ఞానధనులైన బ్రాహ్మణులను యజ్ఞకార్యనిర్వాహకులుగా స్వీకరించాడు. సత్యవతీ కుమారుడు వేదవ్యాసుడు, కశ్యపుడు, ఉపహూతి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వీతిహోత్రుడు, మైత్రేయుడు, పైలుడు, సుమంతుడు, మధుచ్ఛందుడు, గౌతముడు, సుమతి, భార్గవుడు, వసిష్ఠుడు, వామదేవుడు, అకృతవ్రణుడు, కణ్వుడు, జైమిని, ధౌమ్యుడు, పరాశరుడు, అధర్వుడు, కవషులు, అసితుడు, వైశంపాయనుడు, ఆసురి, దుర్వాసుడు, క్రతువు, వీరసేనుడు, గర్గుడు, త్రికవ్యుడు మొదలైన మునీశ్వరులనూ; ద్రోణుడు, కృపాచార్యుడు ఆది గురువులనూ; భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు మున్నగు కురువృద్ధులనూ; దుర్యోధనాది బంధుజనాన్నీ; అలా గురు బంధు మిత్ర కులవృద్ధులను అందరినీ, సమస్త బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ముఖ్యులనూ; ధర్మరాజు తన యజ్ఞానికి రప్పించాడు. ధర్మరాజు ఆహ్వానించిన వారంతా విచ్చేసి సంతోషంతో ఉచిత కార్యక్రమాలను పర్యవేక్షిస్తుండగా, బ్రాహ్మణశ్రేష్ఠులు శాస్త్ర ప్రకారం యజ్ఞం ప్రారంభించారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=59&Padyam=766
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment